Advertisement

మద్దతు ధర ఏదీ?

Jan 25 2021 @ 00:26AM
మైలవరం మండలంలో కొతకొచ్చిన బుడ్డ శనగ పైరు

వర్షాలకు భారీగా దెబ్బతిన్న బుడ్డ శనగ 

అరకొర దిగుబడులు చేతికొచ్చేవేళ పతనమైన ధరలు

డిసెంబరులో క్వింటం రూ.5,700పైమాగానే

తాజాగా రూ.4,500లోపే 

ప్రభుత్వ మద్దతు ధర రూ.5,100

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతుల డిమాండ్‌ 

జిల్లాలో రబీ ప్రధాన పంట బుడ్డ శనగ

85 వేల హెక్టార్లలో సాగు


రబీ ప్రధాన పంట బుడ్డశనగ. జిల్లాలో 85 వేల హెక్టార్లలో సాగు చేశారు. నవంబరులో కురిసిన భారీ వర్షాలకు పైరు భారీగా దెబ్బతింది. ఎకరాకు మూడు నాలుగు బస్తాలు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. దిగుబడి తగ్గితే డిమాండ్‌ పెరిగి ధరలు ఆశాజనకంగా ఉంటాయని రైతులు ఆశించారు. పంట చేతికొచ్చే వేళ ధర పతనమైంది. డిసెంబరు నెలలో క్వింటం రూ.5,700లకుపైగా పలికితే తాజాగా రూ.4,500లకు మించి అడగడం లేదని రైతుల ఆందోళన. వ్యాపారులు కుమ్మక్కై పంట ఇంటికొచ్చే సమయంలో ధరలు తగ్గించారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.5,100 కూడా గిట్టుబాటు కాదు.. కనీసం రూ.6,500 ఉండాలని రైతుల డిమాండ్‌. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కోరుతున్నారు. 


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో పెద్దముడియం, మైలవరం, జమ్మలమడుగు, రాజుపాలెం, ప్రొద్దుటూరు, లింగాల, పులివెందుల, తొండూరు, వేముల, చాపాడు, దువ్వూరు, కమలాపురం, వల్లూరు మండలాల్లో బుడ్డశనగ అధికంగా సాగు చేస్తున్నారు. ఈ రబీ సీజన్లో జిల్లాలో 85 వేల హెక్టార్లలో శనగ వేసినట్లు వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. వర్షాలు ఆశాజనకంగా కురిశాయి.. శనగ కష్టాలు తీరుస్తుందని ఆశించిన రైతులను నివర్‌ తుఫాన రూపంలో నిలువునా ముంచేసింది. జిల్లాలో 80,266.99 హెక్టార్లలో ఈ పైరు దెబ్బతిని రైతులు రూ.80.26 కోట్లు నష్టపోయారని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదిక పంపింది. సాధారణంగా ఎకరాకు 6-10 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని రైతులు తెలిపారు. తుఫాన కారణంగా పైరు దెబ్బ తినడంతో 3-4 బస్తాలు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదని అంటున్నారు. దిగుబడి సగానికిపైగా తగ్గడంతో డిమాండ్‌ పెరిగి గిట్టుబాటు ధర వస్తుందని ఆశిస్తే.. ధరలు పతనం కావడంతో అన్నదాత ఆశలు నీరుగారాయి.


ఆ ఒక్క ఏడాదే

2016లో శనగ రైతుల కష్టాలు తీరాయి. క్వింటం రూ.9,500 నుంచి రూ.10 వేలకు విక్రయించారు. ఆ తరువాత ధరలు పతనమవుతూ వచ్చాయి. 2017లో రూ.6,500లకు విక్రయించామని రైతులు తెలిపారు. 2018, 2019లో ధరలు పెరగకపోగా పూర్తిగా పతనమయ్యాయి. క్వింటం రూ.4,500లకు మించి వ్యాపారులు కొనుగోలు చేయలేదు. 2016లో ధర రావడంతో ఎప్పుడైనా ధరలు పెరగవచ్చనే ఆశతో రైతులు గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. పెద్దముడియం, మైలవరం వంటి మండలాల్లో కొందరు రైతులు రెండేళ్ల పంట దిగుబడులు ఇప్పటికీ గోదాముల్లో నిల్వ చేశారు. మరో వారం పది రోజుల్లో కొత్త పంట చేతికొస్తుంది. 


