ఏ రచయిత మార్గమైనా వారి కంటే గొప్పదే!

ABN , First Publish Date - 2021-07-19T05:43:19+05:30 IST

వివినమూర్తి ‘ఆయన మార్గం’ వ్యాసం (జూన్‌ 21- వివిధ) బావుంది. కా.రా.తో ఆయనకు సుదీర్ఘమైన, సన్నిహితమైన పరిచయం వుండటం వల్ల ఆయన వ్యక్తిత్వాన్ని గురించి సరిగా చెప్పగలిగారు...

ఏ రచయిత మార్గమైనా వారి కంటే గొప్పదే!

వివినమూర్తి ‘ఆయన మార్గం’ వ్యాసం (జూన్‌ 21- వివిధ) బావుంది. కా.రా.తో ఆయనకు సుదీర్ఘమైన, సన్నిహితమైన పరిచయం వుండటం వల్ల ఆయన వ్యక్తిత్వాన్ని గురించి సరిగా చెప్పగలిగారు. ‘కథానిలయం’ స్థాపనకు సంబంధించి స్వార్థంకోసం చేస్తున్నట్టు, ఆరోపణలు రాకపోవడానికి కారణం ఆయన వ్యక్తిత్వ మనడం తిరుగులేని ఉదాహరణ. కా.రా. వ్యక్తిత్వం గురించి అంత నిర్దిష్టంగా చెప్పిన మూర్తిగారు, ‘ఆయన మార్గం’ గురించి చెప్పింది మాత్రం ఏ రచయితకైనా వర్తించే విధంగా ఉంది.


‘‘శ్రీశ్రీ కన్నా శ్రీశ్రీ మార్గం గొప్పది’’ అని కా.రా. అన్నట్టే, కా.రా. కన్నా కా.రా. మార్గం గొప్పది అన్నారు. కేవలం రచయితకు పొగడ్తలతో ముంచెత్తడమో, ఆకాశానికెత్తడమో కాకుండా, ఆ రచయిత రచనా మార్గం, లేదా ఆలోచనా మార్గం ఏమిటో తెలుసుకోవడం ముఖ్యమనడం అందులో ఉద్దేశం- దాన్ని ‘‘కా.రా. కన్నా కా.రా. మార్గం గొప్పదని మనం తెలుసుకున్న రోజున మహారచయితను మానవ జాతికి అందించే ప్రయాణం ఆరంభమవుతుంది’’ అని, అంత అసాధారణంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ ‘అసాధారణం’ ఇంకో అసాధారణాన్నీ జ్ఞప్తికి తెస్తోంది. ‘యజ్ఞం’ కథలో సీతారాముడు కొడుకును చంపిన ఘట్టాన్ని గురించి, ఒక సాధారణుడిని గ్రహింపును అసాధారణంగా వ్యక్తం చెయ్యడంగా చెప్పారు. నిజానికి దీని గురించి చెప్పడానికే ఈ ప్రస్తావన చేశాను. 


సీతారాముడు కొడుకును చంపి, మూటకట్టి తెచ్చి, అందరిముందూ పడెయ్యడం అనేది ఒకప్పుడు సాహిత్య లోకంలో సంచలనం. దానిపై పెద్ద చర్చ నడిచింది. చర్చకు మూలం రంగనాయకమ్మగారు దానిపై ‘ప్రజా సాహితి’లో తీవ్రమైన విమర్శ చేయడం. నాటి చర్చలో పాల్గొన్న రచయితల్లో నేనూ ఒకణ్ణి.ఇప్పుడు వివినమూర్తి గారు ఆ సంఘటనని ‘అసాధారణంగా వ్యక్తం చెయ్యడం’గా చెప్పినట్టే నేనూ దాన్ని ‘లిటరల్‌’గా చూడకూడదని చెప్పాను. మొత్తంమీద చర్చ అంతా రంగనాయకమ్మగారి విమర్శపై ప్రతివిమర్శ చేయడంగానే నడిచింది. సరే, అది గతం. 


ఇప్పుడు ఆ ప్రస్తావనకు కారణం, ఆ సంఘటనను ‘లిటరల్‌’గా చూడకూడదని చెప్పడంపై, ఆ తర్వాత కలిగిన, ఇప్పటికీ వున్న నా అభిప్రాయం చెప్పాలను కోవడం. వివినమూర్తి గారు చెప్పింది కూడా దాదాపు అదే కావడం. ఆయన ‘అసాధారణంగా వ్యక్తం చెయ్యడం’ అన్నా, నేను ‘లిటరల్‌గా చూడకూడదు’ అన్నా ఒకే అర్థం. పాఠకులకు ‘‘షాక్‌’’ ఇచ్చే విధంగా కథ ముగింపు వుండాలని కా.రా. అనుకున్నారని చెప్పడమే. అయితే, అది కథకు ముగింపు కావచ్చు కానీ, సీతారాముడు, ఆయన తండ్రీ, ఇంకా అటువంటివారు ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారం కానీ, కనీసం సూచనకానీ కాదు: నిస్సహాయురాలైన తల్లి ఆత్మహత్య చేసుకుంటూ బిడ్డలను కూడా చంపడంలో వున్నంత న్యాయం కూడా సీతారాముడి చర్యలో లేదు. సీతారాముడు ఆత్మహత్య చేసుకోలేదు, కొడుకును చంపాడు. వాడికి జీవించే హక్కు లేకుండా చేశాడు. 


ఈ మాటలు అనడంలో నా ఉద్దేశం, కా.రా.ను ఇప్పుడు తప్పుపట్టడం కాదు. ఆయన ఏ ఉద్దేశంతో చెప్పినా అది సరైనది కాదని ఎందుకు చెప్పలేకపోయానా అని నన్ను నేను తప్పుపట్టుకోవడం. సాహిత్య సృజనలోనైనా, విమర్శ లోనైనా తప్పును ఒప్పుకోవడం కూడా తప్పనిసరిగా వుండాలన్నది నా అభిప్రాయం. సమర్థనలు సాహిత్యంపై నమ్మకం కలిగించలేవన్నది నా నమ్మకం. పాఠకులను మభ్యపెట్టాలనుకోకపోతే, సమర్థనల అవసరమే వుండదనీ, తప్పో ఒప్పో చెప్పడమే వుంటుందనీ నా అభిప్రాయం. అందుకే ఈ గత, స్వగత సంభాషణ. 

పి. రామకృష్ణ

Updated Date - 2021-07-19T05:43:19+05:30 IST