ఏవోబీలో పార్టీకి RK దిశా నిర్దేశం.. వ్యూహరచనలో దిట్ట!

ABN , First Publish Date - 2021-10-17T06:20:17+05:30 IST

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రోజుల క్రితం మృతి చెందిన సీపీఐ మావోయిస్టు పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే (65)కు ఆంధ్రా, ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతంతో దశాబ్దాలుగా అనుబంధం ఉంది.

ఏవోబీలో పార్టీకి RK దిశా నిర్దేశం.. వ్యూహరచనలో దిట్ట!

(విశాఖపట్నం, చింతపల్లి-ఆంధ్రజ్యోతి)

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రోజుల క్రితం మృతి చెందిన సీపీఐ మావోయిస్టు పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే (65)కు ఆంధ్రా, ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతంతో దశాబ్దాలుగా అనుబంధం ఉంది. దండకారణ్య జోన్‌లో కీలకమైన ఏవోబీలో ఆయన 2005లో అడుగుపెట్టారు. ఆ తరువాత కొద్దిరోజులు బయట ప్రాంతానికి వెళ్లినా...తిరిగి వచ్చి ఏవోబీ బాధ్యతలు తీసుకున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే ఏవోబీలో పార్టీని ముందుండి నడిపించారు.  


ఆర్కే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో, పొలిట్‌బ్యూరోలో సభ్యులుగా ఉన్నారు. ఆ హోదాలో ఆయన ఆంధ్రా-ఒడిశా బోర్డర్‌ స్పెషల్‌ జోనల్‌ కమిటీ బాధ్యతలు చూస్తున్నారు. 2016 అక్టోబరు 24న ఏఓబీ కటాఫ్‌ ఏరియా పరిధిలోని రామ్‌గూడలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగిన సంగతి తెలిసిందే. 32 మంది మావోయిస్టులు ఈ ఘటనలో మరణించారు. ఆ సంఘటనలో ఆర్కేకు రెండుచోట్ల బుల్లెట్‌ గాయాలయ్యాయి. ఈ సంఘటన తర్వాత ఆయన ఏడాదిన్నరపాటు దండకారణ్యంలోనే విశ్రాంతి తీసుకున్నారని తెలిసింది. ఆ సమయంలో ఏఓబీకి పద్మక్కను కార్యదర్శిగా నియమించారు. 2020 ఫిబ్రవరి నుంచి ఆర్‌కే తిరిగి ప్రత్యక్షంగా ఏఓబీ వ్యవహరాలు చూస్తున్నారు. విశాఖపట్నం, కోరాపుట్‌, మల్కాన్‌గిరి ప్రాంతాల్లో జరిగిన పలు సమావేశాల్లోనూ (ఏఓబీ విస్తరించిన ప్రాంతం) ఆయన పాల్గొన్నట్లు పోలీసు వర్గాలకు పక్కా సమాచారం ఉంది. సాకెత్‌ అలియాస్‌ శ్రీనివాసరావు అలియాస్‌ ఎస్వీ, సంతోష్‌, గోపాల్‌ పేర్లతో ఆయన పనిచేశారు.


వ్యూహరచనలో దిట్ట

శత్రువుల కదలికలు, వ్యూహాలను పసిగట్టడంలో ఆర్కే దిట్ట. మందుపాతరలు, ఆయుధాల వినియోగంలో ఆయన సిద్ధహస్తుడు. టెక్నికల్‌గా వ్యూహాన్ని రచించడంలో ఆయనకు ఎవరూ సాటిరారంటారు. అందుకే మావోయిస్టు పార్టీలో టెక్‌ అన్న అని ఆర్కేను పిలుస్తారు. బలిమెల జలాశయంలో పోలీసు బలగాలపై దాడి వెనుక ఆర్కే కీలక పాత్ర పోషించారని అప్పట్లో ప్రచారం జరిగింది.


మూడు రాష్ట్రాల పోలీసులకు ముచ్చెమటలు

దక్షిణాదిలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ పోలీసులకు ఆర్కే కంటి మీద కునుకులేకుండా చేశారంటే అతిశయోక్తికాదు. 2004 నుంచి 2012 వరకు ఆర్కే ఏవోబీ, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల్లో పలు వ్యూహాత్మక దాడులకు పాల్పడ్డారు. ఆ కారణంగానే ఈ రాష్ట్రాల ప్రభుత్వాలు ఆర్కే తలకు భారీ నజరానా ప్రకటించాయి. ఆర్కేను పట్టిచ్చినా, ఆచూకీ తెలియజేసినా ఏపీ ప్రభుత్వం రూ.25 లక్షలు, ఒడిశా రూ.20 లక్షలు , జార్ఖండ్‌ రూ.12 లక్షలు, ఛత్తీస్‌గఢ్‌ రూ.40 లక్షలు రివార్డు ప్రకటించాయి. 


ఆరోగ్యం సహకరించకపోయినా..

ఆరోగ్యం సహకరించపోయినా తుది శ్వాస విడిచేంత వరకు ఉద్యమంలోనే కొనసాగాలనే ఏకైక లక్ష్యంతో ఆర్కే ముందుకుసాగారు. 2016 నుంచి ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని చెబుతున్నారు. అయితే పోలీసు నిర్బంధం పెరిగిపోవడంతో మెరుగైన చికిత్స పొందే అవకాశం లేకుండాపోయింది. తనకు అందుబాటులో వున్న వైద్యం పొందుతూ ఉద్యమంలో కొనసాగారు. స్వచ్ఛందంగా లొంగిపోతే మెరుగైన చికిత్స అందిస్తామని పోలీసులు ప్రకటించినప్పటికీ ఆర్కే ఉద్యమాన్ని విడిచి వచ్చేందుకు అంగీకరించలేదు. కిడ్నీ సంబంధిత వ్యాధి తీవ్రం కావడంతో 65 ఏళ్ల వయస్సులో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ అడవుల్లో తుదిశ్వాస విడిచారు. 

Updated Date - 2021-10-17T06:20:17+05:30 IST