మల్లెల గుబాళింపు ఏదీ?

ABN , First Publish Date - 2021-05-15T04:44:24+05:30 IST

-సాలూరు, రామభద్రపురం మండలాల్లో మల్లెల సాగు అధికం. ఆర్థికంగా గిట్టుబాటు కలుగుతుండడంతో సంప్రదాయ పంటల స్థానంలో మల్లెలనే సాగుచేసేవారు.

మల్లెల గుబాళింపు ఏదీ?
సాలూరులో మల్లెపూలు విక్రయిస్తున్న దృశ్యం




తగ్గుతున్న సాగు విస్తీర్ణం

పెట్టుబడులు పెరగడమే కారణం

 ఏడాదిగా వెంటాడుతున్న కరోనా కష్టాలు

ప్రత్యామ్నాయ పంటల వైపు రైతుల మొగ్గు

(సాలూరు)

మల్లెల సాగుకు చిరునామా సాలూరు. వందలాది ఎకరాల్లో సాగుచేసే  ఇక్కడి మల్లెలకు భలే గిరాకీ. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, చత్తీస్‌గడ్‌లకు పువ్వులు ఎగుమతి అయ్యేవి. ఏడాది పొడవునా పంట ఉత్పత్తితో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి దొరికేది. కానీ ఇదంతా గతం. ప్రస్తుతం మల్లెల రైతులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పెరిగిన పెట్టుబడులు, కూలీల కొరతతో రైతులు చేతులెత్తేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. 

-సాలూరు, రామభద్రపురం మండలాల్లో మల్లెల సాగు అధికం. ఆర్థికంగా గిట్టుబాటు కలుగుతుండడంతో సంప్రదాయ పంటల స్థానంలో మల్లెలనే సాగుచేసేవారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులు మల్లెలను కొనుగోలు చేసి తరలించేవారు. మల్లెల వ్యాపార కేంద్రంగా సాలూరు మారింది. ఉత్తరాంధ్రతో పాటు ఉభయగోదావరి, ఒడిశా, చత్తీస్‌గడ్‌లకు ఇక్కడి మల్లెలు ఎగుమతి అయ్యేవి. రైతులు, కూలీలు, వ్యాపారులకు ...ఇలా వందలాది మందికి ‘ఉపాధి’ మార్గంగా మారింది. కొన్నేళ్లుగా పెట్టుబడులు పెరగడం, కూలీలు దొరక్కపోవడం, వాతావరణ ప్రతికూల పరిస్థితులు,  గత ఏడాది నుంచి కరోనా కష్టాలు వెంటాడడం తదితర కారణాలతో పంట విస్తీర్ణం క్రమేపీ తగ్గుతూ వస్తోంది. 

పెరిగిన పెట్టుబడులు

ఎకరా భూమిలో మల్లెల సాగుకు సుమారు రూ.50 వేలు ఖర్చవుతుందని రైతులు చెబుతున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే పెట్టుబడులు పోనూ..రూ.30 వేల వరకూ ఆదాయం వస్తుంది. ఇటీవల కూలీల వేతనాలు పెరిగాయి.  ఎరువులు, సస్యరక్షణకు వినియోగించే పురుగు మందు ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. దీంతో ఆదాయం కంటే పెట్టుబడులే అధికమయ్యాయి. ఇతర సంప్రదాయ పంటల సాగులో యాంత్రీకరణ అందుబాటులోకి వచ్చింది. మల్లెల సాగులో మాత్రం మనుషులే కీలకం. పువ్వుల సేకరణ, రవాణా, విక్రయాల్లో కూలీలదే కీలక పాత్ర. ఎప్పటికప్పుడు సస్యరక్షణ, ఎరువులు వేయడం చేయాలి. లేదంటే పంట ఉత్పత్తిపై ఆ ప్రభావం పడుతుంది.  ఏడాదికేడాది ఎరువులు, రసాయనాల ధరలు పెరగడం, కూలీల వేతనాలు పెరుగుతుండడంతో పెట్టుబడులు భారమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు సంప్రదాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వపరంగా ఎటువంటి పోత్రాహం లేదు. మార్కెటింగ్‌, రాయితీ సదుపాయాలు లేకపోవడంతో కూడా చాలామంది పంట సాగును విరమించుకుంటున్నారు. 

కరోనాతో మరిన్ని కష్టాలు

కరోనాతో గత ఏడాది నుంచి కష్టాలు మొదలయ్యాయి. సరిగ్గా పంట ఉత్పత్తి ప్రారంభమయ్యే సమయంలో గత ఏడాది లాక్‌డౌన్‌ విధించడంతో రవాణా నిలిచిపోయింది. మల్లెలు ఎగుమతి కాకపోవడంతో రైతులకు అపార నష్టం కలిగింది. పోనీ ఈ ఏడాదైనా ఉపాధి పొందుతామన్న తరుణంలో రెండో వేవ్‌ ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 నుంచి ఉదయం ఆరు గంటల వరకూ కర్ఫ్యూ అమల్లో ఉంది. సాధారణంగా మల్లెలు సాయంత్రమే అమ్ముడవుతాయి. కానీ ప్రస్తుతం విక్రయించలేని దుస్థితి. మధ్యాహ్నం 12 గంటల్లోపు తక్కువ ధర అని చెబుతున్నా ఎవరూ మొగ్గుచూపడం లేదు. లీటరు మల్లెలు రూ.40కి ఇస్తామన్నా కొనుగోలు చేసేవారు కరువయ్యారని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రానికి పువ్వులు వాడిపోతుండడంతో పారబోస్తున్నామని చెబుతున్నారు. 



Updated Date - 2021-05-15T04:44:24+05:30 IST