ltrScrptTheme3

ఎరువు ఏదయా..?

Oct 26 2021 @ 00:08AM
దించుతున్న ఎరువులు (ఫైల్‌)

జిల్లాలో తీవ్రమైన కొరత

డీఏపీ నోస్టాక్‌ 

అధిక ధరలు చెల్లించినా 

దొరకని పరిస్థితి

అలంకారప్రాయంగా ఆర్‌బీకేలు

బ్లాక్‌ మార్కెట్‌కు తెరతీసిన వ్యాపారులు 

పట్టించుకోని వ్యవసాయ శాఖ అధికారులు 

కందుకూరు, అక్టోబరు 25 : 

జిల్లాలో ఎరువులకు తీవ్ర కొరత ఏర్పడింది. రబీ సాగు ఆరంభంలోనే రైతులకు ఇది సమస్యగా మారింది. రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్‌బీకేల్లో) అన్ని రకాల ఎరువులు సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం చెప్తున్నా అక్కడ ఆ పరిస్థితి కరువైంది. దీంతో అదునులో దుక్కుల్లో ఎరువులు పెట్టేందుకు రైతులు వ్యాపారుల వద్దకు పరుగులు తీస్తున్నారు. అక్కడ స్టాక్‌ లేదని వారు సమాధానం ఇవ్వడంతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం డీఏపీ అవసరం ఎక్కువగా ఉండగా అది ఎక్కడా దొరకడం లేదు. కాంప్లెక్స్‌ ఎరువుల్లో కూడా ధర పెరగని 20-20-0-13 రకం లభించడం లేదు. మరోవైపు అన్నదాతల అవసరాన్ని ఆసరా చేసుకొని కొందరు వ్యాపారులు ఎరువులను బ్లాక్‌ చేస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. దీన్ని అడ్డుకోవాల్సిన వ్యవసాయాధికారులు ఆవైపు దృష్టి సారించకపోవడం అనేక ఆరోపణలు ఆస్కారం ఇస్తోంది. 


జిల్లావ్యాప్తంగా వ్యవసాయ పనులు ముమ్మరమయ్యాయి. రబీ పైర్ల సాగుకి అదనుదాటుతుండటంతో దుక్కుల్లో ఎరువులు పెట్టేందుకు రైతులు పరుగులు తీస్తున్నారు. మినుము సాగుకు వాతావరణం అనుకూలించకపోవటంతో ఈ ఏడాది శనగ, పొగాకు సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు బోర్ల ఆధారంగా కొన్ని ప్రాంతాల్లో రైతులు వరిసాగుకు సన్నద్ధమవుతున్నారు. ఈ సమయంలో పెరిగిన ఎరువుల ధరలు రైతులకు భారంగా మారాయి. అదేసమయంలో డీఏపీ, కొన్ని రకాల కాంప్లెక్స్‌ ఎరువులకు తీవ్ర కొరత ఏర్పడటంతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 

చుక్కల్లో ధరలు.. అయినా సమస్య 

పొగాకు, శనగ సాగుకు దుక్కిలో కాంప్లెక్స్‌ ఎరువులు, డీఏపీ వేయడం తప్పనిసరి. అయితే కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు మండిపోతున్నాయి. డీఏపీ దొరకటమే గగనమైంది.. 14-35-14, 28-28, 17-17-17 కాంప్లెక్స్‌ ఎరువుల ధరలను కంపెనీలు విపరీతంగా పెంచేశాయి. నెల క్రితం వరకు రూ.1100 లోపే లభ్యమైన కాంప్లెక్స్‌ ఎరువుల బస్తా ప్రస్తుతం రూ.1800 చేరింది. బస్తాకు ఆరేడు వందల రూపాయల మేర భారం పడటంతో రైతులు సతమతమవుతున్నారు. ఇక ఎమ్మార్పీ పెంచకుండా ఉంచిన డీఏపీ, 20-20-0-13 రకం కాంప్లెక్స్‌ ఎరువులు మార్కెట్లో దొరకని పరిస్థితి నెలకొంది. ఈ రెండు రకాల ఎమ్మార్పీ రూ. 1200గానే ఉన్నప్పటికీ సరకు ఉత్పత్తి నిలిపివేయటంతో ఇక మిగిలిన కాంప్లెక్స్‌లపైనే ఆధారపడక తప్పని దుస్థితి. అయితే పైర్లకు అన్నిరకాల పోషకాలు అందాలంటే డీఏపీ వాడకం తప్పనిసరి. ఎకరానికి కనీసం ఒక బస్తా అయినా డీఏపీ వేశాకే ఇతర కాంప్లెక్సులు వినియోగిస్తే పైర్లు ఆరోగ్యంగా పెరుగుతాయి తప్ప డీఏపీ వేయకుండా ఎన్ని ఎరువులు వినియోగించినా ఫలితం  ఉండదని రైతులు చెప్తున్నారు. అయితే డీఏపీ మాత్రం ఎక్కడా అందుబాటులో లేదు.

