అమ్మను మరిచిన జగన్

ABN , First Publish Date - 2022-04-22T01:02:27+05:30 IST

ఏపీ సీఎం జగన్‌కు, ఆయన కుటుంబసభ్యులకు మధ్య రగడ ముదురుతోందా? కనీసం తల్లికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు చెప్పలేనంత స్థితికి..

అమ్మను మరిచిన జగన్

ఏపీ సీఎం జగన్‌కు, ఆయన కుటుంబసభ్యులకు మధ్య రగడ ముదురుతోందా? కనీసం తల్లికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు చెప్పలేనంత స్థితికి ఆ గొడవలు చేరాయా? వైఎస్‌ విజయమ్మకు జగన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు ఎందుకు చెప్పలేదు?


వైఎస్‌ విజయమ్మ. వైసీపీ గౌరవాధ్యక్షురాలు. ఏపీలో వైసీపీకి, ఇటు తెలంగాణలో షర్మిల పార్టీకి కూడా ఆమె గౌరవాధ్యక్షురాలే. జగన్‌ సీఎం అయ్యేవరకూ అటు విజయమ్మ, ఇటు షర్మిలా ఎంత తాపత్రయపడ్డారో ఏపీ జనానికి బాగా తెలుసు. షర్మిల అయితే జగనన్న వదిలిన బాణాన్ని అంటూ జనం మధ్యకు వచ్చారు. తన బిడ్డను ఆశీర్వదించమంటూ విజయమ్మ ప్రచారం చేశారు. 2019లో ఏపీలో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. 


అయితే జగన్‌ సీఎం అయ్యాక మారిపోయారు. జగన్‌ కుటుంబసభ్యుల మధ్య దూరం పెరిగింది. కుటుంబసభ్యులను కరివేపాకులా వాడుకున్నారనే ప్రచారం బాగా సాగింది. ఇందుకు బలం చేకూరుస్తూ షర్మిల ఓపెన్‌ అప్‌ అయ్యారు. ఏకంగా తెలంగాణలో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీని పెట్టారు. మరోపక్క ఆమె భర్త బ్రదర్‌ అనిల్‌కుమార్‌ ఏపీలో పర్యటిస్తూ బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని ఎత్తుకున్నారు. క్రిస్టియన్‌ మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీల ఓట్లపై గురిపెట్టారు. విజయమ్మకు ఈ విషయంలో కొద్దిగా సంకట స్థితి ఏర్పడింది. 


కానీ ఆమె నేరుగా ఎప్పడూ బయటపడలేదు. అటు ఏపీలో వైసీపీకి, ఇటు తెలంగాణలో వైయస్ ఆర్ గౌరవాధ్యక్షురాలిగా కొనసాగుతూనే ఉన్నారు. కానీ జగన్‌ విజయమ్మను, షర్మిలను  దూరం పెట్టారని వైసీపీ వర్గాల ఇన్‌సైడ్ టాక్‌. పార్టీ కోసం కష్టపడిన తల్లీ కూతుళ్ళను జగన్‌ పట్టించుకోవడంలేదని  చెపుతున్నారు. ఈ విషయంలో విజయమ్మ, షర్మిల ఎంతో అసంతృప్తికి గురయ్యారనేది నిజం. ఇక విజయమ్మ కూడా వైఎస్సార్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలి పార్టీకి రాజీనామాకు సిద్ధపడ్డారనే వార్తలు వచ్చాయి. త్వరలో జరగబోయే వైసీపీ ప్లీనరీ తరువాత ఈ తంతు పూర్తవుతుందని తెలుస్తోంది. 


మానవసంబంధాల గురించి జగన్‌ తెగ గొప్పలు చెపుతుంటారు. ఇక నేను చూశాను, నేను విన్నాను లాంటి డైలాగులకైతే కొదవేలేదు. అలాంటి జగన్‌ సొంత తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పకపోవడం వైసీపీలోనూ హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటిదాకా తల్లి పుట్టినరోజున నాడు జగన్‌ ట్విట్టర్‌లో శుభాకాంక్షలను తెలిపేవారు. అంతేకాదు సీఎం కేసీఆర్‌, స్టాలిన్‌ లాంటి నేతల పుట్టినరోజులకు ఆయన శుభాకాంక్షలు చెప్పడం రివాజే. కానీ మొన్నటికి మొన్న విజయమ్మ పుట్టినరోజు నాడు మాత్రం అమ్మా నీకు పుట్టనరోజు శుభాకాంక్షలు అని చెప్పడానికి  జగన్‌కు తీరిక లేకపోయినట్టుంది. ఎప్పుడూ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు చెప్పే జగన్‌ ఈసారి మౌనం పాటించడంపై చర్చ సాగుతోంది.


ఈ ఒక్క సంఘటనతో జగన్‌ తనకు నచ్చకపోతే తల్లినైనా లెక్కపెడతారనేది స్పష్టమవుతోంది. నిజానికి ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే కదా  అని అంటారు. కానీ జగన్‌ తాను వీటన్నింటికీ అతీతమని భావిస్తున్నట్టున్నారు. ఒక ఆదర్శప్రాయమైన స్థానంలో ఉన్నప్పుడు అన్ని బంధాలను గౌరవించాల్సిన నైతిక బాధ్యత ఆ స్థానంలో ఉన్నవారిపై ఉంటుంది. కానీ జగన్‌ తనకు తాను అన్ని విషయాలలోనూ మినహాయించుకుంటారు. తనకు నచ్చినదే చేస్తారు. ఇప్పటికే జగన్‌ కుటుంబసభ్యులకు దూరమయ్యారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్ దొరకదు. పరిశీలనగా చూస్తే జగన్‌ పక్కన కనిపించే ఏకైక వ్యక్తి సజ్జల ఒక్కరే. గతంలో చక్రం తిప్పిన విజయసాయీ హవా కూడా తగ్గింది. అప్పట్లో జగన్‌ వెంట నడిచినవారందరూ దూరంగా ప్రేక్షకపాత్రకే పరిమితమవుతున్నారు. దీన్నిబట్టి అధికారంలోకి వచ్చాక జగన్‌ ఆలోచనా ధోరణి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 


అయినా అమ్మకు అన్నం పెట్టనివాడు పిన్నమ్మకు పట్టుచీర కొనిపెడతానన్నాడుట.  తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేని జగన్‌ ఏపీ ప్రజలను ఎలా ఉద్ధరిస్తారని జనం ప్రశ్నిస్తున్నారు. అదేదో సినిమాలో చెప్పినట్టు... ప్రేమిస్తే ఏమవుతుంది డ్యూడ్‌... మహా అయితే తిరిగి ప్రేమిస్తారు... మరి జగన్‌ ఈ చిన్నలాజిక్‌ ఎందుకు మిస్‌ అవుతున్నారు? 



Updated Date - 2022-04-22T01:02:27+05:30 IST