
విజయవాడ: ఇందిరాగాంధీ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 11వ పీఆర్సీ గురించి ప్రస్తావించారు. ఉద్యోగులకు పీఆర్సీ వల్ల ఉపయోగాలు అంటూ ప్రసంగించారు. 23 శాతం ఫిట్మెంట్ ఇస్తున్నామని, 62 సంవత్సరాలకు రిటైర్మెంట్ వయసు పెంచిన ఏకైక ప్రభుత్వం తమదేనని అన్నారు. గ్రాట్యుటీని రూ. 4 లక్షల మేర పెంచినట్టు వెల్లడించారు. విభజన మూలంగా ఇబ్బందులు వచ్చిన ఉద్యోగులు, పేద ప్రజల సంక్షేమం చూస్తున్నామన్నారు. రాష్ట్రంలో కరోనా, విభజన సమస్యలు ఉన్నా.. ఉన్నతలో మంచి పీఆర్సీ ఇచ్చామన్నారు. ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య మనస్పర్దలు ఉండకూడదని, అందరూ కలసి రాష్ట్రాభివృద్ధికి కృషిచేయాలని గవర్నర్ పిలుపిచ్చారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్‌తో పాటు పలువురు మంత్రులు, స్థానిక నేతలు హాజరయ్యారు.