అపార నష్టం

ABN , First Publish Date - 2020-09-21T10:46:12+05:30 IST

అపార నష్టం

అపార నష్టం

దెబ్బతిన్న పంటలు.. రైతుల ఆవేదన

కోతకు గురైన పంట కాలువలు

కూలిన మట్టి మిద్దెలు


చాగలమర్రి, సెప్టెంబరు 20: చాగలమర్రి గ్రామంలోని అడ్డవాగు పొంగి ప్రవహించి 500 ఎకరాల దాకా పంటలు నీట మునిగాయి. పలు గ్రామాల్లో పంట కాలువలు కోతకు గుర య్యాయి. మండలంలో 2 వేల హెక్టార్లలో పంట దెబ్బతి నడటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మట్టిమిద్దెలు, గోడలు కూలిపోయాయి. తోడెండ్లపల్లెలో 3, ముత్యాలపాడులో 8, డి.వనిపెంటలో 18, గొడిగనూరు 21, మద్దూరు 3, బ్రాహ్మణపల్లె 1, కలుగొట్లపల్లె 5, గొట్లూరు 3, రాంపల్లె 2, చిన్నవంగలి 2, పెద్దవంగలి 9, చింతలచెరువు 9, చాగలమర్రి 17 గృహాలు కూలిపోయినట్లు డీటీ శివశంకర్‌రెడ్డి తెలిపారు. ఆయా గ్రామాల్లో పాక్షికంగా దెబ్బతిన్న గృహాల నివేదికలను ఆన్‌లైన్‌లో నమోదు చేశామని, పరిహారం కోసం కలెక్టర్‌కు పంపించామని తెలిపారు. ఆయా గ్రామాల్లోని 265 గృహాల్లోకి వరద నీరు ప్రవేశించినట్లు సర్వే చేసి గుర్తించామన్నారు. జలమయమైన కుటుంబాలకు సహాయ చర్యలు చేపడుతున్నామని అన్నారు. 


పాములపాడు: భానకచెర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ నుంచి జూలై 25 నుంచి ఇప్పటివరకు తెలుగుగంగ, ఎస్సార్బీసీ, కేసీసీ ఎస్కేప్‌ చానల్‌ కాల్వల ద్వారా దిగువకు 88.82 టీఎంసీల నీటిని తరలించారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడం, శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద నీరు రావడంతో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా శ్రీశైలం కుడి గట్టు ప్రధాన కాలువ మీదుగా భానకచెర్ల నీటి సముదాయానికి చేరుకున్న నీటిని మూడు కాలువల ద్వారా తరలిస్తున్నారు. క్రాస్‌ రెగ్యులేటర్‌ నుంచి తెలుగుగంగ కాల్వ ద్వారా 35.68టీఎంసీలు, ఎస్సార్బీసీ కాలువ ద్వారా జీఎన్‌ఎ్‌సఎ్‌స కాల్వకు 32.47టీఎంసీలు, కేసీసీ ఎస్కేప్‌ చానల్‌ కాలువకు 20.67టీఎంసీల నీటిని తరలించినట్లు తెలుగుగంగ జేఈ దేవేంద్ర తెలిపారు. 


నందికొట్కూరు: పట్టణంలో ఇళ్లల్లోకి నీరు చేరి ధాన్యం, సామగ్రి తడిపోయిన భాధిత కుటుంబాలను వైసీపీ నాయకుడు చంద్రమౌళి ఆదివారం పరామర్శించి భోజనం ప్యాకెట్లు అందజేశారు. పట్టణ నాయకులు సుధాకర్‌రెడ్డి, లాలూప్రసాద్‌, మధుసూధన్‌రెడ్డి, ఉస్మాన్‌బేగ్‌, బాషా పాల్గొన్నారు. 


బేతంచెర్ల: మండలంలోని కొలుములపల్లె గ్రామంలో వర్షం వచ్చినప్పుడల్లా వృద్ధ దంపతులు ఓబులేసు, బాలఓబులమ్మ అవస్థలు పడుతు న్నారు. మట్టిమిద్దె కారుతోందని, సరుకులు తడిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరమ్మతులకు సాయం చేయాలని అధికారులను కోరుతున్నారు. 


ప్యాపిలి: మండలంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. పంటలు నీటి పాలయ్యాయి. 


