ఇం..ధనంలో ఏపీ దూకుడు

ABN , First Publish Date - 2021-01-25T08:13:21+05:30 IST

దక్షిణ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానం సాధించింది. ఈ అగ్రస్థానం నీట్‌ ర్యాంకుల్లోనో, రాష్ర్టాన్ని అభివృద్ధి చేయడంలోనో కాదు.

ఇం..ధనంలో ఏపీ దూకుడు

  • పెట్రోల్‌, డీజిల్‌పై బాదుడే బాదుడు
  • పెట్రో ధరల్లో దక్షిణాదిలోనే నం.1
  • ధరలు ఎక్కువున్న రాష్ట్రాల్లో టాప్‌ 3
  • సహజవాయువునీ వదలని సర్కారు
  • విపక్షంలో ఉండగా ధరలపై ఆక్రోశం
  • అధికారంలోకి రాగానే భారీగా వడ్డన
  • నాటి జగన్‌ వ్యాఖ్యలు ట్రెండింగ్‌ 


‘‘అన్నొస్తున్నాడు... మంచి రోజులొస్తున్నాయని చెప్పండి. మన రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు తీసుకుంటే బాదుడే.... బాదుడు. ఈ విషయం బయటకు రాకుండా ఉండాలని తాపత్రయపడుతున్నారు. ఇది న్యాయమేనా?’’ అని ప్రతిపక్షంలో ఉండగా వైఎస్‌ జగన్‌ విమర్శించేవారు. ఇప్పుడు అధికారంలో జగనన్నే ఉన్నారు. కానీ, ఇన్నాళ్లలో పెట్రోలు, డీజిల్‌ ధరలు రాష్ట్రంలో తగ్గింది లేదు. పైగా ఇంధన ధరలు భారీగా పెరుగుతూ పోతున్నాయి.


(అమరావతి- ఆంధ్రజ్యోతి) : దక్షిణ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానం సాధించింది. ఈ అగ్రస్థానం నీట్‌ ర్యాంకుల్లోనో, రాష్ర్టాన్ని అభివృద్ధి చేయడంలోనో కాదు. ఇంధన ధరల మోత మోగించడంలో మనమే అందరి కంటే ముందు నిలిచాం. ఈ విషయంలో ఏపీది ఒక్క దక్షిణాదిలోనే కాదు దేశంలోనూ మూడో స్థానం. మహారాష్ట్ర, రాజస్థాన్‌ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. దక్షిణ భారతంలో మాత్రం పెట్రోలు, డీజిల్‌ అమ్మకాల్లో ప్రజలపై అత్యధిక పన్నులు మోపే రాష్ట్రంగా ఏపీ దూసుకుపోతోంది. దీంతో ప్రతిపక్షంలో ఉండగా ఏపీలోనే అత్యధిక ధరలు అంటూ జగన్‌ ఊదరగొట్టిన ప్రసంగాలు ఇప్పుడు ట్రెండింగ్‌ అవుతున్నాయి. అప్పుడు అలా ఽమాట్లాడి, ఇప్పుడు జగన్‌ చేసిందేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో పెట్రోలుపై 31శాతం, డీజిల్‌పై 22.5శాతం వ్యాట్‌ ఉంది. కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్‌ సుంకం  కేంద్రానికి వెళితే, వ్యాట్‌ పూర్తిగా రాష్ర్టాలకు దక్కుతుంది. ఇంధన ధరలు పెరుగుతూ వెళితే, అందుకు అనుగుణంగా వ్యాట్‌ భారమూ ప్రజలపై పెరుగుతుంది. ఇది చాలదు అన్నట్టు పెట్రోలు, డీజిల్‌ ఒక్కో లీటరుపై రూ.4 చొప్పున అదనపు వ్యాట్‌ వసూలు చేస్తున్నారు. 


