విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు చేదు అనుభవం!

ABN , First Publish Date - 2021-11-10T14:41:08+05:30 IST

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు ఎయిడెడ్‌ నిరసనల సెగ తగిలింది. అనంతపురంలో విద్యార్థులపై లాఠీచార్జి, ఎయిడెడ్‌ విద్యాసంస్థల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు మంత్రిని నిలదీశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, మంత్రికి మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు పోలీసులు వచ్చి..

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు చేదు అనుభవం!
మంత్రి సురేశ్‌ను నిలదీస్తున్న విద్యార్థి సంఘాల నేతలు

విద్యామంత్రికి ‘ఎయిడెడ్‌’ సెగ!

విద్యార్థులపై లాఠీచార్జి, విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన

మీడియా సమావేశానికి దూసుకొచ్చిన విద్యార్థి సంఘాలు 

ప్రభుత్వ నిర్ణయాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ 

నేతలను అరెస్టు చేసి బలవంతంగా తరలించిన పోలీసులు 

అనంతలో దాడి ప్రతిపక్షాలు, చంద్రబాబు కుట్రే: మంత్రి సురేశ్‌ 

మీడియా సమావేశంలోకి దూసుకొచ్చిన విద్యార్థి సంఘాలు 

అనంతలో దాడి ప్రతిపక్షాలు, చంద్రబాబు కుట్రే: మంత్రి సురేశ్‌ 


అమరావతి(ఆంధ్రజ్యోతి): విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు ఎయిడెడ్‌ నిరసనల సెగ తగిలింది. అనంతపురంలో విద్యార్థులపై లాఠీచార్జి, ఎయిడెడ్‌ విద్యాసంస్థల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు మంత్రిని నిలదీశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, మంత్రికి మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు పోలీసులు వచ్చి ఆందోళనకారులను బలవంతంగా లాక్కెళ్లి వాహనాల్లో తరలించారు. పీజీసెట్‌ ఫలితాలను విడుదల చేసేందుకు మంత్రి సురేశ్‌ విజయవాడలోని రోడ్లు, భవనాల శాఖ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. సమావేశం కొనసాగుతుండగా హఠాత్తుగా విద్యార్థి సంఘాలు, విద్యార్థులు నినాదాలు చేసుకుంటూ లోపలకు వచ్చారు. టీఎన్‌ఎస్ఎఫ్‌, ఏఐఎస్ఎఫ్‌, పీడీఎస్‌యూ బ్యానర్లు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు.


ఆందోళన చేస్తున్న విద్యార్థుల వద్దకు మంత్రి వెళ్లి మాట్లాడారు. ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాలలో గాయపడిన విద్యార్థిని జయలక్ష్మిని పోలీసులు కొట్టలేదని, ఎవరో రాయి విసరడంతోనే ఆమెకు గాయమైందని వివరించారు. ఎయిడెడ్‌ కళాశాలల విలీనంతో నష్టమేమీ లేదని, ఫీజులను ప్రభుత్వమే ఇస్తుందన్నారు. ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని, ఎయిడెడ్‌ కళాశాలల విలీనం వద్దన్నందుకు పోలీసులతో దాడి చేయించడమేంటని విద్యార్థులు ప్రశ్నించారు. జీవో.46ను తక్షణం రద్దుచేసి, విలీనం ఆపేయాలన్నారు. ఈ వాగ్వాదం కొనసాగుతుండగానే పోలీసులు రంగంలోకి దిగి, విద్యార్థులను వెళ్లిపోవాలని హెచ్చరించారు. ఏపీఎస్‌పీ పోలీసులు విద్యార్థులను బలవంతంగా లాక్కెళ్లి వ్యాన్‌లో ఎక్కించి అక్కడినుంచి త రలించారు. 


ఇదంతా రాజకీయ కుట్ర: సురేశ్‌ 

ఆ తర్వాత మంత్రి సురేశ్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనంతపురంలోని కళాశాలలో విద్యార్థులపై జరిగిన దాడి ప్రతిపక్షాలు, చంద్రబాబు కుట్రేనని విమర్శించారు. ఎయిడెడ్‌ కళాశాలల విలీనాన్ని రాజకీయం చేస్తున్నారన్నారు. విద్యార్థులతో రాజకీయం చేయాలని లోకేశ్‌ అనుకుంటున్నారని, ఇది పులిమీద స్వారీలాంటిదని మంత్రి వ్యాఖ్యానించారు. కాగా, గాయపడిన విద్యార్థినీ విద్యార్థులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ బధవారం పరామర్శించనున్నారు. అయితే కళాశాలలో రాజకీయ కార్యక్రమాలు నిర్వహించేందుకు అవకాశం ఇస్తే ఒప్పుకోబోమని మంత్రి సురేశ్‌ పేర్కొన్నారు. 



Updated Date - 2021-11-10T14:41:08+05:30 IST