నిరంతర విద్యుత్‌ సరఫరా ఏదీ?

ABN , First Publish Date - 2022-06-29T06:39:51+05:30 IST

వానాకాలం సాగు మొదలైందని, నాట్లు వేసుకునే సమయంలో విద్యుత్‌ కోతలు ఉంటే రైతులు ఇబ్బందులు పడతారని సభ్యులు ధ్వజమెత్తారు. ఏడు గంటలు కూడా నిరంతరంగా ఉండడం లేదని తరచూ నిలిచిపోతుందని వాపోయారు. మరోవైపు పనులు చేసినా బిల్లులు రావడం లేదని, బిల్లులు ఇస్తేనే పనులు చేస్తామని హెచ్చరించారు.

నిరంతర విద్యుత్‌ సరఫరా ఏదీ?
మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ

-  జడ్పీ సర్వసభ్య సమావేశంలో సభ్యుల ధ్వజం 

- ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుంటే చర్యలు : జడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ 

 (ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

వానాకాలం సాగు మొదలైందని, నాట్లు వేసుకునే సమయంలో విద్యుత్‌ కోతలు ఉంటే రైతులు ఇబ్బందులు పడతారని సభ్యులు ధ్వజమెత్తారు. ఏడు గంటలు కూడా నిరంతరంగా ఉండడం లేదని తరచూ  నిలిచిపోతుందని వాపోయారు. మరోవైపు పనులు చేసినా బిల్లులు రావడం లేదని, బిల్లులు ఇస్తేనే పనులు చేస్తామని హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్‌ సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ అధ్యక్షతన రాజన్న సిరిసిల్ల ప్రజాపరిషత్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రుద్రంగి ఎంపీపీ గంగం స్వరూపరాణి మాట్లాడుతూ రైతులు నాట్లు వేసుకుంటున్నారని విద్యుత్‌ క్రమపద్ధతిలో ఉండడం లేదని అన్నారు. కరెంట్‌ ఎప్పుడో వస్తుందో? ఎప్పుడో పోతుందో? తెలియక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముస్తాబాద్‌ ఎంపీపీ శరత్‌రావు మాట్లాడుతూ విద్యుత్‌ సరఫరాలో తరచూ కోతలు విధిసున్నారని,  ఏడు గంటలకు మించి సరఫరా కావడం లేదని అన్నారు. సెస్‌ ఎండీ రామకృష్ణ మాట్లాడుతూ వ్యవసాయానికి 18 గంటలు సరఫరా చేస్తున్నామని, ఇతర అవసరాలకు 24 గంటలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు.  తెల్లవారుజామున 4 గంటల నుంచి సరఫరా చేస్తామని తెలిపారు. ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ వ్యవసాయానికి కోతలు లేకుండా విద్యుత్‌ ఇవ్వాలన్నారు.  రైతు బంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్‌ గడ్డం నర్సయ్య మాట్లాడుతూ రైతులకు 24 గంటలు విద్యుత్‌ ఇస్తామని ప్రకటించినట్లుగా అందించాలని కోరారు. జడ్పీ వైస్‌ చైర్మన్‌ సిద్దం వేణు మాట్లాడుతూ ఇల్లంతకుంట మండలంలో విద్యుత్‌ లైన్ల కోసం గ్రామ పంచాయతీ నుంచి డబ్బులు జమ చేసినా ఆరు నెలలుగా వేయడం లేదని, కనీసం ఏఈ ఫోన్‌ కూడా లిఫ్ట్‌ చేయడం లేదని అన్నారు. వీర్నపల్లి ఎంపీపీ మాలోతు బూల మాట్లాడుతూ వ్యవసాయానికి విద్యుత్‌ కోతలు లేకుండా చూడాలని కోరారు. తంగళ్లపల్లి ఎంపీపీ మానస మాట్లాడుతూ రైతుబీ మాకు సంబంధించిన ప్రొసీడింగ్‌లు రైతులకు అందిస్తే ఉపయోగకరంగా ఉంటుందన్నారు. వ్యవసాయ అధికారి రణధీర్‌ మాట్లాడుతూ ఎల్‌ఐసీ నుంచి బాండ్‌లు రావడం లేదని తెలిపారు. 

