కొండంత నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2020-10-22T10:10:39+05:30 IST

కొండంత నిర్లక్ష్యం

కొండంత నిర్లక్ష్యం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

ఇంద్రకీలాద్రిపై కాసులు దండుకునే పనులపైనే దృష్టి పెట్టిన అధికారులు భక్తుల భద్రతను గాలికొదిలేశారు. బుధవారం కొండచరియలు విరిగి పడిన ప్రాంతం పక్కనే మీడియా పాయింట్‌ ఉంది. సీఎం వస్తున్న సందర్భంగా అక్కడ పెద్ద ఎత్తున మీడియా వాళ్లు వేచి ఉన్నారు. కొండ చరియలు ఆ ప్రాంతంలో పడినా పెను ప్రమాదం జరిగేది. 


కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం.. 

బుధవారం దుర్గగుడి చెంత భారీగా కొండచరియలు విరిగిపడిన ఉదంతంలో పెనుప్రమాదం తప్పింది. మూలానక్షత్రం కావడంతో బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం జగన్‌ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు రావాల్సి ఉంది. సీఎం రావడానికి 15 నిమిషాల ముందు మౌనస్వామి ఆలయం ఉన్న ప్రాంతం నుంచి భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు పడిన ప్రాంతంలోనే సీఎం కాన్వాయ్‌ నిలవాల్సి ఉంది. సీఎం రాకకు 15 నిమిషాల ముందు ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో భారీ ప్రమాదం తప్పినట్లయింది. సీఎం వచ్చిన సమయంలో ప్రమాదం జరిగి ఉంటే పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించేది. 


భద్రత గాలికి.. కాసులు జేబులోకి..

దసరా ఉత్సవాల్లో తాత్కాలిక ఏర్పాట్లకే సుమారు రూ.1.5 కోట్లు ఖర్చు పెట్టిన అధికారులు భక్తుల భద్రతను మాత్రం గాలికొదిలేశారు. రోజూ కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉంటుందని అందరికీ తెలుసు. పైగా గుడి చెంతనే కొండచరియలు నెర్రెలు ఇచ్చి, కనిపిస్తూనే ఉన్నాయి. అయినా ఇంజనీరింగ్‌ అధికారులు దీనిపై ఎలాంటి దృష్టి సారించకుండా, శివాలయం చెంతన మాత్రం కొండచరియల రక్షణకు రూ.10 లక్షలు కేటాయించారు. అక్కడ ఎలాంటి పనులు చేపట్టకుండానే నిధులు స్వాహా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అవసరమైన చోట నిధులు వెచ్చించకుండా అవసరం లేని చోట నిధులు కేటాయించి, జేబులో వేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


కొండ రక్షణ అంటే కాసుల పంటే..

ఇంద్రకీలాద్రిపై కొండచరియలు తరచూ విరిగిపడుతూ ఉంటాయి. దీన్ని అరికట్టేందుకు 2008లో నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ కొండను పరిశీలించి, ఎక్కడెక్కడ రక్షణ చర్యలు తీసుకోవాలో సూచించింది. ఆమేరకు ఇనప మెష్‌ వేసి, సిమెంటు కట్టడాలు చేపట్టామని ఇంజనీరింగ్‌ అఽధికారులు చెబుతున్నా, ఈ పనులకు కేటాయించిన నిధుల్లో అధికశాతం అధికారులు, కాంట్రాక్టర్ల జేబుల్లోకే వెళ్లాయన్న వాదన ఉంది. పనులు చేపట్టకుండానే చేసినట్లు చూపుతూ, నిధులు స్వాహా చేయడంలో దుర్గగుడి ఇంజనీరింగ్‌ విభాగానిది అందె వేసిన చేయి. ఎప్పటికప్పుడు ఈ ప్రొక్యూర్‌మెంటు విధానంలో టెండర్లు పిలిచి అయినవారికి అప్పగించి, కమీషన్లు జేబులో వేసుకోవడం దుర్గగుడి అధికారులకు మామూలే. ఫలితమే కొండచరియల ప్రమాదం. ఈ ఏడాది దసరా నవరాత్రులు ప్రారంభమవ్వడానికి ముందు రోజే ఓం మలుపు వద్ద కొండ పై నుంచి రాళ్లు పడ్డాయి. దీంతో తాత్కాలికంగా ఘాట్‌ రోడ్డులో రాకపోకలు నిలిపివేశారు. రూ.10 లక్షలతో తూతూ మంత్రంగా పనులు చేసి, రాకపోకలను పునరుద్ధరించారు. ఆ సమయంలోనే పకడ్బందీగా తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇంత వరకు వచ్చేది కాదన్న వాదన ఉంది. ఈసారి దుర్గగుడి చెంతనే గతంలో ఎన్నడూ పడనంత పెద్ద రాళ్లు పడటంతో భక్తులు, దేవస్థానం సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. 

Updated Date - 2020-10-22T10:10:39+05:30 IST