ఇంకెన్నాళ్లీ ఎదురుచూపులు?

ABN , First Publish Date - 2021-02-26T03:35:25+05:30 IST

వ్యవసాయమే ప్రధాన ఆధారమైన జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని వ్యవ సాయ రంగానికి పూర్తి స్థాయిలో అనుసం ధానం చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు.

ఇంకెన్నాళ్లీ ఎదురుచూపులు?
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు (ఫైల్‌)

-ఈజీఎస్‌తో వ్యవసాయం అనుసంధానంపై ఊసెత్తని కేంద్రం

-సాగుకు తీవ్రమైన కూలీల కొరత

-పెట్టుబడి ఖర్చులు పెరిగి కుదేలవుతున్న రైతులు

-ఏళ్లుగా తప్పని ఎదురుచూపులు

చింతలమానేపల్లి, ఫిబ్రవరి25: వ్యవసాయమే ప్రధాన ఆధారమైన జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని వ్యవ సాయ రంగానికి పూర్తి స్థాయిలో అనుసం ధానం చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. ఆగమేఘాల మీద సాగు చట్టాలను తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం ఈజీఎస్‌ను వ్యవసా యానికి అనుసంధానం చేయడాన్ని పూర్తిగా మర్చిపోయిందని రైతులు వాపోతున్నారు. ఉపాధి హామీపథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయడంపై ఇప్పటికే రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిన కేంద్రం ఓ ముసాయిదాను సిద్ధం చేసింది. వెంటనే అమలు చేస్తే రైతులకు ఎంతో మేలు జరిగి పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయని పలువురు పేర్కొంటున్నారు. అలాగే ఉపాధి కూలీలకు ఏడాది పాటు పని దొరికే అవకాశాలున్నాయి. 

జిల్లాలో ఇదీ పరిస్థితి..

జిల్లాలోని 335 గ్రామ పంచాయతీల్లో 1,18,449 జాబ్‌ కార్డులుండగా, 1,44,499 మంది కూలీలున్నారు. జిల్లాలో లక్షా 50వేల పైచిలుకు రైతులుండగా, సుమారు 80వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఇప్పటికే వ్యవసాయ పరమైన కొన్ని పనులను ఈ పథకం కింద చేపడుతున్నా పూర్తి స్థాయిలో అమలు చేస్తే వ్యవసాయం మరింత లాభసాటిగా మార నుంది.  

వేధిస్తున్న కూలీల కొరత

జిల్లాలో ఎక్కువగా పత్తి, సోయా, కంది, శనగ తదితర పంటలను పండిస్తారు. ముఖ్యంగా పత్తి   ఏరే సమయంలో కూలీల కొరత అధికంగా ఉంటుంది. పంటల్లో కలుపు తీయడం, నాట్లు వేయడం, పంట చేతికొచ్చాక సేకరించడం వంటి పనులకు కూలీలు అవసరం ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో కూలీల ఖర్చులు, పెట్టుబడులు రైతులకు తడిసి మోపెడ వుతున్నాయి. సీజన్‌లో కూలీలకు భారీ డిమాండ్‌ ఏర్పడుతోంది. రూ.400-800 వరకు కూలీ చెల్లించాల్సి వస్తోంది. దీంతో సాగు లాభసాటి కావడం లేదని రైతులు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే రైతులకు మేలు జరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

2016లోనే నివేదిక

వ్యవసాయానికి ఉపాధిహామీ పథకాన్ని అనుసం ధానం చేయాలని 2016లోనే నీతి ఆయోగ్‌ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనుల్లో 75శాతం ప్రభుత్వం, 25శాతం రైతులు భరించే విధంగా పనులు చేపట్టాలని  నీతి ఆయోగ్‌ సూచించింది. అయినా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఏళ్లుగా వ్యవసాయానికి ఈజీఎస్‌ అనుసంధానం కోసం ఎదురు చూస్తున్నామని రైతు సంఘాలు, రైతులు పేర్కొంటున్నారు.  

 పెట్టబడి ఖర్చులు పెరిగాయి

-డుబ్బుల వెంకయ్య, రైతు సంఘాల నేత

ఉపాధిహామీ పథకంతో వ్యవసాయాన్ని అను సంధానం చేయాలి. దీని ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. కూలీల కొరత, పెట్టుబడి ఖర్చులు పెరిగిపోవడంతో కొందరు రైతులు వ్యవసాయంపై అనాసక్తి చూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై తక్షణమే స్పందించాలి. 

ప్రభుత్వం స్పందించాలి

-భాస్కర్‌, రైతు

ఏటా కూలీల దొరక ఇబ్బందులు పడుతున్నాం. ఉపాధి హమీ పథకాన్ని వ్యవసాయ పనులకు అనుసంధానం చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. పెట్టుబడి ఖర్చులు, కూలీల ఖర్చులు, ఇతర ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ప్రభుత్వం రైతుల కోసం అన్ని వ్యవసాయ పనులను అనుసంధానం చేయాలి. 

Updated Date - 2021-02-26T03:35:25+05:30 IST