రైతుకు ‘భరోసా’ ఏదీ?

ABN , First Publish Date - 2022-05-22T05:27:56+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నవి ఊకదంపుడు మాటలేనని, రైతు భరోసాతో రైతులు ఏమాత్రం భరోసా దక్కడం లేదని ఇట్లే అర్థమైపోతుంది.

రైతుకు ‘భరోసా’ ఏదీ?
నాగేశ్వరరెడ్డి ఇంట్లోనే బస్తాలు ఉంచుకున్న దృశ్యం

వేరుశనగ కాయల కొనుగోలు నిలిపివేత

వ్యాపారుల చేతుల్లో రైతుల దగా

భరోసా ఇవ్వలేని రైతు భరోసా కేంద్రాలు


మాది రైతు ప్రభుత్వం అన్నారు.. రైతుల కోసం మా ముఖ్యమంత్రి ఏమైనా చేస్తారు.. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు పెట్టిందే వాళ్ల కోసమన్నారు. విత్తనకాయలు కొనుగోలు చేసి.. మద్దతు ధర కల్పించి.. రైతుకు భరోసాగా ఉంటామని ఊదరగొట్టారు. అయితే పల్లెల్లో రైతులు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులను ఒకసారి పరిశీలిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నవి ఊకదంపుడు మాటలేనని, రైతు భరోసాతో రైతులు ఏమాత్రం భరోసా దక్కడం లేదని ఇట్లే అర్థమైపోతుంది. రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం.. సవతి తల్లి ప్రేమ చూపుతుండడంతో.. అన్నమయ్య జిల్లాలో వేరుశనగ రైతులు వ్యాపారులను ఆశ్రయించి వాళ్ల చేతుల్లో దగా పడుతున్నారు. 


(రాయచోటి - ఆంధ్రజ్యోతి): 

సంబేపల్లె మండలం సదిపిరాళ్లవాండ్లపల్లె గ్రామం యర్రంమొరంపల్లెకు చెందిన నాగేశ్వరరెడ్డి గత ఏడాది డిసెంబరులో వ్యవసాయ బోరు కింద ఐదు ఎకరాలలో వేరుశనగను సాగు చేశాడు. దుక్కులు, కూలీలు, విత్తనకాయలు, సత్తువలు కలిపి సుమారు రూ.40 వేల వరకు ఖర్చు చేశాడు. ఎకరాకు సుమారు 80 బస్తాల వరకు దిగుబడి వచ్చింది. కాయలు అవుటన్‌ (బరువు) కూడా బాగా వచ్చింది. గత ఏడాది మాదిరే వేరుశనగ కాయలను రైతు భరోసా కేంద్రాల ద్వారా అమ్ముకోవచ్చని ఆశపడ్డాడు. అయితే ఇతని ఆశలను వమ్ము చేస్తూ.. ఈసారి రైతు భరోసా కేంద్రాలు వేరుశనగ విత్తనకాయలు కొనుగోలు చేయలేదు. (గత ఏడాది 42 కిలోల బస్తా రూ.2670 లెక్కన కొనుగోలు చేసింది.) దీంతో గత నెల రోజులుగాఇంట్లోనే వేరుశనగ బస్తాలు ఉంచుకున్నారు. ఇక ప్రభుత్వం కొనే అవకాశం లేదని నిర్ణయానికొచ్చి.. వ్యాపారుల కోసం ఎదురు చూస్తున్నాడు.


అదే గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి కూడా ఐదు ఎకరాల్లో బోర్ల కింద వేరుశనగను సాగు చేశాడు. 100 బస్తాల దిగుబడి వచ్చింది. ఏడాది రైతు భరోసా కేంద్రాల ద్వారా వేరుశనగ విత్తనకాయలు కొనడం లేదని.. 20 రోజుల కిందట రాయచోటిలో ఓ ప్రైవేటు వ్యాపారికి రూ.2700 ధరతో అమ్మేశాడు. మిషన్‌ ద్వారా కాయలు వలచడంతో.. ఆలస్యం అయితే బర్మా పురుగు పడుతుందనే భయంతో అమ్మేసినట్లు తెలిపాడు. రైతుల నుంచి వేరుశనగ కాయలు కొనేందుకు ప్రభుత్వం చొరవ చూపకపోవడంతోనే.. వ్యాపారులకు అమ్ముకోవాల్సి వచ్చిందని వాపోయారు. 


40 కుటుంబాలు..1500 బస్తాలు

సంబేపల్లె మండలం సదిపిరాళ్లవాండ్లపల్లెలో 40 కుటుంబాలు ఉన్నాయి. అందరికీ వ్యవసాయమే ఆధారం. గత ఏడాది డిసెంబరులో బోర్ల కింద సుమారు 80 ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేశారు. దాదాపు 1500 బస్తాల దిగుబడి వచ్చింది. ఇప్పుడు వీళ్ళందరూ వేరుశనగ విత్తనకాయలు అమ్ముకోవడానికి ఎదురు చూస్తున్నారు. (వీరిలో కొందరు ఇప్పటికే అమ్ముకున్నారు.) సంబేపల్లె మండలంలో గత ఏడాది రబీలో 1976 హెక్టార్లలో వేరుశనగ సాగు చేశారు. జిల్లాలో ఎక్కువగా రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాలలో వేరుశనగను సాగు చేస్తారు. ఈ మూడు నియోజకవర్గాలలో గత ఏడాది దాదాపు 22 వేల హెక్టార్లలో వేరుశనగ సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా వేరుశనగ కాయలను ప్రభుత్వం కొనుగోలు చేయలేదని తెలిసింది. ఈ దుస్థితి కేవలం సంబేపల్లె మండలం యర్రమొరంపల్లెకు చెందిన రైతులదే కాదు.. జిల్లా వ్యాప్తంగా వేరుశనగ రైతుందరిదీ. 


