ఏదీ భరోసా?

ABN , First Publish Date - 2021-05-10T04:52:36+05:30 IST

నాడు లాక్‌డౌన్‌ సమయంలో ఉపాధి కోల్పోయి ఇంటి పట్టునే ఉన్న వారి వద్దకు వచ్చి బాగున్నావా అంటూ పలకరించి... ఇతోధికంగా సాయం చేసి.. జాగ్రత్తలు చెప్పిన నేతలు నేడు కనీసం కానరావడం లేదు. సాయం సంగతి తర్వాత.. ఆస్పత్రిలో వైద్య అందుతోందా? లేదా? చూసే పరిస్థితి లేదు.

ఏదీ భరోసా?

బయటకు రాని ప్రజాప్రతినిధులు

ఎన్నికల సమయంలో ఎంతో హడావిడి

నేడు కనీస సాయం చేయని వైనం

ప్రశ్నిస్తున్న కొవిడ్‌ బాధితులు


నాడు లాక్‌డౌన్‌ సమయంలో ఉపాధి కోల్పోయి  ఇంటి పట్టునే ఉన్న వారి వద్దకు వచ్చి బాగున్నావా అంటూ పలకరించి... ఇతోధికంగా సాయం చేసి.. జాగ్రత్తలు చెప్పిన నేతలు నేడు కనీసం కానరావడం లేదు. సాయం సంగతి తర్వాత.. ఆస్పత్రిలో వైద్య అందుతోందా? లేదా? చూసే పరిస్థితి లేదు. సామాన్యుడు ఆస్పత్రి బారిన పడి విలవిల్లాడుతుంటే ఆపదలో భరోసా కల్పించే నాథుడు లేడు.  కరోనాతో జనం మృత్యుపాలవుతుంటే ఆ కుటుంబాలకు కస్తా ఊరట ఇచ్చే పరిస్థితి లేదు. ఎన్నికల సమయంలో కరోనా ఉందని కూడా తెలిసి ఇంటింటికీ క్యూ కట్టిన నేతలు ఇప్పుడు పూర్తిగా ముఖం చూపించని వైనాన్ని జిల్లా ప్రజలు విమర్శిస్తున్నారు. 


(విజయనగరం- ఆంధ్రజ్యోతి)

 గత ఏడాది లాక్‌డౌన్‌ కాలంలో ప్రజాప్రతినిధులు ప్రజల్లోనే ఉండేవారు. జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు అవగాహన కల్పించేవారు. రోడ్డుపై తిరుగుతున్న వారిని గుర్తించి ఓ ఎమ్మెల్యే ఏకంగా హెచ్చరించాడు. ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీని ఇబ్బడిముబ్బడిగా చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల నుంచి మున్సిపాలిటీల వరకు ప్రతి ఇంటికీ కూరగాయలు, నిత్యావసరాలు అందజేశారు. స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి సాయం చేసేవి. విజయనగరం కార్పొరేషన్‌లో అయితే రాజకీయ నాయకులు ఇంటింటికీ కూరగాయలు రెండు విడతలుగా అందించారు. ఇవి కాకుండా టూత్‌ బ్రెష్‌ నుంచి సబ్బులు మొదలుకుని అల్పాహారం, భోజన వంటకాలకు కావాల్సిన నిత్యావసరాల డ్రై సరుకులన్నీ పంపిణీ చేశారు. 

 మరి ఆ ధాతృత్వం ఇపుడు కొరవడింది. ప్రజా ప్రతినిధుల ఆచూకీ కన్పించడం లేదు. అంతా అజ్ఞాతంలో ఉంటున్నారు. ప్రస్తుతం కర్ఫ్యూ కొనసాగుతోంది. అనేక మంది ఉపాధి కోల్పోయారు. ముఖ్యంగా చిరువ్యాపారులు, ఇళ్లల్లో పాచిపనులు చేసే పనివారు, కూలీలు, భవన నిర్మాణ కార్మికులు ఇలా అనేక రంగాలకు చెందిన వారు ఉపాధి కోల్పోయి జీవనానికి ఇబ్బందులు పడుతున్నారు. వారికి భరోసా ఇచ్చేందుకు ఏ రాజకీయ పార్టీ ముందుకు రావడం లేదు. ఏ నాయకుడూ స్పందించడం లేదు. ప్రజాప్రతినిధులైతే అసలు ఆచూకీ  లేదు. గతేడాది ఇదే సమయంలో లాక్‌డౌన్‌ ఉండేది. ప్రస్తుతం కర్ఫ్యూ కొనసాగుతోంది. పేరు మారింది. అంతే తప్ప ఉపాధి నష్టం ఒకేలా ఉంది. ఆరుగంటల పాటు సడలింపు ఇచ్చినా ప్రజలు దైనందిన విధుల్లోకి వచ్చేటప్పటికే ఉదయం 10గంటలవుతుంది. ఈ పరిస్థితిలో సడలింపు అంతగా ఉపయోగం లేకపోయింది. ప్రజలు మార్కెట్‌కు వచ్చి వెళ్లేందుకే సడలింపు. బతుకు తెరువుకు ఉపయోగపడడం లేదు. ఈ పరిస్థిలో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. వీరిని ఎవరూ ఆదుకునే పరిస్థితి లేదు. 

ఎన్నికలప్పుడు ఒకలా..

గతేడాది మార్చి నెలలో లాక్‌డౌన్‌ విధించారు. అప్పటికే గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌, నగర పంచాయతీ, మున్సిపల్‌, నగరపాలక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలై ఎన్నికలు నిలిచిపోయాయి. దీంతో పోటీ చేయాలని భావించిన వారు, నామినేషన్లు దాఖలు చేసిన వారు ప్రజల్లోనే ఉంటున్నామని నమ్మ బలికే ప్రయత్నం చేశారు. కొంత మంది ఎమ్మెల్యేలు సొమ్ము ఒకరిది ప్రచారం ఒకరిది అన్న రీతిలో ప్రచారం చేసుకునేవారు. వ్యాపార, వాణిజ్య వేత్తల నుంచి, పరిశ్రమల యాజమాన్యాల నుంచి నిధులు సమీకరించి నిత్యావసరాల పంపిణీ చేపట్టేవారు. తామే పార్టీ పరంగా పంపకాలు చేస్తున్న కలరింగ్‌ ఇచ్చేవారు. పంచాయతీల్లో ఇంటింటికీ సరకులు పంపిణీ చేసి ఓట్లకు గాలం వేశారు. ప్రస్తుతం ఎన్నికలు ముగిశాయి. పదువుల్లో ఆశీనులయ్యారు. ప్రజలను పట్టించుకున్న పరిస్థితి ఎక్కడా కన్పించడం లేదు. ఓట్ల అవసరం ముగిసింది ప్రజలతో పనిలేదన్న భావనతో ఉన్నారు. అందలం ఎక్కించిన వారిని విస్మరిస్తున్నారు. ఇదే సమయంలో కరోనా వైరస్‌ ఎక్కడ తమను తాకుతుందో అన్న భయం కూడా వారిని వెంటాడుతోంది. సాయం చేయాలన్న మనసుంటే స్వయంగా వెళ్లనవసరం లేదని, భౌతిక దూరం పాటించి భరోసా ఇవ్వవచ్చునని అనేక మంది అభిప్రాయపడుతున్నారు.


Updated Date - 2021-05-10T04:52:36+05:30 IST