R Krishnaiahకు జగన్‌ పిలిచి మరీ రాజ్యసభ సీటివ్వడం వెనుక ఇంత కథ ఉందా?

ABN , First Publish Date - 2022-05-17T22:58:14+05:30 IST

ఏపీలో రాజ్యసభ ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. ఖాళీ కానున్న స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో..

R Krishnaiahకు జగన్‌ పిలిచి మరీ రాజ్యసభ సీటివ్వడం వెనుక ఇంత కథ ఉందా?

అమరావతి: ఏపీలో రాజ్యసభ ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. ఖాళీ కానున్న స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాల భర్తీకి అధికార పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. అయితే.. అనూహ్యంగా వైసీపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా బీసీ నేత ఆర్.కృష్ణయ్యను ఖరారు చేసింది. జగన్ ప్రభుత్వం రాజకీయ వ్యూహంలో భాగంగానే కృష్ణయ్యకు ఈ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. 2019లో ఏకపక్షంగా గెలిచిన వైఎస్సార్‌సీపీకి తాజాగా ఓటమి భయం పట్టుకుంది. సీఎం జగన్ సభలకు అరకొర స్పందన వస్తుండటం కూడా ఆ పార్టీని మరింత కలవరపాటుకు గురిచేస్తోంది.



ఈ నేపథ్యంలో గెలిచేందుకు ఉన్న ఏ అవకాశాన్నీ జగన్ వదులుకోదలచుకోలేదు. ఆ సామాజిక సమీకరణాల్లో భాగంగానే ఆర్.కృష్ణయ్యను రాజ్యసభకు పంపించాలని వైసీపీ నిర్ణయించింది. ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ టికెట్ ఇచ్చి పార్లమెంట్‌కు పంపడం ద్వారా బీసీల్లో వైసీపీ పట్ల మైలేజ్ వస్తుందని, వచ్చే ఎన్నికల్లో బీసీ ఓటు బ్యాంకుపై ఈ పరిణామం ప్రభావం చూపుతుందని వైసీపీ లెక్కలు కడుతోంది. సడన్‌గా బీసీల వైపు వైసీపీ చూపు పడటానికి మరో ప్రధాన కారణం కూడా ఉంది. ఏపీలో బీసీలు ఇంత కాలం టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచారు. గత ఎన్నికల్లో బీసీ ఓటు బ్యాంకులో కొంత వైసీపీకి కలిసొచ్చిందే తప్ప ఆ పార్టీ వెంటే బీసీలు ఉన్నారని జగన్ కూడా భావించడం లేదు. మంత్రివర్గంలో బీసీలకు పెద్ద పీట వేశామని చెప్పుకుంటున్న వైసీపీకి బీసీ వర్గాల్లో మాత్రం చెప్పుకోదగ్గ ఆదరణ అయితే లేదు. అందుకే.. ఆర్.కృష్ణయ్యను రాజ్యసభ ఎంపీగా ఖరారు చేయడం ద్వారా బీసీల్లో వైసీపీ పట్ల సానుకూలత వస్తుందని జగన్ భావిస్తున్నారు.



రాష్ట్ర జనాభాలో 49.55 శాతం ఉన్న బీసీల ఓట్లు వైసీపీకి ఎంతో కీలకం. టీడీపీకి మొదటి నుంచి ప్రధాన బలంగా ఉన్న బీసీలు వచ్చే ఎన్నికల్లో కూడా ప్రస్తుత వైసీపీ పాలనపై అసంతృప్తితో టీడీపీకి గంపగుత్తగా ఓటేస్తే వైసీపీకి రాజకీయంగా నష్టం తప్పదు. ఆ భయంతోనే మంత్రివర్గంలో బీసీలకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించడం, తాజాగా ఆర్.కృష్ణయ్యకు పిలిచి మరీ రాజ్యసభ సీటివ్వాలని జగన్ భావించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే.. జగన్ అంచనాలు తప్పే అవకాశమూ లేకపోలేదు. ఎందుకంటే.. 2014లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇదే ఆర్.కృష్ణయ్యను చంద్రబాబు ప్రకటించారు. ఆదిలాబాద్‌లో జరిగిన టీడీపీ ఎన్నికల బహిరంగ సభ సాక్షిగా కృష్ణయ్యను సీఎం అభ్యర్థిగా బాబు ప్రకటించారు. టీడీపీకి ఎంతో మద్దతుగా నిలిచే బీసీలు కృష్ణయ్యను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఏకపక్షంగా టీడీపీకి ఓట్లు వేస్తారనే వ్యూహంలో భాగంగా తెలుగుదేశం ఈ ప్రయత్నం చేసింది. కానీ.. ఆ ఎన్నికల్లో టీడీపీకి కేవలం 12 సీట్లు మాత్రమే దక్కాయి.



ఆర్.కృష్ణయ్యతో టీడీపీ చేసిన ప్రయోగం రాజకీయంగా ఆ పార్టీకి అంతగా ఉపయోగపడలేదు. ఇప్పుడు మళ్లీ వైసీపీ ఇంచుమించు ఇదే తరహా ప్రయోగం చేస్తోంది. అయితే.. వైసీపీకి కూడా ఈ వ్యూహం రాజకీయంగా పెద్దగా కలిసిరాకపోవచ్చనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. మంత్రివర్గంలో బీసీలను తీసుకున్నామని, బీసీ కార్పొరేషన్ పదవులను పెద్ద ఎత్తున ఇచ్చామని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా బీసీల్లో అట్టడుగున ఉన్నవారికి చేసిందేమీ లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. బీసీ ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య ఒక్కరికి రాజ్యసభలో ప్రాతినిధ్యం కల్పించినంత మాత్రాన ఏపీలో ఉన్న బీసీలంతా తమకే ఓటేస్తారని వైసీపీ భావిస్తే మాత్రం అతిశయోక్తే అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ సీటివ్వాలని జగన్ భావించడాన్ని బీసీ సామాజిక వర్గం మనసు గెలుచుకోవడానికి వైసీపీ చేస్తున్న ఒక ప్రయత్నంగా మాత్రమే భావించాలని అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2022-05-17T22:58:14+05:30 IST