పరిహారం ఇవ్వాలని రైస్‌మిల్‌ ఎదుట ఆందోళన

ABN , First Publish Date - 2021-11-28T06:01:11+05:30 IST

లాక్‌డౌన్‌ కాలంలో డ్రైవర్‌గా పనిచేస్తూ కరోనాకు గురై మరణించిన అండెమ్‌ సైదులు(30) కుటుంబ సభ్యులు మండలంలోని యాద్గారపల్లి ఎక్స్‌ రోడ్‌లోని వజ్ర ఇండస్ట్రీస్‌ రైస్‌మిల్లు ఎదుట పరిహరం ఇవ్వాలని ఆందోళన నిర్వహించారు.

పరిహారం ఇవ్వాలని రైస్‌మిల్‌ ఎదుట ఆందోళన
ఆందోళన నిర్వహిస్తున్న బాధితులు, కార్మికులు

 కార్మిక సంఘాల మద్దతు

మిర్యాలగూడ, నవంబర్‌ 27: లాక్‌డౌన్‌ కాలంలో డ్రైవర్‌గా పనిచేస్తూ కరోనాకు గురై మరణించిన అండెమ్‌ సైదులు(30) కుటుంబ సభ్యులు మండలంలోని యాద్గారపల్లి ఎక్స్‌ రోడ్‌లోని వజ్ర ఇండస్ట్రీస్‌ రైస్‌మిల్లు ఎదుట పరిహరం ఇవ్వాలని ఆందోళన నిర్వహించారు. తాళ్లగడ్డకు చెందిన అండెం సైదులు భార్య సంధ్యారాణి తన ముగ్గురు ఆడపిల్లలు, అత్త మామలు అండెమ్‌ బిక్షవమ్మ, గాలెయ్యలతో కలిసి మిల్లు గేటు వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. ధర్నాకు మద్దతుగా టీఆర్‌ఎస్‌ వివిధ కార్మిక విభాగాలు నేతలు సంఘీభావం తెలుపుతూ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ వజ్ర రైస్‌మిల్లులో తన భర్త  పదేళ్లు డ్రైవర్‌గా పనిచేశాడని తెలిపారు. లాక్‌డౌన్‌ కాలంలో మిల్లులో పని చేస్తున్న ఐదారుగురు కార్మికులతో పాటు తన భర్తకు  కరోనా సోకిందన్నారు. చికిత్స పొందుతూ ఈ ఏడాది జూన్‌ 3న మృతి చెందినట్లు చెప్పారు. తనకు ముగ్గురు ఆడ సంతానం కాగా అందులో ఒకరు మానసిక దివ్యాంగురాలని తెలిపారు.  మిల్లు యాజమాన్యం ముందస్తు చర్యలు తీసకోకపోవడంతోనే తన భర్త కరోనాకు గురై మరణించాడని, అందుకు మిల్లు యాజమాన్యం పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.అంజయ్య మాట్లాడుతూ మిల్లు యజమాని వజ్ర సత్యనారాయణ, అపర్ణపై లేబర్‌ కోర్టులో ఫిర్యాదు చేయగా కుటుంబానికి పరిహారం అందించి, ఆర్థ్ధికంగా ఆదుకుంటామని అంగీకరించి మరిహారం ఇవ్వకుండా దాటవేస్తున్నారని అన్నారు. తక్షణమే మృతుని కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం చెల్లించాలని, లేనిపక్షంలో రైస్‌మిల్లుల బంద్‌కు పిలుపు ఇచ్చి అన్ని కార్మిక సంఘాలతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని అన్నారు. కాగా మిల్లు యాజమాన్యం డిసెంబర్‌ 6న చర్చిద్దామని చెప్పడంతో ధర్నా విరమించారు. ధర్నాలో కార్మిక విభాగాల నేతలు పి.శ్రీనివాసరావు, ఎస్‌కె.పాష, ఆంథోని, గోవర్ధన్‌, దశరఽథ, సైదులు, గురువయ్య, నాగేశ్వరరావు, శ్రీను, నాగరాజు, రమేష్‌, రత్నాకర్‌, నవీన్‌, రాము పాల్గొన్నారు.

Updated Date - 2021-11-28T06:01:11+05:30 IST