ముంచెత్తుతోంది!

ABN , First Publish Date - 2020-09-21T10:19:03+05:30 IST

ముంచెత్తుతోంది!

ముంచెత్తుతోంది!

పెన్నమ్మ ఉగ్రరూపం.. అపార నష్టం

సోమశిలకు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

ఇంకా పెరిగే అవకాశం

ఇప్పటికే నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు

సురక్షిత ప్రాంతాలకు ప్రజలు

5వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

జిల్లా యంత్రాంగం అప్రమత్తం


నెల్లూరు  (ఆంధ్రజ్యోతి), సెప్టెంబరు 20 :

పెన్నమ్మ ఉగ్రరూపం దాల్చుతోంది. కడప, కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో సోమశిల జలాశయానికి ఇన్‌ఫ్లో పెరుగుతోంది. మంగళవారం ఉదయానికి ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే తీర, లోతట్టు ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 2015 తర్వాత భారీస్థాయిలో పెన్నాలో నీరు ప్రవహించడం ఇదే మొదటిసారి. సోమశిల పూర్తిస్థాయిలో నిండడంతో వచ్చిన వరదను వచ్చినట్లు సముద్రం వైపు వదిలేస్తున్నారు చేజర్ల, సంగం, నెల్లూరు రూరల్‌, నెల్లూరు సిటీ, అనంతసాగరం, ఆత్మకూరు మండలాల్లో అధికారులు ఎప్పటికప్పుడు  పరిస్థితిని అంచనావేస్తూ సహాయక చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా పెన్నా పరివాహక ప్రాంతాల్లోని పొలాలు నీట మునిగాయి. ఇప్పటికే కాల్‌ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. 


చేజర్ల మండలంలోని కోటితీర్థం, తూర్పు కంభంపాడు, ఉలవపల్లి, కొట్టాలు, పెరుమాళ్లపాడు, పుట్టుపల్లి గ్రామాల పరిధిలో మూడు వేల ఎకరాల్లో వరి పంట నష్టం జరిగినట్లు అంచనా. ఈ పంట అంతా కోత దశలో ఉంది.  పెన్నా పరివాహక ప్రాంతంలోని మాముడూరు, పులనీలపల్లి, పెళ్లేరు తదితర గ్రామాల్లో డీకేటీ, సీజేఎ్‌ఫఎస్‌ భూముల్లో సాగు చేస్తున్న వేరుశనగ పంట దెబ్బతింది. సుమారు 500 ఎకరాలు ఉంటుందని అంచనా. చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నదిగడ్డ అగ్రహారం గ్రామంలోకి నీరు చేరడంతో 48 మందిని ఎస్టీఆర్‌ఎఫ్‌ సిబ్బంది తెల్లవారుజామున బోటులో సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. పులనీలపల్లి గ్రామంలో కాలువ ఒడ్డున ఉన్న పది కుటుంబాలను ఖాళీ చేయించారు. 


నెల్లూరు రూరల్‌ మండలం పొట్టేపాలెంలోని అరుంధతీవాడ, దళితవాడ ప్రాంతాలు నీట మునిగాయి. ఇక్కడే ఎగువనున్న స్కూలు భవనాల్లోకి పలువురిని తరలించారు. పొట్టేపాలెం పరిధిలోని సుమారు 70 ఎకరాల పట్టా భూముల్లోని వరి దెబ్బతింది. జొన్నవాడ గిరిజన కాలనీలోని పెన్నా తీరం వెంబడి ఉన్న పది ఇళ్లు నీట మునిగాయి. ఈ కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. 


 సంగం ఆనకట్ట వద్ద ఉదయం నుంచి రాత్రి వరకు సరాసరి 1.6 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదైంది. ఆనకట్టకు ఎగువ వైపున ఉన్న బీరాపేరు వాగు నుంచి నీరు పొలాల్లోకి చేరడంతో కోతకు వచ్చిన సుమారు 500 ఎకరాల వరి పంట మునిగిపోయింది. జలదిగ్బంధంలో చిక్కుకున్న ఈర్లగుడిపాడులోని ప్రజలను ఎస్టీఆర్‌ఎఫ్‌ బృందాలు బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు ఈ గ్రామాన్ని పడవలో వెళ్లి సందర్శించారు. 


నెల్లూరులోని జయలలిత నగర్‌, పొర్లుకట్ట ప్రాంతాల్లోకి నీరు చేరడంతో అక్కడి ప్రజలను ఖాళీ చేయించారు. భగత్‌సింగ్‌ కాలనీలోని సుమారు 50 ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. అలీనగర్‌ ప్రాంతంలో సుమారు 20 ఇళు, సచివాలయం నీట మునిగాయి. స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలించారు. కమిషనర్‌, ఆర్డీవో, డీఎస్పీ ఆ ప్రాంతాల్లో పరిశీలించారు. ఇంకా కొన్ని కుటుంబాలను ఖాళీ చేయించే పనిలో ఉన్నారు. జనార్ధనరెడ్డికాలనీ, వెంకటేశ్వరపురం మధ్య కాలువలో నీటి ప్రవాహంతో రాకపోకలు దెబ్బతిన్నాయి. భగత్‌సింగ్‌ కాలనీ సమీపంలో జాతీయ రహదారి పక్కన ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల కోసం వేసిన లేఅవుట్‌ పూర్తిగా నీట మునిగింది. పొట్టేపాలెం వద్ద పుల్లేడు వాగు ద్వారా పెన్నా నీరు నగరంలోని శివగిరికాలనీ, మనుమసిద్దినగర్‌, పుత్తా ఎస్టేట్‌లో కొంతభాగం వరద నీరు చేరింది. ఇన్‌ఫ్లో ఇంకా పెరిగితే ఈ ప్రాంతాలు మరింత నీట మునిగే ప్రమాదముంది. 


అనంతసాగరం మండలం వరికుంటపాడు, కచ్చరదేవరాయపల్లి, వెంగమనాయుడుపల్లి, పాత దేవరాయపల్లి, ఇస్కపల్లి, రేవూరు, బెడుసుపల్లి, ఉప్పలపాడు, లింగంగుంట గ్రామాల సమీపంలోకి నీరు చేరింది. సుమారు 300 ఎకరాల్లో పంట నీట మునిగింది. ఆత్మకూరు మండలంలో బట్టేపాడు, అప్పారావుపాలెం ప్రాంతాల్లోని పొలాలు కూడా నీట మునిగాయి. గ్రామాల సమీపంలోకి నీళ్లు చేరడంతో  అక్కడి ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-09-21T10:19:03+05:30 IST