కాంప్లెక్స్‌ కొంటేనే డీఏపీ

కాంప్లెక్‌ ఎరువులు కొంటేనే డీఏపీ ఇస్తామంటూ కంపెనీలు మెలికపెడుతున్నారు. ‘ధరలు భారీగా పెరిగిన 28-28 లేదా 14-35-14లలో ఏదో ఒక కాంప్లెక్స్‌ ఎరువు రెండు టన్నులు కొనుగోలు చేస్తేనే ఒక టన్ను డీఏపీ ఇస్తామని కంపెనీలు మెలిక పెడుతున్నాయి. దానికి కూడా సిద్ధపడి డబ్బు చెల్లించాం. అయినప్పటికీ కాంప్లెక్స్‌ ఎరువులు తప్ప డీఏపీ పంపటం లేదు’ అని కందుకూరుకు చెందిన ఓ ప్రముఖ ఎరువుల డీలర్‌ ఆంధ్రజ్యోతికి తెలిపారు. తాను నెలక్రితం 40 టన్నుల కాంప్లెక్స్‌కి, 20 టన్నుల డీఏపీకి డీడీలు తీయగా కాంప్లెక్స్‌ ఎరువులు నాలుగురోజుల్లో వచ్చాయి కాని డీఏపీ నేటి వరకూ రాలేదని ఆయన తెలిపారు. 

డీఏపీ, 20-20-0-13 ఎరువులు బ్లాక్‌

రైతుల అవసరాన్ని ఎరువుల తయారీదారులు, హోల్‌సేల్‌ డీలర్లు, రిటైల్‌ వ్యాపారులు తిలాపాపం తలా పిడికెడు అన్న చందంగా సొమ్ము చేసుకుంటున్నారు. ధర అందుబాటులో ఉండి డిమాండ్‌ ఉన్న ఎరువులను ఎక్కడికక్కడ బ్లాక్‌ చేసి అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. డీఏపీతోపాటు,  కాంప్లెక్స్‌ ఎరువులలో ఒకటైన 20-20-0-13 రకానికి ఎమ్మార్పీ ధర పెరగలేదు. ఈ రెండు ఎరువుల ధర బస్తా రూ. 1200 ఉండటంతో వీటిని వ్యాపారులు బ్లాక్‌ చేసేశారు. జిల్లాకు కేవలం ఆరేడు లారీల డీఏపీ మాత్రమే వచ్చిందని అందులో మాకు కేటాయింపులు సరిగాలేవని వ్యాపారులు  చెప్తుండగా, వ్యవసాయ శాఖ గణాంకాలు మాత్రం ప్రస్తుతం జిల్లాలో 2500 టన్నుల వరకు డీఏపీ అందుబాటులో ఉందని వెల్లడిస్తున్నాయి. దీన్నిబట్టి డీఏపీని బ్లాక్‌చేశారన్న విషయం తేటతెల్లమవుతోంది. బస్తా రూ. 1200కి విక్రయించాల్సిన డీఏపీని వ్యాపారులు ఆ ప్రాంతం, రైతు అవసరాన్ని బట్టి రూ. 1400 నుంచి రూ. 1600 వరకు అమ్ముతున్నారు. ధర అందుబాటులో ఉన్న 20-20-0-13ని కూడా బ్లాక్‌  చేశారు. దీంతో రైతులు నానాఅవస్థలు పడుతున్నారు. 

కందుకూరు డివిజన్‌కే 5వేల టన్నుల డీఏపీ అవసరం

ఈ రబీ సీజన్‌లో కందుకూరు డివిజన్‌లోనే రమారమి లక్ష ఎకరాల్లో పంటలు సాగవుతాయి. ఎకరాకు ఒక బస్తా వాడినా 5వేల టన్నుల డీఏపీ అవసరం ఉంది. అంటే దాదాపు 250 లారీల సరుకు అవసరం. జిల్లావ్యాప్తంగా చూస్తే ఇంతకు మూడింతల వినియోగం ఉంటుంది. అయితే అందులో ఒక్కశాతం కూడా ఇప్పటి వరకూ స్టాకు రాలేదు. మరో వారం, పదిరోజుల్లోగా ఎరువులు వేసే ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నా తగిన మేరకు నిల్వలు తెప్పించే ప్రయత్నమే జరగటం లేదు. విస్తారంగా వర్షాలు కురిసి చెరువుల కింద వరి సాగైతే మరో 750 లారీల డీఏపీ అవసరం ఏర్పడుతుంది. 

ఆర్‌బీకేలలో నిల్వలు నిల్‌ 

ఆర్‌బీకేలలో ఎరువుల నిల్వలు నిండుకున్నాయి. యూరియా, భారీగా ధరలు పెరిగిన కాంప్లెక్స్‌ ఎరువులు అరకొరగా మినహా అక్కడ బస్తా డీఏపీ కూడా లభించడం లేదు.   కాంప్లెక్స్‌ ఎరువుల్లో ధర పెంచని పెంచని 20-20-0-13 నిల్వలు కూడా లేవు. దీంతో రైతులు ఎరువుల డీలర్లు, ఆర్‌బీకేల చుట్టూ తిరుగుతున్నారు. డీఏపీ ఇస్తే బస్తాకు రూ.1400 కూడా చెల్లించేందుకు కొందరు సిద్ధపడుతున్నారు. అయినప్పటికీ అది దొరకడం లేదు. ఈ పరిస్థితుల్లో అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఎరువుల సమస్యపై దృష్టి సారించి తక్షణం జిల్లాకు అవసరమైన మేర సరకు వచ్చేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.