ఏపీ అసెంబ్లీలో బిల్లులపై చర్చ ప్రారంభం

ABN , First Publish Date - 2020-12-02T16:00:31+05:30 IST

ఏపీ శాసనసభ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.

ఏపీ అసెంబ్లీలో బిల్లులపై చర్చ ప్రారంభం

అమరావతి: ఏపీ శాసనసభ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అలాగే అసైన్డ్‌ల్యాండ్‌ బిల్లును డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌ ప్రవేశపెట్టగా... హోంమంత్రి మేకతోటి సుచరిత దిశ బిల్లును ప్రవేశపెట్టారు. ప్రస్తుతం విద్యుత్ సవరణ బిల్లుపై సభలో చర్చ ప్రారంభమైంది. టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడు సభలో మాట్లాడుతూ సౌర విద్యుత్ పీపీఏల విషయంలో గతంలో చెప్పిన దానికీ.. ఇప్పుడు ప్రభుత్వం చేస్తోన్న దానికీ ఎందుకు తేడా వచ్చిందని ప్రశ్నించారు. సౌర నిద్యుత్ ప్లాంటుకు అసైన్డ్ భూములనే తీసుకోవాల్సిన అవసరం ఏముందన్నారు. దళితుల భూములను లాక్కోవడం దేనికి..? అని ఆయన నిలదీశారు. అసైన్డ్ భూములను తీసేసుకోవడానికి ఏకంగా చట్టమే చేయడం బాధాకరమని అచ్చెన్నాయుడు తెలిపారు.


కాగా అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను వైసీపీ మంత్రులు తప్పుబట్టారు. సభను అచ్చెన్నాయుడు తప్పు దోవ పట్టిస్తున్నారని  మంత్రి పినిపే విశ్వరూప్ విమర్శించారు. సౌర విద్యుత్ ప్లాంట్ పెట్టే చోట మాత్రమే అవసరమైన మేరకు అసైన్డ్ భూములు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని స్పష్టం చేశారు. మొత్తం అసైన్డ్ భూములపై చట్టం చేస్తున్నట్టు అచ్చెన్నాయుడు మాట్లాడ్డం సరికాదన్నారు.


అలాగే మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రూ.6 మేర ఒప్పందం చేసుకుంటుంటే ఈ ప్రభుత్వం రూ. 2.50కే అగ్రీమెంట్ చేసుకుంటున్నామని తెలిపారు. టీడీపీది ఆర్బాటంతో.. ఆవేశంతో కూడుకున్న అసమర్ధత అని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో కూడా సోలార్ పవర్ ప్లాంట్ ఏ జిల్లాల్లో పెట్టాలనుకున్నారో.. తామూ అక్కడే చేపడుతున్నామని తెలిపారు. అసైన్డ్ భూములను లీజుకిచ్చే అవకాశం కల్పిస్తూ చట్టం చేస్తున్నామన్నారు. రాయలసీమలో పంటలే పండని ప్రాంతంలోని భూములను లీజుకివ్వడం ద్వారా దళితులకు లబ్ది చేకూర్చే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి చెప్పుకొచ్చారు. ఎకరాకు రూ. 5 వేలు కూడా పొందలేని దళిత అసైన్డ్ రైతులకు రూ. 25 వేలు వచ్చేలా చర్యలు చేపడుతున్నామన్నారు. బిల్లును చూడకుండా టీడీపీ ఇష్టానుసారంగా మాట్లాడుతోందని మండిపడ్డారు.


వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ... టీడీపీకి దళితుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. రాజధానిలో దళితుల భూములను కారు చౌకగా కొట్టేసింది చంద్రబాబు.. టీడీపీ నేతలు కాదా..? అని ప్రశ్నించారు. దళితులు, పేదలనే పదాలు వాడే అర్హత టీడీపీకి లేదని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-12-02T16:00:31+05:30 IST