నిఘా నీడలో ఏవోబీ

ABN , First Publish Date - 2020-12-02T05:55:39+05:30 IST

మావోయిస్టు పార్టీకి వెన్నెముకగా పనిచేస్తున్న పీఎల్‌జీఏ (పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ) ద్విదశాబ్ది వారోత్సవాల నేపథ్యంలో ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

నిఘా నీడలో ఏవోబీ
మంగళవారం రాళ్లగడ్డ అవుట్‌పోస్టును తనిఖీ చేసిన ఎస్పీ కృష్ణారావు డ్రోన్‌ కెమెరాతో సమీప అడవులను పరిశీలిస్తున్న దృశ్యం

నేటి నుంచి పీఎల్‌జీఏ ద్విదశాబ్ది వారోత్సవాలు

ఒకప్పుడు మెరుపు దాడులతో పోలీసులకు సవాల్‌

2013 నుంచి ఎదురుదెబ్బలతో బలహీనం 

తాజాగా దళాల పునర్నిర్మాణంపై మావోల దృష్టి

వారోత్సవాలను అడ్డుకునేందుకు 

పోలీసుల వ్యూహం

రాళ్లగెడ్డ ఏవోపీను సందర్శించిన ఎస్పీ కృష్ణారావు


చింతపల్లి/కొయ్యూరు/సీలేరు, డిసెంబరు 1:

మావోయిస్టు పార్టీకి వెన్నెముకగా పనిచేస్తున్న పీఎల్‌జీఏ (పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ) ద్విదశాబ్ది వారోత్సవాల నేపథ్యంలో ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బుధవారం నుంచి నిర్వహించనున్న వారోత్సవాలను గెరిల్లా దళాల పునర్నిర్మాణానికి వేదికగా చేసుకున్నట్టు తెలిసింది. అయితే మావోయిస్టుల చర్యలను భగ్నం చేయడానికి పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.


మావోయిస్టు పార్టీ ఆవిర్భావానికి ముందు పీపుల్స్‌ వార్‌ గ్రూపుగా వున్న సమయంలో నక్సల్స్‌ నియంత్రణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రేహౌండ్స్‌ను ఏర్పాటుచేసింది. ప్రత్యేక దళాలు, పోలీసుల దాడులను సమర్థంగా తిప్పికొట్టేందుకు పీపుల్స్‌ వార్‌...2000 డిసెంబర్‌ 2న పీపుల్స్‌ గెరిల్లా ఆర్మీ (పీజీఏ)ను ఏర్పాటుచేసింది. తరువాత 2004 సెప్టెంబరు 24న పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ)గా మార్చింది. 200 మందితో ప్రారంభమైన పీఎల్‌జీఏ...పదేళ్లలో ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతాల్లో బలమైన శక్తిగా అవతరించింది. 2012 నాటికి పది వేల మంది సభ్యులు దీనిలో ఉన్నారు.


చరిత్ర సృష్టించిన గెరిల్లా దళాల దాడులు

కూంబింగ్‌ నిర్వహించి బలిమెలలో లాంచీ ద్వారా వెనక్కి వస్తున్న గ్రేహౌండ్స్‌ బలగాలపై గెరిల్లా దళాలు (పీఎల్‌జీఏ) జరిపిన దాడి ఏవోబీ చరిత్రలో అతిపెద్దదిగా చెబు తుంటారు.2008 జూన్‌ 29న 40 మందికిపైగా గ్రేహౌండ్స్‌ సిబ్బంది ప్రయాణిస్తున్న లాంచీపై మావోయిస్టులు ఆధునిక ఆయుధాలతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 39 మంది గ్రేహౌండ్స్‌ కమాండోలు ప్రాణాలు కోల్పోయారు. 2010 ఏప్రిల్‌ 6న దంతెవాడ జిల్లాలోని సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (పీఆర్‌పీఎప్‌)పై దాడిచేసిన ఘటనలో 76 మంది పోలీసులు మరణించారు. 2013 మే 25న ఛత్తీస్‌గఢ్‌లో సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మను టార్గెట్‌గా చేసుకుని కాంగ్రెస్‌ నాయకుల కాన్వాయ్‌పై దాడి చేసిన  ఘటనలో మహేంద్రకర్మతోపాటు 27 మంది మరణించారు.  


2013 నుంచి ఎదురుదెబ్బలు

సీపీఐ మావోయిస్టు పార్టీకి 2013 నుంచి ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. ఎదురుకాల్పులు, లొంగుబాటులు, అరెస్టుల కారణంగా 2017 జనవరి నాటికి గెరిల్లా సైన్యం సంఖ్య గణనీయంగా పడిపోయింది. 2019 నాటికి గెరిల్లా దళాలు, సభ్యుల సంఖ్య మరింత పడిపోయిదని కేంద్ర నిఘా సంస్థలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, ఏపీ రాష్ట్రాల్లో 350 మంది దళసభ్యులు మాత్రమే పనిచేస్తున్నారని చెబుతున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈస్టు-మల్కన్‌గిరి డివిజన్‌ పరిధిలో ప్రత్యేక గెరిల్లా దళాలను ఏర్పాటుచేసేందుకు మావోయిస్టు కేంద్ర కమిటీ నేతలు పావులు కదుపుతున్నట్టు తెలిసింది. 

పీఎల్‌జీఏ వారోత్సవాల సందర్భంగా మావోయిస్టులు విధ్వంసాలకు, దాడులకు పాల్పడవచ్చునని నిఘా వర్గాలు హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమై గాలింపు చర్యలను ఉధృతం చేశారు. దీంతో రానున్న వారం రోజుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఏవోబీలో గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. 


డ్రోన్‌తో సమీప అడవుల పరిశీలన

మావోయిస్టుల కదలికలు అధికంగా వుండే బలపం పంచాయతీ రాళ్లగెడ్డ పోలీసు అవుట్‌పోస్టును జిల్లా రూరల్‌ ఎస్పీ బి.కృష్ణారావు మంగళవారం ఓఎస్‌డీ సతీశ్‌కుమార్‌, ఏఎస్పీ వి.విద్యాసాగర్‌ నాయుడుతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యక్తిగత భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ, మావోల చర్యలను నియత్రించేందుకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. రాళ్లగెడ్డ ఏవోపీ పరిసర ప్రాంతాల అడవులను డ్రోన్‌ కెమెరాతో పరిశీలించారు.

Updated Date - 2020-12-02T05:55:39+05:30 IST