కొనము అనకుండానే...

ప్రస్తుతం ప్రభుత్వం అవలంభిస్తున్న తీరు చూస్తుంటే.. తాము రైతుల నుంచి వేరుశనగ కాయలు కొనము..అని నోటితో చెప్పకుండానే.. ఆ కాయలు కొనకుండానే.. డ్రామాలు ఆడుతోందని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు ప్రస్తుతం బయట మార్కెట్‌లో 42 కిలోల బస్తా రూ.2850 రూ.3000 వరకు ధర పలుకుతోంది. అయితే రైతు భరోసా కేంద్రాల నుంచి వచ్చిన అధికారులు రూ.2300లకు ఇస్తారా ? అని రైతులను అడిగారు.. ఆ ధర మాకు గిట్టుబాటు కాదనగానే.. అదే చాలు అన్నట్లుగా అధికారులు మౌనంగా ఉండిపోయారు. ప్రభుత్వానికి నిజంగా మాకు మేలు చేయాలని అని ఉంటే.. బయట మార్కెట్‌ కంటే.. కనీసం రూ.50 అయినా ఎక్కువ ఇచ్చి కొనేదని రైతులు పేర్కొంటున్నారు. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఇంకో విధంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


వ్యాపారుల చేతుల్లో దగా.. 

ప్రతి ఏడాది వ్యాపారులు, దళారులు పల్లెల్లో వేరుశనగ విత్తనకాయలు కొనుగోలు చేస్తారు. గత ఏడాది ప్రభుత్వమే కొనుగోలు చేయడంతో వ్యాపారులు కొనుగోలు చేయలేకపోయారు. అయితే ఈ ఏడాది ప్రభుత్వం ఆ బాధ్యతల నుంచి వెనక్కి తగ్గడంతో.. మళ్ళీ వ్యాపారులు పల్లెల్లో వాలిపోయారు. లెక్కప్రకారం 42 కిలోల బస్తా రూ.2700 ధరతో కొనుగోలు చేస్తున్నారు. అయితే తూకంలో 43 కిలోలు వేస్తున్నారు. (కొన్నిచోట్ల 43.5 కిలోలు కూడా ఉంటోంది.) తమ కళ్లముందే ఇలా జరుగుతున్నా.. ఏమి..? ఎందుకు ? అని రైతులు అడగలేకున్నారు. కాయల్లో రాళ్లు, చెత్త ఏమున్నా.. అడగడం లేదు.. బస్తాలు.. బస్తాలే తూకం వేస్తున్నాం.. అని వ్యాపారులు అంటుంటే.. ఎక్కడ ప్రశ్నిస్తే.. వాళ్లు వెళ్ళిపోతే.. మళ్లీ ఎవరొస్తారు..? లేకుంటే.. రాయచోటికి తీసుకెళ్ళాలని.. కళ్ల ముందే దగా జరగుతున్నా. నోరు మెదపలేకున్నారు. రైతు భరోసా కేంద్రాలలో విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ అందుబాటులో ఉండాలి. అతను రైతులు పండించిన పంటలు కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించాలి. అయితే ఇవేమీ జరగనపుడు రైతు భరోసా కేంద్రం ఎందుకో... ? ప్రభుత్వానికే తెలియాలి. 


ప్రభ్వుతమే కొనుగోలు చేయాలి

- నాగేశ్వరరెడ్డి, రైతు

గత ఏడాది మాదిరి.. ప్రభుత్వమే  రైతు భరోసా కేంద్రాల ద్వారా వేరుశనగ కాయలు కొనాలి. దీనివల్ల రైతులకు మేలు కలిగేది. వ్యాపారుల దగ్గర మోసం జరుగుతున్నా.. మాట్లాడలేని స్థితిలో రైతులు ఉన్నారు. బయట మార్కెట్‌ ధర కంటే తక్కువకు ప్రభుత్వం కొంటామని చెప్పడం దారుణం. 


రైతుల నుంచి కొనుగోలు చేయలేదు

- బి.మోహన్‌, మండల వ్యవసాయాధికారి, సంబేపల్లె

ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కన్నా.. బయట మార్కెట్‌ ధర ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ మద్దతు ధర రూ.2300 ఉండగా, బయట మార్కెట్‌ ధర రూ.2500 నుంచి రూ.3000 వరకు ఉంది. దీనివల్ల రైతుల నుంచి వేరుశనగ కాయలు ఈసారి కొనుగోలు చేయలేదు. 



Updated Date - 2022-05-22T05:27:56+05:30 IST