కొలిమిగుండ్ల: కొలిమిగుండ్లలో ఆదివారం భారీ వర్షం కురిసింది. దీంతో అనంతపురం - అమరావతి ప్రధాన రహదారి వాగును తలపించింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో కొలిమిగుండ్ల, బెలుం, మదనంతపురం, అంకిరెడ్డిపల్లె, కనకాద్రిపల్లె, గొర్విమానుపల్లె గ్రామాల పరిధిలో భారీ వర్షం కురిసింది. పొలాల్లోని వర్షపునీరు కొలిమిగుండ్లలోని ప్రవహించింది. 

సంజామల: గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పాలేరువాగు ఉప్పొంగుతోంది. ఆదివారం కూడా వాగు ఉధృతి తగ్గకపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వాగు ఉధృతికి మండలంలోని ముచ్చలపురి, హోత్రమానెదిన్నె, కమలపురి, వసంతాపురం, బొందలదిన్నె గ్రామాలు జలదిగ్భంధంలో ఉన్నాయి. శనివారం రాత్రి వర్షం కురవకపోవడంతో కూలీలు పనులకు వెళ్లారు. వాగు ఉధృతి ఉన్నా ఒకరి చేయి ఒకరు పట్టుకొని పనులకు వెళ్లారు.


కోవెలకుంట్ల: మండలంలోని భీమునిపాడు గ్రామంలోని కుమ్మరి సంజమ్మ అనే ఇళ్లు ఆదివారం ఉదయం కూలిపోయింది. అలాగే గుళ్లదుర్తి గ్రామంలోని చిన్నపుల్లారెడ్డి అనే రైతు ఇంటి గోడ కూలిపోయింది. 


మహానంది: మహానంది మండలంలో ఆదివారం భారీ వర్షం కురిసింది. మండలంలో 10.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఉదయం నుండి రాత్రి వరకు కురిసిన వర్షం వల్ల ఎంసీ ఫారం సమీపంలోని పాలేరువాగుపై నీటి ఉదృతి కొనసాగింది. దీంతో అటువైపు రాకపోకలు కొనసాగలేదు. పంటలు నీటమునిగాయి.


గడివేముల: మండలంలో వారం రోజుల నుంచి పడుతున్న వర్షాలకు వేలాది ఎకరాల్లో పంట దెబ్బతింది. గడిగరేవులలో 250 ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న మినుము పంట తడిచి పోయింది. గని, గడివేముల గ్రామాల్లో సుమారు 200 ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న పంటల్లో వర్షపు నీరు నిల్వ ఉంది. కుందూనది వెంట ఉన్న మొక్కజొన్న, వరి, నీట మునిగింది. 


ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు కుందూనది ఉధృతంగా పారడంతో కొరటమద్ది వద్ద ఉన్న తాత్కలిక వంతెన కోతకు గురైంది. దీంతో వందలాది వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిందాల్‌ పరిశ్రమ, గడివేములకు వచ్చే వాహనాలు రహదారిపై నిలిచి పోయాయి. దీంతో జిందాల్‌ యాజమాన్యం వంతెనకు మరమ్మతులు చేయించింది.

దొర్నిపాడు: మండలంలో గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అలాగే వర్షపు నీరు ఇళ్లల్లోకి ప్రవేశించాయి. రోడ్లపై గుంతలు పడి కుంటలను తలపిస్తున్నాయి. 

ఓర్వకల్లు: మండలంలోని వివిధ గ్రామాల్లో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి రైతులు సాగుచేసిన పంటలు నీటిలో మునిగి తీవ్రంగా నష్టపోయారు. మీదివేముల గ్రామంలో వంద ఎకరాల్లో పత్తి, వేరుశనగ, కొర్ర, తదితర పంటలు దెబ్బతిన్నాయి. 

బండి ఆత్మకూరు: బండిఆత్మకూరు మండలంలో వారం రోజులుగా జోరు వాన కురుస్తూనే ఉంది. దీంతో మండలంలోని కుందూ నదితో పాటు మద్దిలేరు, రాళ్ళ వాగు, ఉప్పాగు , గుంపెనవాగు, సంకలవాగులు పొంగి ప్రవహి స్తూనే ఉన్నాయి. దీంతో వీటి తీరం వెంట ఉన్న వరి పంట పొలాలు మునిగిపోయాయి.

Updated Date - 2020-09-21T10:46:12+05:30 IST