వరద నష్టం తీవ్రం!

ABN , First Publish Date - 2020-10-22T10:13:48+05:30 IST

వరద నష్టం తీవ్రం!

వరద నష్టం తీవ్రం!

ఆంధ్రజ్యోతి- మచిలీపట్నం :

వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, కృష్ణానదికి వచ్చిన వరదల కారణంగా జిల్లాలో 23,949 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు బుధవారం  ప్రాథమిక నివేదికలో వెల్లడించారు. 32 మండలాల్లోని  6594.10 హెక్టార్లలో ఉద్యానపంటలు దెబ్బతిన్నాయని, 10,184 మంది రైతులు పంటలు కోల్పోయారని, ఉద్యాన పంటలకు రూ.187.94కోట్ల నష్టం వాటిల్లిందని నిర్ధారించారు. ఉద్యానపంటలు కోల్పోయిన రైతులకు రూ.10.81 కోట్లు పంట నష్టపరిహారంగా అందించాలని ప్రభుత్వానికి నివేదిక పంపారు. నిమ్మతోటలు 11 హెక్టార్లలో, అరటి 905.98 హెక్టార్లలో,  తమలపాకు తోటలు 17 హెక్టార్లలో, మిర్చి 2122.20 హెక్టార్లలో, డ్రాగన్‌ఫ్రూట్‌ 80సెంట్లలో, పూలతోటలు 50.80హెక్టార్లలో, జామతోటలు 39.90హెక్టార్లలో, మామిడితోటలు 4హెక్టార్లలో, బొప్పాయి 90.60హెక్టార్లలో, పసుపుతోటలు 2028.10 హెక్టార్లలో, కూరగాయల తోటలు 603.92హెక్టార్లలో, కంద 768.40హెక్టార్లలో దెబ్బతిన్నట్లుగా లెక్క చూపారు. అరటి, పసుపు, మిర్చి తోటలకు భారీగా నష్టం వాటిల్లినట్లుగా చూపారు. 


17,255 హెక్టార్లలో ఉద్యానేతర పంటలకు నష్టం 

జిల్లాలోని 44 మండలాల పరిధిలోని 324 రెవెన్యూ గ్రామాల్లో  ఈతదశలో ఉన్న వరి, మొదటి తీత, పూత, పిందె దశలో ఉన్న పత్తి, తదితర పంటలు 17,255 హెక్టార్లలో దెబ్బతిన్నట్లుగా చూపారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 13.50 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరుగుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. భారీ వర్షాల నేపథ్యంలో 10 లక్షల టన్నుల దిగుబడి మాత్రమే వస్తుందని అధికారుల అంచనాగా ఉంది. దాదాపు 3.50 లక్షల టన్నుల దిగుబడి తగ్గుతుండటంతో రైతులు నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. పత్తి ఎకరానికి 18 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని రైతులు ఆశించగా భారీ వర్షాల కారణంగా పిందె, పూత రాలిపోయి 10 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తుందని రైతులు చెబుతున్నారు. వరదలు, భారీవర్షాల కారణంగా జిల్లాలో 47,943 మంది  ప్రజలు వరద తాకిడికి గురికాగా, 16వేలకుపైగా ఇళ్లు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. జిల్లాలో వెయ్యి కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, పురపాలకసంఘాల రహదారులు దెబ్బతిన్నాయి. దీనివల్ల దాదాపు రూ.318 కోట్లమేర నష్టం జరిగింది. ఈనెలాఖరులోపు పూర్తిస్థాయిలో పంటల నష్టం అంచనాలు రూపొందిస్తే మరింతగా నష్టం పెరిగే అవకాశం ఉంది.

Updated Date - 2020-10-22T10:13:48+05:30 IST