పాసింజర్‌ రైళ్లకు మంగళం!

ABN , First Publish Date - 2020-10-22T10:12:27+05:30 IST

పాసింజర్‌ రైళ్లకు మంగళం!

పాసింజర్‌ రైళ్లకు మంగళం!

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : పేదలకు రైల్వే ప్రయాణం భారమవుతోంది. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న పాసింజర్‌ రైలు దూరమవుతోంది.! బీఎస్‌ఎన్‌ఎల్‌ మాదిరిగా రైల్వేను కూడా ప్రైవేటు చేతిలో పెట్టే దిశగా అడుగులేస్తున్న ప్రభుత్వం పాసింజర్‌ రైళ్లను ఎక్స్‌ప్రెస్‌ రైళ్లుగా మార్చేయాలని నిర్ణయించింది. దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో మొత్తం 47 పాసింజర్‌ రైళ్లను రైల్వే బోర్డు రద్దు చేసింది. ప్రజాగ్రహాన్ని దృష్టిలో ఉంచుకుని రద్దు చేసినట్టు చెప్పకుండా, వీటిని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లుగా మార్చివేస్తున్నట్టు ప్రకటించింది. దేశవ్యాప్తంగా అనేక జోన్ల పరిధిలోని పాసింజర్‌ రైళ్ల జాబితాను రైల్వే బోర్డు విడుదల చేసింది. దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో 47 పాసింజర్‌ రైళ్లను రద్దు చేయగా, వాటిలో సగం విజయవాడ డివిజన్‌కు చెందినవి, ఈ మార్గంలో వెళ్లేవే ఉన్నాయి. పాసింజర్‌ రైళ్లను ఎప్పటినుంచో వదిలించుకోవాలని చూస్తున్న రైల్వే శాఖ కరోనా కాలాన్ని ఇందుకు అనువుగా మార్చుకుంది. పాసింజర్‌ రైళ్లను తొలగించినట్టు చెబితే, వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో వాటి స్థానంలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. డిమాండ్‌ ఉంటే ఎక్స్‌ప్రెస్‌లను అదనంగా నడుపుకోవటంలో తప్పులేదు. కానీ, పేదలకు అందుబాటులో ఉండే పాసింజర్‌ రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చితే ఈ భారం ఎవరి మీద పడుతుంది? డిమాండ్‌ ఉన్న రూట్లలో పాసింజర్‌ రైళ్లు ఆదాయ వనరుగా లేవని రైల్వే భావిస్తోంది. కానీ, విజయవాడ - గూడూరు, విజయవాడ - విశాఖపట్నం, విజయవాడ - కాకినాడ టౌన్‌ ఇలాంటి పాసింజర్‌ రైళ్లకు చాలా డిమాండ్‌ ఉంది. ఈ రూట్లలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను అదనంగా నడుపుకునే అవకాశమున్నా, ఆ ప్రయత్నం చేయకుండా పాసింజర్‌ రైళ్లను తొలగించాలని భావించడం విమర్శలకు తావిస్తోంది.


రద్దయిన పాసింజర్‌ రైళ్లు ఇవే.. 

 మచిలీపట్నం - విశాఖపట్నం డైలీ, విశాఖపట్నం - మచిలీపట్నం డైలీ, నర్సాపూర్‌- విశాఖపట్నం, విశాఖపట్నం - నర్సాపూర్‌, గుంటూరు - నర్సాపూర్‌, నర్సాపూర్‌ - గుంటూరు, తిరుపతి - గుంటూరు, గుంటూరు - తిరుపతి, విజయవాడ - కాకినాడ పోర్టు, కాకినాడ పోర్టు - విజయవాడ, కాకినాడ పోర్టు - విశాఖపట్నం, విశాఖపట్నం - కాకినాడ పోర్టు, విజయవాడ - గూడూరు, గూడూరు - విజయవాడ, విజయవాడ - నర్సాపూర్‌, నర్సాపూర్‌ - విజయవాడ పాసింజర్‌ రైళ్లను రద్దు చేశారు. వీటినే ఎక్స్‌ప్రెస్‌లుగా నడుపుతామని రైల్వే బోర్డు ప్రకటించింది. వాస్తవానికి ఇవన్నీ అత్యంత డిమాండ్‌ ఉన్న పాసింజర్‌ సర్వీసులు. డిమాండ్‌ ఉన్న ఈ పాసింజర్‌ రైళ్లను ఎక్స్‌ప్రెస్‌ల పేరుతో రద్దు చేయటంపై విమర్శలు వస్తున్నాయి

Updated Date - 2020-10-22T10:12:27+05:30 IST