ప్రశాంతంగా..

ABN , First Publish Date - 2020-09-21T10:34:38+05:30 IST

ప్రశాంతంగా..

ప్రశాంతంగా..

- సచివాలయ పరీక్షలు ప్రారంభం

- తొలిరోజు 9,680 మంది గైర్హాజరు

- కేంద్రాల వద్ద కొవిడ్‌ నిబంధనలు అమలు

- అభ్యర్థులందరికీ థర్మల్‌ స్ర్కీనింగ్‌ 


(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్‌ 20)

కరోనా నిబంధనల నడుమ గ్రామ/వార్డు సచివాలయ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు జిల్లాలో 205 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా.. అభ్యర్థులు ఉరుకులు.. పరుగులతో కేంద్రాలకు చేరుకున్నారు. ఆదివారం 32,793 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా.. 9,680 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. పోస్టుల సంఖ్య అత్యల్పంగా ఉండడంతో చాలామంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు ఆసక్తి చూపలేదు. ప్రధానంగా కేటగిరీ-1 పరీక్షకు ఎక్కువ మంది డుమ్మా కొట్టారు. రెండు పూటలా నిర్వహించిన పరీక్షలకు 32,793 మంది అభ్యర్థులకుగానూ 23,113 మంది హాజరయ్యారు. 9,680 మంది గైర్హాజరయ్యారు. 

- ఆదివారం ఉదయం 146 కేంద్రాల్లో కేటగిరీ-1 విభాగానికి సంబంధించి వెల్ఫేర్‌, ఎడ్యుకేషనల్‌, వార్డు అడ్మినిస్ట్రేషన్‌, మహిళా పోలీసు విభాగాలకు సంబంధించి పరీక్ష నిర్వహించారు. మొత్తం 23,562 మంది అభ్యర్థులకుగానూ 16,600 మంది హాజరయ్యారు. 6,962 మంది గైర్హాజరయ్యారు. 

- మధ్యాహ్నం 59 కేంద్రాల్లో డిజిటల్‌ అసిస్టెంట్‌, పంచాయతీ కార్యదర్శి పోస్టులకు సంబంధించి పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 9,231 మంది అభ్యర్థులకుగానూ 6,513 మంది హాజరయ్యారు. 2,718 మంది గైర్హాజరయ్యారు. 

- ఆరుగురు కరోనా పాజిటివ్‌ బాధితులు కూడా పరీక్ష రాశారు. ఉదయం ఐదుగురు అభ్యర్థులు, మధ్యాహ్నం ఒకరు పరీక్షకు హాజరయ్యారు. ఆ అభ్యర్థులు వేరుగా పరీక్ష రాసేందుకు అధికారులు ముందుగానే ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. 

- ముందుగానే కేంద్రాల వద్ద వైద్యసిబ్బంది, పోలీసులు మోహరించారు. కొవిడ్‌ నిబంధనలు మేరకు అందరినీ తనిఖీ చేశారు. ముందుగా థర్మల్‌ స్ర్కీనింగ్‌ యంత్రంతో జ్వరం ఉన్నదీ లేనిదీ పరిశీలించారు. తర్వాత పల్స్‌ ఆక్సీమీటర్‌తో ఆక్సిజన్‌ శాతాన్ని తనిఖీ చేశారు. ఆక్సీమీటర్‌లో 99 చూపిస్తేనే పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను విడిచిపెట్టారు. అభ్యర్థులు మాస్క్‌లు ధరించి పరీక్షకు హాజరయ్యారు. భౌతికదూరం పాటించేలా ఒక బెంచికి ఒక అభ్యర్థి మాత్రమే ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. దీనికితోడు అధిక సంఖ్యలో అభ్యర్థులు గైర్హాజరు కావడంతో కొంత అసౌకర్యాన్ని తగ్గించింది. ఇక దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ముందుగానే దివ్యాంగులు ఏయే కేంద్రాల వద్ద పరీక్షలు రాయనున్నారో తెలుసుకుని.. అక్కడ వీల్‌చైర్లను ఏర్పాటు చేశారు. ఆశ, ఏఎన్‌ఎం, రెడ్‌క్రాస్‌కు చెందిన వలంటీర్లును అక్కడే ఉంచారు. మారుమూల ప్రాంతాల అభ్యర్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను నడిపింది. దీంతో ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా తొలిరోజు పరీక్ష ముగిసింది.  


కలెక్టర్‌ పరిశీలన

జిల్లాలో కొన్ని పరీక్షా కేంద్రాలను కలెక్టర్‌ నివాస్‌ పరిశీలించారు. శ్రీకాకుళంలో గాయత్రి జూనియర్‌ కళాశాల కేంద్రాన్ని ఆదివారం ఉదదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అభ్యర్థులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. పరీక్షల తీరును పర్యవేక్షించారు. ఎక్కడా తప్పిదాలు చోటుచేసుకున్నాయా.. ఇంకేమైనా అసౌకర్యాలు సంభవించాయా అన్నది డిపార్ట్‌మెంట్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ..‘సచివాలయ పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. ఈనెల 26 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. అభ్యర్థులకు కేంద్రాల వద్ద రోజూ థర్మల్‌ స్ర్కీనింగ్‌ పరీక్ష చేస్తారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి ప్రత్యేక గదులను ఏర్పాటు చేశాం. విభిన్న ప్రతిభావంతుల కోసం 17 పరీక్షా కేంద్రాల వద్ద వీల్‌చైర్లు, సహాయం కోసం వలంటీర్లను అందుబాటులో ఉంచా’మని తెలిపారు. అలాగే పలు కేంద్రాలను జాయింట్‌ కలెక్టర్‌లు శ్రీనివాస్‌, సుమిత్‌ కుమార్‌లు తనిఖీ చేశారు. 


Updated Date - 2020-09-21T10:34:38+05:30 IST