ఎరుక లేదా నాయకా!

ABN , First Publish Date - 2022-01-15T08:12:56+05:30 IST

‘‘నాయకుడికి నాలుగు విషయాలు ఎక్కువ తెలియాలి. నలుగురికంటే ఎక్కువే తెలియాలి. కానీ... మా నాయకులకు

ఎరుక లేదా   నాయకా!

  • సంఘాల నేతలపై ఉద్యోగులు గరంగరం
  • ముఖ్యమంత్రి ముందు చప్పట్లు ఎందుకు కొట్టారు?
  • బయటికి వచ్చి ఎందుకు హర్షం వ్యక్తం చేశారు?
  • సీఎస్‌ కమిటీ కాదు... పీఆర్సీ నివేదికే ముఖ్యమని తెలీదా?
  • ఫిట్‌మెంట్‌ తగ్గితే జరిగే నష్టం మీకు తెలియదా?
  • పెండింగ్‌ డీఏలను ఒకేసారి ఇవ్వడం మాయ కాదా?
  • హెచ్‌ఆర్‌ఏపై పట్టుపట్టకుండా మౌనం ఎందుకు?
  • వరుస ప్రశ్నలతో ఉద్యోగ సంఘాల నేతలు ఉక్కిరి బిక్కిరి
  • సంక్రాంతి పండుగకూ ప్రశాంతత కరువు

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘‘నాయకుడికి నాలుగు విషయాలు ఎక్కువ తెలియాలి. నలుగురికంటే ఎక్కువే తెలియాలి. కానీ... మా నాయకులకు ఏం తెలుసో మాకే తెలియడంలేదు. అప్పుడు ముఖ్యమంత్రి ముందు చప్పట్లు కొట్టి వచ్చారు. ఇప్పుడు... అసలు విషయం తెలియక మోసపోయాం అని వాపోతున్నారు! మరి వీళ్లేం నాయకులో!’’.... రాష్ట్రవ్యాప్తంగా ఏ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కలిసినా ఇదే చర్చ! తమ ప్రయోజనాలను కాపాడటంలో నాయకులు విఫలమయ్యారని వారు మండిపడుతున్నారు. ఉద్యోగుల డిమాండ్ల విషయంలో చర్చలు జరిగినప్పుడు పట్టు విడుపులు  సహజమే! కానీ అడ్డంగా మోసపోతున్నామని తెలి సీ చప్పట్లు కొట్టి రావడమేమిటని ఉద్యోగులు విస్తుపోతున్నారు.



అన్నిటికీ ‘ఊ’ కొట్టడమేనా...

ఈ నెల 7న సీఎం జగన్‌ పీఆర్సీ ప్రకటించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. ఐఆర్‌ (27శాతం) కంటే తక్కువగా 23.29శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించారు. అదే సమయంలో ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62ఏళ్లకు పెంచుతూ ప్రకటన చేశారు. ఇంతకు మించి ఏ అంశంపైనా సీఎం స్పష్టత ఇవ్వలేదు. అయినా సరే ఉద్యోగ సంఘాల నేతలు చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేశారు. ఐఆర్‌కంటే తక్కువ ఫిట్‌మెంట్‌కు ఎందుకు అంగీకరించారనే ప్రశ్నకు ‘‘మేం అడగనివీ ఇచ్చారు. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోక తప్పదు’’ అని వ్యాఖ్యానించారు.


నిజానికి ఆ రోజు సీఎం ఏకపక్షంగా ఒక ప్రకటనచేసి వెళ్లిపోయారు. సమావేశానికి ముందే ‘ఈ రోజు చర్చలుండవు. ప్రకటన మాత్రమే ఉంటుంది’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రకటించారు. దీనిపై తమ నేతలు అప్పుడే అభ్యంతరం వ్యక్తం చేసి ఉండాల్సిందని ఉద్యోగులు అంటున్నారు. ‘‘అప్పటిదాకా ఫిట్‌మెంట్‌పై స్పష్టత లేదు. అశుతోశ్‌ మిశ్రా కమిషన్‌ ఇచ్చిన నివేదికను బయటపెట్టలేదు. అసలు విషయాలేవీ తేలకున్నా సీఎం ప్రకటన ఎలా చేస్తారు? ఆ భేటీకి ఉద్యోగ సంఘాల నేతలు ఎందుకు హాజరయ్యారు?’’ అని ప్రశ్నిస్తున్నారు.




పీఆర్సీ ప్రకటనకు మిశ్రా కమిషన్‌ నివేదికే ప్రామాణికం కావాలి. కానీ... సీఎం ప్రకటనలో ఆ మాటే వినిపించలేదు. ‘సీఎస్‌ కమిటీ అంతే ఇమ్మంది. మేం ఇంత ఇస్తున్నాం. సీఎస్‌ కమిటీ అప్పుడెప్పటి నుంచో ఇమ్మంది. మేం ఇప్పుడే ఇస్తున్నాం’ అంటూ మొత్తం సీఎస్‌ కమిటీ సిఫారసుల గురించే మాట్లాడారు. ‘‘సీఎస్‌ కమిటీని ప్రభుత్వం వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చింది. ఈ విషయం కూడా మా నాయకులకు తెలియదా?’’ అని ఉద్యోగ సంఘాల నేతలు నిలదీస్తున్నారు.


