‘ఏ’ పనీ లేదు!

ABN , First Publish Date - 2021-06-19T05:11:07+05:30 IST

ఖరీఫ్‌ వేళ.. అన్నదాతకు సాగునీటి దిగులు వెంటాడుతోంది. నిర్వహణ లేక కాలువల్లో పూడికలు పేరుకుపోతున్నాయి. దీంతో ఏటా శివారు ప్రాంత రైతులకు సాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది కూడా కేటగిరి-ఏ పనుల కింద కాలువ మరమ్మతులు చేపట్టకపోవడంతో సాగునీరు ప్రశ్నార్థకమవుతోంది. శనివారం జిల్లా కేంద్రంలో నీటి పారుదల శాఖ సలహా మండలి సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో సాగునీటి విడుదలపై అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది అన్నదాతల్లో చర్చనీయాంశమవుతోంది. పూర్తిస్థాయిలో సాగునీటిని అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

‘ఏ’ పనీ లేదు!
కోటబొమ్మాళి సమీపంలో వంశధార ప్రధాన ఎడమకాలువ దుస్థితి ఇలా..

-  ఈ ఏడాదీ కానరాని కేటగిరి-ఏ పనులు

 - వంశధార కాలువల్లో పేరుకుపోయిన పూడిక

 - ఏటా శివారు ప్రాంత రైతులకు ఇబ్బందులు

 - సాగునీటి కోసం అష్టకష్టాలు

(టెక్కలి/సంతబొమ్మాళి/వజ్రపుకొత్తూరు)

ఖరీఫ్‌ వేళ.. అన్నదాతకు సాగునీటి దిగులు వెంటాడుతోంది. నిర్వహణ లేక కాలువల్లో పూడికలు పేరుకుపోతున్నాయి. దీంతో ఏటా శివారు ప్రాంత రైతులకు సాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది కూడా కేటగిరి-ఏ పనుల కింద కాలువ మరమ్మతులు చేపట్టకపోవడంతో సాగునీరు ప్రశ్నార్థకమవుతోంది. శనివారం జిల్లా కేంద్రంలో నీటి పారుదల శాఖ సలహా మండలి సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో సాగునీటి విడుదలపై అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది అన్నదాతల్లో చర్చనీయాంశమవుతోంది. పూర్తిస్థాయిలో సాగునీటిని అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. 

----------------- 

ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధమవుతున్న రైతులకు సాగునీటి సమస్య ఎదురవుతోంది. జిల్లాలో 2.10 లక్షల హెక్టార్లలో వరి పండిచేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. తోటపల్లి కాలువల ద్వారా లక్షా4వేల ఎకరాలకు, నారాయణపురం కాలువ ద్వారా 37,057 ఎకరాలకు, మడ్డువలస ద్వారా 30,070 ఎకరాలు, వంశధార ప్రధాన ఎడమ కాలువ ద్వారా 2.10లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. మరమ్మతులు లేక కాలువల్లో ఎక్కడికక్కడ పూడికలు పేరుకుపోయాయి. సాగునీరు పూర్తిస్థాయిలో అందని పరిస్థితి నెలకొందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండేళ్లుగా కాలువలకు మరమ్మతులు   చేయకపోవడంతోనే ఈ దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

వంశధార దుస్థితి ఇలా..

