తహసీల్దార్‌కు ఇదేనా మర్యాద

ABN , First Publish Date - 2021-07-28T07:02:36+05:30 IST

నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లిలో రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమంలో తహసీల్దార్‌ దేవదాస్‌కు అవమానం జరిగింది.

తహసీల్దార్‌కు ఇదేనా మర్యాద
ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ వేదికపై మాట్లాడుతుండగా చేతులు కట్టుకుని నిలుచున్న తహసీల్దార్‌ దేవదాస్‌(సర్కిల్‌లో)

ప్రొటోకాల్‌ పాటించకుండా వేదికపై ప్రజాప్రతినిధులు

పెద్దఅడిశర్లపల్లి, జూలై 27: నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లిలో రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమంలో తహసీల్దార్‌ దేవదాస్‌కు అవమానం జరిగింది. మండల కేంద్రంలో మంగళ వారం నిర్వహించిన రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమంలో వేదికపై ఉన్న కుర్చీల్లో ప్రజా ప్రతినిధులే కూర్చోవటంతో ప్రారంభం నుంచి ముగింపు వరకు తహసీల్దార్‌ చేతులు కటు ్టకుని నిల్చునే ఉన్నారు. పెద్దఅడిశర్లపల్లిలోని కమ్యూనిటీ హాలులో మంగళవారం రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన తహసీల్దార్‌ దేవదాస్‌ వేదికపైకి ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ను, ఎంపీపీ వంగాల ప్రతాపరెడ్డిని ఆహ్వానించారు. అనంతరం ఇతర ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌ , ఎంపీటీసీ స్థాయి ప్రజాప్రతినిధులు, మార్కెట్‌ చైర్‌పర్సన్‌ భర్త కూడా వేదికపై ముందు వరుసలో కూర్చోవటంతో తహసీల్దార్‌ కూర్చునేందుకు అవకాశం లేకుండా పోయింది. కార్యక్రమం గంటసేపు నిర్వహించగా, ప్రజాప్రతినిధుల ప్రసంగాలు పూర్తయిన అనంతరం తహసీల్దార్‌ దేవదాస్‌ లబ్ధిదారుల జాబితా చదవటంతో ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ వారికి రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. ఈ విషయమై తహసీల్దార్‌ దేవదాస్‌ను ప్రశ్నించగా చిన్నప్పటి నుంచి తనకు దర్పం ప్రదర్శించే గుణం లేదని, తన పని తాను చేసుకుపోతానన్నారు. వేదికపై ఉన్న ఎమ్మెల్యే, ఎంపీపీ సైతం ప్రశ్నించకపోవడంతో తాను కూడా మిన్నకున్నానని తెలిపారు.

Updated Date - 2021-07-28T07:02:36+05:30 IST