సంరక్షణ ఏదీ?

ABN , First Publish Date - 2021-06-06T04:02:22+05:30 IST

నిరుపేద ఆడపిల్లల కుటుంబాల కోసం గతంలో ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన బాలికా సంరక్షణ పథకం అటకెక్కింది. బాలికల చదువుతోపాటు వివాహానికి ఆర్థిక సాయానికి ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది.

సంరక్షణ ఏదీ?




 అమలుకాని బాలికా సంరక్షణ పథకం

 గడువు పూర్తయినా మంజూరు కాని నిధులు

 13,252 మంది లబ్ధిదారులు ఎదురుచూపు 

(ఇచ్ఛాపురం రూరల్‌)

నిరుపేద ఆడపిల్లల కుటుంబాల కోసం గతంలో ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన బాలికా సంరక్షణ పథకం అటకెక్కింది. బాలికల చదువుతోపాటు వివాహానికి ఆర్థిక సాయానికి ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది. పదేళ్ల పాటు పేద కుటుంబాలకు ఆసరాగా నిలిచిన ఈ పథకం.. తర్వాత అమలుకు దూరమైంది. ఏళ్లు గడుస్తున్నా సహాయం అందక, బాండ్లు గడువు పూర్తయినా నిధులు విడుదల కాక లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.25 వేల ఆదాయం లోపు ఉన్న కుటుంబాల్లో బాలికలను బాలికా సంరక్షణ పథకానికి అర్హులుగా ఎంపిక చేశారు. 20 సంవత్సరాలు దాటిన తరువాత ఒక కుటుంబంలో ఒక ఆడపిల్ల ఉంటే రూ.లక్ష చొప్పున, ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఒక్కొక్కరికీ రూ.30 వేలు చొప్పున మంజూరు చేయనున్నట్టు ప్రకటించారు. ఈ పథకం పర్యవేక్షణ ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగించారు. 1995లో ప్రారంభమైన పథకం పదేళ్ల పాటు విజయవంతంగా నడిచింది. అనంతరం లబ్ధిదారులకు నిధులు విడుదల చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలో 18 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 4192 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 22,524 మంది బాలికా సంరక్షణ పథకం లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో 9272 మందికి సాయం అందించినట్లు ఐసీడీఎస్‌ అధికారులు చెబుతున్నారు. మరో 13,252 మందికి బాలికా సంరక్షణ పథకం బాండ్లు పంపిణీ చేయగా, వారిలో 90 శాతం మందికి మెచ్యూరిటీ తీరింది. కానీ ఇంతవరకూ నిధులు విడుదల కాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. పథకం ప్రారంభంలో లబ్ధిదారులకు పుస్తకాలు మంజూరు చేసేవారు. ఆ చిన్నారులు సంబంధిత పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్నట్లు ప్రిన్సిపాళ్లతో ప్రతి ఏడాదీ సంతకాలు చేయించి ఐసీడీఎస్‌ కార్యాలయంలో అందజేసేవారు. దీంతో వీరికి సకాలంలో చెల్లింపులు చేసేవారు. కానీ 2005 తరువాత పుస్తకాల స్థానంలో బాండ్లను పంపిణీ చేశారు. లబ్ధిదారులకు 2010 నుంచి 2013 వరకు బాండ్లు కూడా మంజూరు చేయలేదు. దీంతో లబ్ధిదారులు సంబంధిత కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో అన్ని వివరాలతో పత్రాలను సిబ్బంది అప్‌లోడ్‌ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి నిధులు మంజూరుకావడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. 


నిధులు మంజూరు కావాలి 

బాలికా సంరక్షణ పథకానికి సంబంధించి మెచ్యూరిటీ అయిన బాండ్లను లబ్ధిదారుల ఆధార్‌ కార్డు, బ్యాంకు అకౌంట్‌లను జత చేసి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి మంజూరైన వెంటనే లబ్ధిదారులకు అందజేస్తాం.

- జి.జయదేవి, ఐసీడీఎస్‌ పీవో.



Updated Date - 2021-06-06T04:02:22+05:30 IST