Advertisement

దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన

Jan 24 2021 @ 00:28AM
ఆందోళనకారులతో మాట్లాడుతున్న ఎస్పీ రాహుల్‌ హెగ్డే, అడిషనల్‌ కలెక్టర్‌ అంజయ్య

ఎల్లారెడ్డిపేట, జనవరి 23: ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్‌లో రెండు వర్గాల మధ్య నెలకొన్న భూవివాదం తారా స్థాయికి చేరింది. బీజేపీ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి పోలీసులు అదుపులోకి తీసుకోవడం.. ఆ వెంటనే విడుదల చేయడంతో దళిత సంఘాల ఆధ్వర్యంలో శనివారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఎదుట రాస్తారోకో చేపట్టారు. నిందితులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ నేతలకు పోలీసులు అండగా నిలిచారని ఆరోపించారు. నిందితులను తీసుకురావాలని పట్టుబట్టారు. సీఐ బన్సీలాల్‌, ఎస్సై వెంకటకృష్ణ శాంతింపజేసేందుకు ప్రయత్నించగా తమకు అన్యాయం చేశారని పేర్కొంటూ వెంట తెచ్చుకున్న పెట్రోలు బాటిళ్లతో ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. బండి సంజయ్‌కి తలొగ్గి 15 మంది నిందితులను విడుదల చేశారని మండి పడ్డారు. మండల కేంద్రానికి చెందిన మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి ఎడ్ల రాజ్‌కుమార్‌ ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు.  అప్రమత్తమై అతన్ని అదుపులోకి తీసుకుని స్థానిక  ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అడిషనల్‌ కలెక్టర్‌ అంజయ్య, సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌ ఆందోళనకారులను శాంతింపజేసేందుకు చేసిన యత్నం ఫలించలేదు. నిందితులను రిమాండ్‌కు తరలించే వరకు  కదలబోమని తేల్చి చెప్పారు. అనంతరం జడ్పీటీసీ లక్ష్మణ్‌రావు, టీఆర్‌ఎస్‌ జిల్లా ఇన్‌చార్జి ఆగయ్య, దళిత సంఘాల నేతలతో చర్చించారు. బాధితులకు అండగా నిలిచి నిందితులకు శిక్ష పడేలా చూస్తామని పేర్కొన్నా పట్టించుకోలేదు. ఎస్పీ రావాలని నినాదాలు చేశారు. అనంతరం అక్కడికి చేరుకున్న  ఎస్పీ రాహుల్‌ హెగ్డే  నిందితులకు శిక్ష పడేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.  రాస్తారోకోకు టీఆర్‌ఎస్‌ మద్దతు ప్రకటించింది. దళిత సంఘాల నాయకులు దేవదాస్‌, భాను, శ్రీనివాస్‌, కృష్ణ, సుభాష్‌, సత్యనారాయణ, నాగరాజు, రాములు, లక్ష్మన్‌, రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


 దళితులపై దాడులకు నిరసనగా రాస్తారోకో

సిరిసిల్ల టౌన్‌: దళితులపై బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుల దాడులను  నిరసిస్తూ శనివారం సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద టీఆర్‌ఎస్‌ యువజన విభాగం ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంగనర్‌ ఎంపీ బండి సంజయ్‌ దిష్టి బొమ్మను దహనం చేశారు. టీఆర్‌ఎస్‌ యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు  మనోజ్‌ మాట్లాడుతూ ఇల్లంతకుంట మండలం రామోజీపేటలో దళితు లపై దాడులు మరవక ముందే ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్‌లో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు  దాడులు చేశారని ఆరోపిం చారు. నాయకులు వరుణ్‌, మహిముద్‌, అమ్‌జత్‌   పాల్గొన్నారు.

Follow Us on:
Advertisement