మలుపులపై సూచికలేవీ?

ABN , First Publish Date - 2022-05-26T05:16:25+05:30 IST

రహదారులపై మూల మలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు

మలుపులపై సూచికలేవీ?
ముక్కునూరు దండుమైలారం మధ్యన మూలమలుపు

  • కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోడ్డు విస్తరణ 
  • సూచిక బోర్డులు ఏర్పాటు చేయడంలో అలసత్వం 
  • ప్రమాదాల బారిన వాహనదారులు 
  • పట్టించుకోని అధికారులు, కాంట్రాక్టర్‌ 
  • ఇబ్రహీంపట్నం నుంచి దండుమైలారం రోడ్డు పరిస్థితి


ఇబ్రహీంపట్నంరూరల్‌, మే 24: రహదారులపై మూల మలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్డు విస్తరణ పనులు చేపట్టినా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. విస్తరణ పనులు పూర్తయినా రహదారి మలుపుల వద్ద సూచికలు ఏర్పాటు చేయడంలో ఆర్‌అండ్‌బీ అధికారులు, కాంట్రాక్టర్ల అలసత్వం వహిస్తున్నారు. దీంతో టర్నింగ్‌ల వద్ద అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. 

ఇబ్రహీంపట్నం నుంచి యాద్రాద్రి జిల్లా తూప్రాన్‌పేట్‌ గేట్‌ వరకు, ప్రభుత్వం 32 కోట్ల రూపాయల నిధులతో 22 కిలోమీటర్ల మేర రోడ్డు వెడల్పు పనులు చేపట్టింది. రోడ్డు పనులు పూర్తయి మూడేళ్లు కావొస్తున్నా మూలమలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 


22 కిలోమీటర్లు.. 10 మూల మలుపులు

ఇబ్రహీంపట్నం నుంచి రాయపోల్‌, ముక్కునూరు, దండుమైలారం మీదుగా తూప్రాన్‌పేట్‌ గేట్‌ వరకు 22 కిలోమీటర్ల మేర ఉన్న రోడ్డుపై 10 మూలమలుపులు ఉన్నాయి. డబుల్‌ రోడ్డు కావడంతో వాహనాలరద్దీ పెరిగింది. ప్రమాదకరంగా ఉన్న మూలమలుపుల వద్ద ఎలాంటి సూచిక బోర్డులు లేకపోవడంతో వాహనదారులు వేగంగా వెళ్లి అదుపుతప్పి ప్రమాదాల బారిన పడుతున్నారు. ముక్కునూరు వద్ద రోడ్డుపక్కన పెద్ద వ్యవసాయ బావి ఉన్నా కనీసం అక్కడ ఎలాంటి బోర్డులు ఏర్పాటు చేయలేదు. అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే పెద్దఎత్తున ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఆ రోడ్డులో మూడు బ్రిడ్జీల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.కోటి 80లక్షల నిధులు మంజూరు చేసినా.. ఇప్పటికీ నత్తనడకన పనులు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ఆర్‌అండ్‌బీ అధికారులు, కాంట్రాక్టర్‌ వెంటనే రోడ్డుకు ఇరువైపులా సూచిక బోర్డులు ఏర్పాటు చేయడంతోపాటు బ్రిడ్జీల నిర్మాణ పనులు వెంటనే పూర్తిచేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.


ప్రమాదాలు జరుగుతున్నాయి

రోడ్డు వెడల్పు కావడంతో వాహనాలు వేగంగా దూసు కొస్తున్నాయి. ఈ రోడ్డుపై మూల మలుపులు ఎక్కువగా ఉండ టంతో కొత్తగా వాహనాలు నడిపేవారు సూచిక బోర్డులు లేక అదుపు తప్పి ప్రమాదాల బారినపడుతున్నారు. చాలామంది ప్రమాదంలో ప్రాణాలు సైతం కోల్పోయారు. అధికారులు ఇప్పటికైనా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. 

- గంగిరెడ్డి బల్వంత్‌రెడ్డి, రాయపోల్‌ సర్పంచ్‌


బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలి

రోడ్డు  విస్తరణ పనులు జరిగి మూడేళ్లు గడిచినా రోడ్డు మధ్యలో ఉన్న బ్రిడ్జీల నిర్మాణ పనులు పూర్తి చేయడం లేదు. వర్షం పడితే ఈ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంతో పనులు చేపట్టడం లేదు. వెంటనే పనులు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. 

- మల్లీశ్వరి, దండుమైలారం సర్పంచ్‌



త్వరలోనే ఏర్పాటు చేస్తాం 

రోడ్డు పనులు పూర్తయిన వెంటనే సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. ఇప్పటికే ఆలస్యం జరిగింది. సూచికబోర్డుల ఏర్పాటు పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించాం. త్వరలోనే రోడ్లకు ఇరువైపులా వాటి ఏర్పాటు జరుగుతుంది.  

- బాలునాయక్‌ ఆర్‌అండ్‌బీ ఏఈ



Updated Date - 2022-05-26T05:16:25+05:30 IST