డీఏల మాయ కూడా తెలియదా?

ప్రభుత్వం ఐదారు డీఏలను సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో పెట్టింది. వాటిని జనవరి నుంచి ఇచ్చేస్తామని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. ఉద్యోగ సంఘాల నేతల హర్షానికి ఇదీ ఒక కారణం! అయితే... ఇలా డీఏలను పెండింగ్‌లో పెట్టి ఒకేసారి విడుదల చేయడంలోనూ పెనుమాయ దాగి ఉందనే విషయాన్ని తమ నేతలు గ్రహించలేకపోయారని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ‘‘డీఏలు మాకు చట్టబద్ధంగా, హక్కుగా ఎప్పటికప్పుడు రావాలి. కానీ.. ఫిట్‌మెంట్‌ను బాగా తగ్గించి, ఒకేసారి డీఏలు విడుదల చేయడంలోనే మోసం ఉంది. దీనివల్ల... పెరగాల్సిన జీతం పెరగదు. అలాగని... తగ్గదు. పీఆర్సీ కూడా ఇచ్చినట్లు అవుతుంది. ఈ సూక్ష్మాన్ని మా నాయకులు గ్రహించలేకపోయారా? లేక... తెలిసి కూడా సీఎం ముందు మౌనం ప్రదర్శించారా’’ అని ఉద్యోగులు నిలదీస్తున్నారు.


ఏం సాధించారని?: ‘కొన్ని రావాలంటే... కొన్ని వదులుకోవాలి’ అని సీఎంతో ప్రకటన అనంతరం ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొన్నారు. హక్కుగా రావాల్సినవి ఎందుకు వదులుకోవాలి? అసలు... వచ్చాయి అంటున్న ఆ ‘కొన్ని’ ఏమిటి? అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే... చరిత్రలో లేని విధంగా ఐఆర్‌కంటే తక్కువ ఫిట్‌మెంట్‌కు ఉద్యోగ నేతలు అంగీకరించి వచ్చారు. పైగా... సీఎస్‌ కమిటీ తన నివేదికలో హెచ్‌ఆర్‌ఏను భారీగా కోత పెట్టింది. సీసీఏ ఇవ్వక్కర్లేదని చెప్పింది. ఇంకా... ఉద్యోగులకు సంబంధించిన అనేక ప్రయోజనాలపై సీఎస్‌ కమిటీ ‘వ్యతిరేకత’ కనబరిచింది. ఇవేవీ ఉద్యోగ సంఘాల నాయకులు సీఎం ముందు ప్రస్తావించలేదు.


‘ఇతర విషయాలు సీఎ్‌సతో మాట్లాడుకోండి’ అంటూ జగన్‌ వెళ్లిపోయారు. ఇప్పటికి 8 రోజులు అవుతున్నా హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, పెన్షనర్లకు అదనపు క్వాంటమ్‌ పెన్షన్‌పై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. ఇంకా పీఆర్సీలో ఉన్న అనేక అంశాలపై స్పష్టత రాలేదు. సీఎస్‌ కమిటీ సిఫారసుల మేరకు జీవోలు వెలువడ్డాయంటే... ఒక్కో ఉద్యోగికి వేలలో జీతం తగ్గిపోతుంది. ఈ సంగతి అప్పుడు తెలియనట్లు, కొత్తగా తెలుసుకున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు నానా హైరానా పడుతున్నారు. రెండు మూడు రోజులుగా సీఎంవో అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. చర్చలు, భేటీల పేరుతో మళ్లీ అదే కథ. అడగాల్సినప్పుడు అడగకుండా ఆహా, ఓహో అని.. ఇప్పుడు పరుగులు పెట్టడమేంటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.



నివేదికే సాధించలేని వారు నేతలా? 

జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాల్లో అశుతోశ్‌ మిశ్రా కమిటీ పీఆర్సీ  నివేదిక ఇవ్వాలంటూ నేతలు పట్టుబట్టారు. అయితే.. ప్రభుత్వం ఆ నివేదిక ఇవ్వకుండా అధికారుల కమిటీ నివేదికతో సరిపెట్టినా మిన్నకుండిపోయారు. నిరసనల పేరిట హడావుడి చేసి... ఎలాంటి నిర్దిష్టమైన హామీ రాకుండానే, ఆందోళనలను ఉపసంహరించుకున్నారు. చివరికి... తమ మాట ఏదీ నెగ్గించుకోకుండానే, సీఎం ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు. తమపై ఉద్యోగుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండటంతో ఆత్మరక్షణలో పడ్డారు. ‘మమ్మల్ని దూషించవద్దు’ అని వేడుకుంటూ... నష్ట నివారణ చర్యలను అన్వేషిస్తున్నారు. అటు ప్రభుత్వంపై పోరాడలేక, ఇటు సాటి ఉద్యోగులను సంతృప్తి పరచలేక అడకత్తెరలో పోకచక్కల్లా నలుగుతున్నారు.


Updated Date - 2022-01-15T08:12:56+05:30 IST