పంట చేతికొచ్చే వేళ ధర పతనం

డిసెంబరు నెలలో క్వింటం రూ.5,700 వరకు వ్యాపారులు కొనుగోలు చేశారు. కొంతైనా పర్వాలేదులే అని రైతులు భావించారు. మరో వారం పది రోజుల్లో కొత్త పంట ఇల్లు చేరుతుండడంతో గోదాముల్లో నిల్వ చేసిన పంట అమ్మేందుకు సిద్ధపడ్డారు. పంట చేతికొచ్చే సమయంలో వ్యాపారులు కుమ్మక్కై ధర తగ్గించారని రైతులు వాపోతున్నారు. తాజాగా రూ.4,200-4,500లకు మించి కొనుగోలు చేయడం లేదని అంటున్నారు. ఎకరా సాగుకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీలు, సేద్యం ఖర్చులు రూ.25-30 వేలపైగానే వస్తుంది. 8-10 క్వింటాళ్లు దిగుబడి వస్తే పెట్టుబడి చేతికొచ్చి కొంత లాభం ఉంటుంది. నివర్‌ తుఫాన వల్ల పంట దెబ్బతినడంతో 3-4 బస్తాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. తాజా ధర ప్రకారం అమ్మితే పంట కోత ఖర్చులు కూడా చేతికొచ్చే పరిస్థితి లేదని, అప్పులే మిగులుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


మద్దతు కొసరే

శనగ మద్దతు ధర 2020లో రూ.4,850. కేంద్రం ప్రభుత్వం 2021కి రూ.350 పెంచి రూ.5,100 చేసింది. ఓ పక్క సేద్యపు ఖర్చులు భారీగా పెరుగుతుంటే ఆ స్థాయిలో మద్దతు ధర పెంచడం లేదు. వ్యవసాయ నిపుణులు స్వామినాథన సిఫారసు మేరకు పెట్టుబడిపై 50 శాతం రైతుకు లాభం ఉండేలా మద్దతు ధర ఉండాలి. అయితే.. రైతు పెట్టే వ్యవసాయ ఖర్చులకు, వ్యవసాయ శాఖ అంచనాలకు పొంతన ఉండడం లేదు. దీంతో ఆశాజనకమైన మద్దతు ధర అందడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో శనగ రైతులు కోలుకోవాలంటే క్వింటాకు రూ.6,500లకు పైగానే మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈనెలాఖరులోగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, వ్యాపారులకు పంటంతా విక్రయించాక ఏపీ మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేపడితే ప్రయోజనం ఉండదని రైతులు అంటున్నారు. 


ప్రభుత్వ ఉత్తర్వులు రాగానే కొనుగోళ్లు 

- నాగరాజు, జిల్లా మేనేజరు, ఏపీ మార్క్‌ఫెడ్‌, కడప

ఏపీ మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో గత ఏడాది 32 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 35 వేల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశాం. నాడు మద్దతు ధర రూ.4,850 ఉంది. ప్రస్తుతం రూ.5,100లకు కేంద్ర ప్రభుత్వం పెంచింది. కొత్త పంట చేతికొచ్చేలోగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నహాలు చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే రైతుల నుంచి శనగ కొనుగోళ్లు చేపడతాం. 


రూ.6,500 ఉంటేనే కష్టాలు తీరుతాయి 

- కొండేటి కృష్ణారావు, శనగ రైతు, టి.కమ్మవారిపల్లె గ్రామం, మైలవరం మండలం

నాకున్న 4 ఎకరాలు, ఎకరా రూ.8 వేల ప్రకారం మరో 12 ఎకరాలు కౌలుకు తీసుకుని బుడ్డ శనగ వేశాను. ఎకరాకు రూ.25 వేలకుపైగా పెట్టుబడి పెట్టాను. కౌలు సరేసరి. నివర్‌ తుఫాన వల్ల ఎకరాకు 3-4 బస్తాలు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. గత మూడేళ్లుగా ధర లేకపోవడంతో ఇప్పటికే 160 క్వింటాళ్లు గోదాములో నిల్వ చేశాను. మరో 15-20 రోజుల్లో పంట చేతికొస్తుంది. డిసెంబరులో రూ.5,700 ధర ఉంటే పంటొచ్చే సమయంలో రూ.4,500లకు తగ్గించారు. మద్దతు ధర కనీసం రూ.6,500 ఉంటేనే రైతు కొంతైనా బాగుపడతాడు. ఇప్పుడిచ్చిన మద్దతు ధర రైతుకు లాభసాటి కాదు. నెలాఖరులోగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోళ్లు చేపట్టాలి. 

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.