ఏపీ విద్యాశాఖ హడావుడి

Jun 17 2021 @ 00:58AM
ప్రాథమిక విద్యకు సంస్కరణల శాపం..!


 

వైఎ్‌సఆర్‌ ప్రైమరీ, ఫౌండేషన్‌ స్కూళ్ల ఏర్పాటుకు ఉత్తర్వులు

3, 4, 5 తరగతుల తరలింపుపై విమర్శలు

డ్రాపౌట్స్‌ పెరిగే ప్రమాదం

కొత్త నిర్ణయం ప్రైవేటు, కార్పొరేట్‌కు 

ఊతమంటున్న మేధావులు, విద్యావేత్తలు

నేడు సంఘాల నాయకుల రాష్ట్ర స్థాయి సమావేశం


అనంతపురం విద్య, జూన్‌ 16: ఏ రంగంలోనైనా సంస్కరణలు.. .సరికొత్త ఆలోచనలు రేకెత్తించాలి. అవి ఉన్న సమస్యలు, సంక్లిష్టతలకు సులువైన మార్గాలు చూపి, పరిష్కారం చేయాలి. విద్యాశాఖ సంస్కరణల పేరుతో తీసుకుంటున్న కొన్ని నిర్ణయలు సరికొత్త సమస్యలకు వేదికగా మారుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవల జాతీయ నూతన విద్యావిధానం (ఎన్‌ఈపీ)-2020 అమలులో భాగంగా ఏపీ విద్యాశాఖ హడావుడి చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుత 10+2 విధానాన్ని 5+3+3+4గా మార్చే ప్రయత్నాలపై విమర్శలు వస్తున్నాయి. ఈ విధానం ప్రైమరీవిద్యకు శాపంగా మారుతోందని విద్యావేత్తలు, నిపుణులు, మేధావులు పేర్కొంటున్నారు. నూతన విద్యావిధానం అమలుపై గురువారం రాష్ట్ర స్థాయిలో అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు సమావేశం నిర్వహించనుండడం ఉత్కంఠ రేపుతోంది.


తరగతుల తరలింపుపై విమర్శలు

కేంద్ర ప్రభుత్వం జాతీయ నూతన విద్యావిధానం-2020 అమలులో భాగంగా రాష్ట్రంలో 5+3+3+4గా తరగతులను తీర్చిదిద్దనున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అంగన్‌వాడీలను వైఎ్‌సఆర్‌ ప్రీప్రైమరీ స్కూళ్లుగా, ఇప్పటికే ప్రాథమిక స్కూళ్లలో ఉన్న 1, 2 తరగతులను ప్రిపరేటరీ క్లాస్‌ 1ను కలసి ఫౌండేషన్‌ స్కూళ్లుగా మార్చనున్నట్లు పేర్కొన్నారు. ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను 3 కిలోమీటర్ల పరిధిలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు తరలిస్తామంటున్నారు. ఈ మేరకు ఇటీవలే ఉత్తర్వులు ఇచ్చారు. క్షేత్రస్థాయిలో స్కూళ్ల మ్యాపింగ్‌ కూడా పూర్తిచేశారు. 3 కిలోమీటర్ల దూరంలోని యూపీ, హైస్కూళ్లలోకి ప్రైమరీ స్కూళ్ల తరలింపుతో డ్రాపౌట్స్‌ పెరుగుతారనడంలో సందేహం లేదు. చిన్నపిల్లలు అంతదూరం ప్రయాణించలేరనీ, దీని వల్ల పిల్లలు ప్రైవేటువైపు తరలి వెళ్లే ప్రమాదం ఉందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.


వసతులు, వనరులు లేకుండా ఎలా..?

క్షేత్రస్థాయిలో మౌలిక వసతులు, వనరులు లేకుండా కొత్త విధానానికి శ్రీకారం చుట్టే ప్రయత్నాలపై విమర్శలు వస్తున్నాయి. 3, 4, 5 తరగతుల తరలింపు మూలంగా ఉన్నత పాఠశాల లేదంటే ప్రాథమికోన్నత పాఠశాలలో అదనపు తరగతులు మరింత అవసరం.  వందలాది మంది విద్యార్థులు, టీచర్లు ప్రైమరీ స్కూళ్ల నుంచి ఆ స్కూళ్లలో వచ్చి కలుస్తారు. ముందస్తుగా అదనపు తరగతి గదులు, సదుపాయాలు, వనరులు కల్పించకుండా ముందుకెళ్లడం అంత సహేతుకం కాదన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. విద్యాశాఖ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు, మేథావులతోపాటు, అంగన్‌వాడీ సంఘాల నాయకుల నుంచి కూడా విముఖత వ్యక్తమవుతోంది. కొత్త విధానం అమలుకు తీసుకొంటున్న సంస్కరణలు ప్రైమరీ విద్యకు శాపంగా మారే ప్రమాదం ఉందన్న అభిప్రాయం ఉపాధ్యాయ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.


ఏకపక్ష నిర్ణయాలు తగవు : సూర్యచంద్రయాదవ్‌, జిల్లా కార్యదర్శి, ఎస్‌ఎ్‌ఫఐ

కేంద్రం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానంలోనే అనేక లోపాలున్నాయి. దానిని ఎస్‌ఎ్‌ఫఐ గతంలోనే ఎండగట్టింది. ఆ లోపాలను ఎత్తిచూ పాం. తాజాగా ఏపీ ప్రభుత్వం దానిని అమలు చేసేందుకు ముందస్తు ప్రణాళిక లేకుంగా హడావుడి చేయడం హాస్యాస్పదం. రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారులు దూరదృష్టితో ఆలోచించి, ప్రైమరీ విద్యావ్యవస్థ విచ్ఛినం కాకుండా చూడాలి.172 ఉత్తర్వులకు సవరణ చేయాలి : హరికృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు, ఎన్‌టీఏ

విద్యాశాఖ ఇచ్చిన 172 ఉత్తర్వులు సవరించాలి. ప్రాథమిక, మాధ్యమిక విద్యను అందించే పాఠశాలలను డ్రాపౌట్స్‌ నివారణ నిమిత్తం అలాగే కొనసాగించాలి. కొత్త విధానం అమలు నేపథ్యంలో ఏర్పాటయ్యే 11, 12 తరగతుల్లో బోధనకు స్కూల్‌ అసిస్టెంట్లకు గెజిటెడ్‌ హోదా ఇచ్చి జూనియర్‌ లెక్చరర్స్‌(జేఎల్‌)గా ఉద్యోగోన్నతి కల్పించాలి.పసిపిల్లలపై ప్రభావం :  సూర్యుడు, జిల్లా అధ్యక్షుడు, ఎస్టీయూ

ప్రైమరీ స్కూళ్లలోని 3, 4, 5 తరగతులు తరలిస్తే చిన్నపిల్లలు దూరంగా ఉన్న స్కూళ్లకు వెళ్లాలంటే రవాణా అవసరం. దీని వల్ల పిల్లలపై శ్రమ పడుతుంది. పైగా చాలా చోట్ల అదనపు తరగతి గదుల కొరత ఉంది. 3 కిలోమీటర్ల దూరం వెళ్లలేక స్కూళ్లలో డ్రాపౌట్స్‌ పెరుగుతారు. ఈ విఽధానం వల్ల ప్రాథమిక విద్య అస్తవ్యస్తంగా మారుతుంది.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.