అధికారుల నిర్లక్ష్యంపై ధ్వజం 

మండలాల్లో చేపట్టే అభివృద్ధి పనులు, వివిధ కార్యక్రమాలకు సంబంధించి ప్రజాప్రతినిధులకు  సమాచారం ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు సభ్యులు ధ్వజమెతారు.  జిల్లా రైతు బంధు కో ఆర్డినేటర్‌ గడ్డం నర్సయ్య మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్‌లో ఆయిల్‌ఫాం సాగు ప్రారంభానికి సంబంధించి ఉద్యాన అఽధికారి సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.   ఉద్యాన  శాఖ అధికారి జ్యోతి మాట్లాడుతూ కార్యక్రమం ప్రారంభానికి సంబంధించి కచ్చితమైన సమయం ముందుగా ఖరారు కాకపోవడంతో ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వలేకపోయామని, ఇకపై సమాచారం అందిస్తామని అన్నారు. ప్రజాప్రతినిధుల సహకారంతోనే 35 బస్సుల్లో ఆయిల్‌ఫాం అవగాహనకు టూర్‌ తీసుకెళ్లినట్లు గుర్తు చేశారు.  జడ్పీ వైస్‌ చైర్మన్‌ సిద్ధం వేణు మాట్లాడుతూ ఆయిల్‌ఫాంకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని  అన్నారు. వివరాలు తెప్పిస్తానని చెప్పడంతో వివరాలు లేకుండా సభకు రావడం ఏమిటని సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. రుద్రంగి ఎంపీపీ స్వరూపరాణి మాట్లాడుతూ రుద్రంగి మానాలలో మిషన్‌భగీరథ నీటి సమస్య ఉందని, అధికారులు పట్టించుకోకపోవడం లేదని అన్నారు. 50 శాతం నీళ్లు కూడా సరఫరా కావడం లేదన్నారు. జడ్పీటీసీ మీనయ్య మాట్లాడుతూ రుద్రంగిలోని కొన్ని ప్రాంతాలకు నీళ్లు రావడం లేదని, మిషన్‌భగీరథ అధికారులు వచ్చినా సందర్భాలు లేవని అన్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ మాట్లాడుతూ రుద్రంగిలో ప్రజాప్రతినిధులను కలిసి సమస్యలు పరిష్కరించాలని చెప్పినా ఎందుకు కలవలేదని అడిగారు. ఎంపీపీ స్వరూపరాణి మాట్లాడుతూ రుద్రంగి మండలంలో మత్స్యశాఖ అధికారులు ఎవరు ఉన్నారని ప్రశ్నించారు. చెరువుల్లో చేపపిల్లలు వదిలినపుడు సమాచారం ఇవ్వడం లేదన్నారు. తంగళ్లపల్లి జడ్పీటీసీ పూర్మాణి మంజుల మాట్లాడుతూ  అధికారులు మండలాల్లో జరుగుతున్న పనుల వివరాలు ఇవ్వాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల భవనాల నిర్మాణాలు జరగకపోవడంతో అద్దె ఇళ్లలో కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉపాధి హామీ కూలీలకు వేతనాలు అందడం లేదన్నారు. ఎల్లారెడ్డిపేట ఎంపీపీ పిల్లి రేణుక మాట్లాడుతూ మహిళా సంఘాలకు  వడ్డీ రాయితీ రావడం లేదన్నారు. డీఆర్డీవో మదన్‌ మాట్లాడుతూ మహిళా సంఘాలకు సంబంధించి రూ.59 కోట్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. జడ్పీ వైస్‌ చైర్మన్‌ సిద్దం వేణు మాట్లాడుతూ రెండో విడత గొర్రెల పంపిణీ ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు. పశు సంవర్థక శాఖ అధికారి కొమురయ్య మాట్లాడుతూ జూలైలో అందించే అవకాశం ఉందని, జిల్లాలో 3800 యూనిట్లు ఇవ్వాల్సి ఉందని వివరించారు. 

బిల్లులు ఇస్తేనే పనులు 

పాఠశాలలో కిచెన్‌ షెడ్డు నిర్మించి బిల్లుల కోసం ఇబ్బందులు పడుతున్నారని సిద్ధం వేణు అన్నారు. బిల్లులు ఎప్పుడూ ఇస్తారో స్పష్టంగా తెలియజేస్తేనే పనులు చేస్తారన్నారు. డీఆర్డీవో మదన్‌ సమాధానం ఇస్తూ రూ.17 కోట్లు రావాల్సి ఉందని రూ.3.50 కోట్లు విడుదలైనట్లు చెప్పారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల వద్ద సంప్‌లు నిర్మించామని వాటికి సంబంధించిన బిల్లులు కూడా పెండింగ్‌లో ఉన్నాయని జడ్పీటీసీ లక్ష్మణ్‌రావు అన్నారు.  

