
ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత తెలియని ఆందోళన అంతర్లీనంగా ఉంటుంది. అయితే ఈ ఆందోళనను మరింత పెంచే అలవాట్లను మార్చుకోకపోతే, ఆరోగ్యం కుంటుపడడం ఖాయం. కాబట్టి ఆ అలవాట్లేవో గ్రహించి, వాటికి దూరంగా ఉండాలి.
భోజనం మానుకోవడం: భోజనం మానేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గి, హైపోగ్లైసీమియాకు గురవుతాం. ఈ పరిస్థితి చీకాకు, నీరసం, తలతిరుగుడు, అర్థం లేని ఆందోళనలకు దారి తీస్తుంది.
కెఫీన్: కెఫీన్‌కు ఆందోళనను పెంచే గుణం ఉంటుంది. అయితే కాఫీ తాగిన కొన్ని గంటల తర్వాత ఆ ప్రభావం మొదలవుతుంది.
డీహైడ్రేషన్: సరిపడా నీళ్లు తాగనప్పుడు డీహైడ్రేషన్‌కు గురవుతాం. దాంతో శరీరం ఒత్తిడికి లోనవుతుంది. ఫలితంగా సాధారణ ఆందోళన లక్షణాలు మొదలవుతాయి.
వ్యాయామం: మన శరీరాలు కదలికలకు అనువుగా తయారయ్యాయి. రోజంతా కుర్చీలో కూర్చుని పని చేస్తూ గడిపేస్తే, వ్యాయామ లోపం మూలంగా మానసిక ఆందోళనతో బాధపడవలసి వస్తుంది.
నిద్ర: ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్రలో తరుగు ఏర్పడితే, ప్రతికూల ఆలోచనలు వేధిస్తాయి. వాటిని వదిలించుకోవడం కష్టంగా మారి, ఆందోళన మొదలవుతుంది.
చక్కెర: ఆందోళనను తాత్కాలికంగా అదుపు చేసే గుణం చక్కెరకు ఉంది. అయితే పదే పదే చక్కెరతో అదుపు చేసే ప్రయత్నం చేస్తే, రివర్స్‌లో ఆందోళన, మానసిక కుంగుబాటు సమస్యలు పెరుగుతాయి.
విరుగుడు ఇలా...
ఆందోళన వేధిస్తే, దాన్ని తగ్గించే మంచి అలవాట్లను పెంచుకోవాలి. అవేంటంటే...
పుస్తకాలు: చదవడం ద్వారా ఆందోళన 68ు తగ్గుతుంది. కాబట్టి ఆందోళనతో బాధపడేవాళ్లు పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలి.
సంగీతం: నచ్చిన సంగీతంతో ఆందోళనకు కారణమయ్యే ఒత్తిడి దూరమవుతుంది. కాబట్టి శ్రావ్యమైన సంగీతం వింటూ ఉండాలి.
నడక: శారీరకంగా చురుగ్గా ఉంటే, ఆందోళన దరి చేరదు. వ్యాయామంతో విడుదలయ్యే ఫీల్ గుడ్ హార్మోన్లు ఎండార్ఫిన్లు, ఆందోళనను వదిలించి, మనసును హుషారుగా ఉంచుతాయి.