తెలుగుదేశం హయాంలో ఇది రూ.2గా ఉంటే, అధికారంలోకి వచ్చిరాగానే జగన్‌ ప్రభుత్వం దానికి అదనంగా మరో రూ.2 భారం జనంపై వేసింది. ఈ మధ్యకాలంలో రోడ్ల అభివృద్ధి పన్ను పేరుతో పెట్రోలు, డీజిల్‌పై కొత్త పన్నును సృష్టించి మరో రూపాయి భారం వేసింది. అయితే ఆ రూపాయిపై తిరిగి వ్యాట్‌ వేయడంతో అది పెట్రోలుపై రూ.1.31, డీజిల్‌పై రూ.1.22గా మారింది. దీంతో మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కో లీటరు పెట్రోలుపై రూ.25, డీజిల్‌పై రూ.20 ఆదాయం వస్తోంది. కేంద్రానికి వెళ్లే ఎక్సైజ్‌ సుంకంలో ఎలాగూ రాష్ర్టాలకు వచ్చే కామన్‌ పూల్‌ వాటాలో రాష్ట్ర వాటా రాష్ర్టానికి వచ్చేస్తుంది. అయితే ఈ పన్నుల పరంపర కేవలం పెట్రోలు, డీజిల్‌కే పరిమితం కాలేదు. సహజవాయువుపై వసూలుచేసే వ్యాట్‌ను ఒకేసారి పది శాతం పెంచేశారు. అప్పటివరకూ తాము సేఫ్‌ అనుకున్న గ్యాస్‌ ఆటోల డ్రైవర్లకు సైతం చుక్కలు చూపించారు. పది శాతం వ్యాట్‌ పెంచడంతో కిలో సీఎన్‌జీపై ఒకేసారి అదనపు భారం రూ.ఆరు పడింది. మొత్తంగా సాఽధారణ వాహనదారులతో పాటు కొద్దిపాటి సరుకు రవాణా చేసుకునే పేదలు, ఆటోవాలాలు ఇంధన ధరల్లో అత్యధిక భారం మోసే పరిస్థితి వైసీపీ ప్రభుత్వం తలెత్తింది.


భారీ వ్యత్యాసం...

మన రాష్ట్రంలో విధిస్తున్న పన్నుల భారం పక్క రాష్ర్టాల ఇంధన వ్యాపారులకు లాభసాటిగా మారింది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాల్లోని ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న బంకుల వద్ద ఏపీకి, అక్కడి ధరలకు ఎంత తేడా ఉందో ఫ్లెక్సీలు కట్టి మరీ ప్రదర్శిస్తున్నారు. ‘ఏపీలోకి వెళ్తే మీ జేబు ఖాళీ అవుతుంది’ అని పరోక్షంగా చెబుతున్నారు. ఏపీలోని పెట్రోలు ధర కంటే తెలంగాణలో రూ.3, తమిళనాడులో రూ.4, కర్ణాటకలో రూ.4, కేరళలో రూ.5 తక్కువగా ఉంది. డీజిల్‌ ధర కూడా దాదాపుగా అంతే తక్కువగా పక్క రాష్ర్టాల్లో ఉంది. అందువల్ల ఏపీ మీదుగా ప్రయాణించే వాహనాలు ఆ రాష్ర్టాల్లో ట్యాంకులు నింపుకొని ప్రయాణిస్తున్నాయి. కాగా, దేశంలోని మహారాష్ట్ర, రాజస్థాన్‌ల్లోనూ ధరలు మాత్రమే ఏపీ కంటే ఎక్కువగా ఉన్నాయి. మిగిలిన రాష్ర్టాల్లోని ధరలన్నీ ఏపీ కంటే దిగువనే ఉన్నాయి.


దక్షిణాది రాష్ర్టాల్లో ధరల తీరుతెన్నులు

రాష్ట్రం        పెట్రోలు          డీజిల్‌

ఆంధ్రప్రదేశ్‌ 92         84.7

తెలంగాణ 89.15 82.8

తమిళనాడు 88.29 81.14

కేరళ         87.73  81.79

కర్ణాటక 88.59 80.47

Updated Date - 2021-01-25T08:13:21+05:30 IST