డెంగ్యూ నివారణకు చర్యలు  

వర్షాకాలం సీజన్‌ ప్రారంభమవడంతో డెంగ్యూ నివారణకు చర్యలు చేపట్టినట్లు జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు తెలిపారు. జిల్లాలో 13 గ్రామాలు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో ఆరు వార్డులను డెంగ్యూ హైరిస్క్‌గా గుర్తించామన్నారు. గతేడాది 127 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం జూన్‌లో నాలుగు కేసులు వచ్చాయని తెలిపారు. బోయినపల్లి, సిరిసిల్లలో రెండు కొవిడ్‌ కేసులు నమోదైనట్లు తెలిపారు.  హెల్త్‌ ప్రొపైల్‌లో జిల్లాలో 3.47 లక్షల మందికి పరీక్షలు చేసి 97 శాతం పూర్తి చేశామన్నారు. జడ్పీ వైస్‌ చైర్మన్‌ సిద్దం వేణు మాట్లాడుతూ ఇల్లంతకుంట 30 పడకల ఆసుపత్రి మంజూరు ఎలా ఉన్నా ప్రస్తుతం ఆసత్రిర శిథిలావస్థలో ఉందని చర్యలు తీసుకోవాలని కోరారు. చందుర్తి, ఇల్లంతకుంట ఆస్పత్రుల నిర్మాణాలకు రూ.2.40 కోట్లు మంజూరైనట్లు వైద్యాధికారి తెలిపారు. ఎంపీపీ స్వరూపరాణి మాట్లాడుతూ పల్లె ప్రగతి ద్వారా పరిశుభ్రత పెరిగిందని దోమల నివారణతో డెంగ్యూ తగ్గుముఖం పట్టిందని అన్నారు. పూర్తి స్థాయిలో నివారణకు సహకరిస్తామన్నారు. 


రైతు బంధుకు కృతజ్ఞతలు 

రైతుబంధు డబ్బుల పంపిణీపై జిల్లా రైతుల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ జడ్పీ వైస్‌ చైర్మన్‌ సిద్దం వేణు తీర్మానం ప్రవేశపెట్టారు. జిల్లా రైతు బంధు కో ఆర్డినేటర్‌ గడ్డం నర్సయ్య తీర్మానాన్ని బలపరిచారు. రైతు బంధు, రైతుబీమా, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ సాగు, సకాలంలో విత్తనాలు అందించడంపై హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య, ఎంపీపీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు. 

నిర్లక్ష్యం వద్దు 

- న్యాలకొండ అరుణ, జడ్పీ చైర్‌పర్సన్‌ 

మండలాలకు వెళ్లినపుడు నిర్లక్ష్యం వహించకుండా జిల్లా అధికారులు సమాచారం ఇవ్వాలని జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణరాఘవరెడ్డి అన్నారు.  ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకొని పనులు చేయాలని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలకు తప్పనిసరిగా ఆహ్వానించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న నిర్మాణం పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, పారిశుధ్య కార్యక్రమాలను పంచాయతీ సిబ్బంది వేగవంతం చేయాలని అన్నారు. గతంలో సీజనల్‌ వ్యాధులు అధికంగా ప్రబలిన గ్రామాలను ప్రత్యేకంగా గుర్తించాలని, అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. జూలై ఒకటో తేదీ  నుంచి ఎగువ మానేరు ప్రాజెక్ట్‌  ఆయకట్టు పరిధిలో 18 వేల ఎకరాలకు మొదటి పంటకు సాగునీరు అందించనున్నట్లు చెప్పారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవతో  అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. 


ప్రొటోకాల్‌ పాటించే విధంగా చర్యలు 

- సత్యప్రసాద్‌, అదనపు కలెక్టర్‌ 

అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ప్రొటోకాల్‌ పాటించే విధంగా చర్యలు తీసుకుంటామని క్షేత్ర స్థాయిలో ప్రజాప్రతినిధులకు ఆహ్వానం అందేలా చూస్తామని  అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. జిల్లాకు నిర్దేశించిన ఆయిల్‌ఫాం లక్ష్య సాధనకు స్థానిక ప్రజాప్రతినిధులు, ఆధికారులు సహకరించాలని కోరారు. 


Updated Date - 2022-06-29T06:39:51+05:30 IST