వంశధార ప్రధాన ఎడమ కాలువ..జిల్లాలోనే అతిపెద్ద సాగునీటి కాలువ. గొట్టాబ్యారేజ్‌ నుంచి వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగి వరకు సుమారు పది మండలాలను కలుపుతూ 104.7కిలోమీటర్లు మేర విస్తరించి ఉంది. రైతులకు ఎంతో ఉపయోగకరమైన ఈ కాలువ ద్వారా 2,400 క్యూసెక్కుల నీరు అందాల్సి ఉంది. కానీ, కాలువల్లో మట్టి, పూడికలు, గుర్రపుడెక్క పేరుకుపోవడంతో కనీసం 400 క్యూసెక్కుల నీరు కూడా రాని పరిస్థితి నెలకొంది. 41ఆర్‌ నుంచి 68ఈ వరకు 28 పిల్ల కాలువల వెంబడి కూడా సాగునీరు వెళ్లేందుకు అనేక అడ్డంకులున్నాయి. చాలాచోట్ల లైనింగ్‌ పనులు జరగకపోవడం, డ్రాప్‌లు, షట్టర్లు, సర్‌ప్లస్‌వైర్లు శిథిలావస్థకు చేరుకోవడంతో ఏటా శివారు ప్రాంత రైతులకు సాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో రైతులు ఏటా ఆగస్టు నుంచి నవంబరు వరకు టెక్కలిలోని వంశధార ఈఈ కార్యాలయం వద్ద ఆందోళనలు, ధర్నాలు చేయాల్సి వస్తోంది. కేటగిరి-ఏ కింద కాలువ మరమ్మతులు, పూడికతీత పనులు ఈ ఏడాదీ చేపట్టలేదు. నరసన్నపేట డివిజన్‌ నుంచి.. ప్రతిపాదనలు జాప్యం కావడంతో కేటగిరి-ఏ పనుల మంజూరులో అలసత్వం నెలకొంది. దీనికితోడు కరోనా వ్యాప్తి కారణంగా మరింత జాప్యమవుతోంది. మదనగోపాలసాగరం పైఅంచు నుంచి కాలువ నిర్మించి శివారు ప్రాంతాలకు సాగునీరు అందించాలనే ప్రతిపాదన ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. ఖరీఫ్‌ సీజన్‌కు ముందు కాలువల్లో పనులు చేపట్టకపోవడంతో సకాలంలో సాగునీరందడం లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువల మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

- సంతబొమ్మాళి మండలంలో కోటపాడు-11ఎల్‌, వడ్డితాండ్ర-7ఆర్‌ పిల్ల కాలువలు పిచ్చి మొక్కలు, మట్టితో పూడుకుపోయాయి. కోటపాడు-11ఎల్‌ సైఫన్‌ పూర్తిగా శిథిలమైంది. దీంతో సాగునీటి ప్రవాహానికి అడ్డంకిగా మారింది. వడ్డితాండ్ర-7ఆర్‌ కాలువ పూడిక, గుర్రపు డెక్కతో నిండిపోయింది. దీంతో ఈ ఏడాది ఖరీఫ్‌నకు పూర్తి స్థాయిలో సాగునీరందే పరిస్థితి కానరావడం లేదు. 

- వజ్రపుకొత్తూరు మండలంలో సుమారుగా రెండువేల హెక్టార్లకు పైగా వంశధార నీటిపై ఆధారపడి పంటలు పండిస్తున్నారు. రెండేళ్లుగా వర్షాలు అరకొరగా కురవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఏటా పంటల సమయంలో వంశధార నీటి కోసం రైతులకు ఎదురుచూపులే మిగిలాయి. పలాస నుంచి వజ్రపుకొత్తూరు మండలానికి చేరుకునే 60ఎల్‌, 5ఎల్‌ కాలువలు మరమ్మతులకు నోచుకోకపోవడంతో శివారు భూములకు నీరు అందడం లేదని రైతులు పేర్కొంటున్నారు. వీటి మరమ్మతుల విషయమై అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేస్తున్నా ఫలితం లేకపోతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. 


నేడు నీటి పారుదల శాఖ సలహా మండలి సమావేశం

గత ఏడాది జూలై 18న అధికారులు గొట్టాబ్యారేజ్‌ వద్ద వంశధార ప్రధాన ఎడమ కాలువకు సాగునీటిని విడిచిపెట్టారు. ఈ ఏడాది సాగునీటిని ఎప్పుడు విడుదల చేస్తారనేది స్పష్టత లేదు. దీనిపై శనివారం శ్రీకాకుళంలో కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ అధ్యక్షతన నీటి పారుదల శాఖ ఎస్‌ఈ, లిఫ్ట్‌ ఇరిగేషన్‌, వ్యవసాయశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశం కానున్నారు. సాగునీటి విడుదలపై నిర్ణయం తీసుకోనున్నారు. 

Updated Date - 2021-06-19T05:11:07+05:30 IST