మందుబాబులకు షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-10-26T23:00:54+05:30 IST

నిబంధనల పేరుతో మందుబాబులకు చుక్కులు చూపుతున్న ఏపీ ప్రభుత్వం తాజాగా మరోషాకిచ్చింది. ఒక నుంచి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకునే వీలు లేదంటూ ఉత్తర్వులిచ్చింది

మందుబాబులకు షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: నిబంధనల పేరుతో మందుబాబులకు చుక్కులు చూపుతున్న ఏపీ ప్రభుత్వం తాజాగా మరోషాకిచ్చింది. ఇక నుంచి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకునే వీలు లేదంటూ ఉత్తర్వులిచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవటంపై కొత్త జీవో విడుదల చేసింది. అనుమతి లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకునే వీల్లేదంటూ కొత్త జీవోలో పేర్కొంది. గతంలో మాదిరిగా మూడు మద్యం బాటిల్స్ తెచ్చుకునేందుకు అనుమతిలేదని, అనుమతి లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెస్తే శిక్షార్హులని ఎక్సైజ్‌శాఖ హెచ్చరించింది. విదేశాల నుంచి మద్యం తెచ్చుకునేందుకు కేంద్రం నిబంధనల ప్రకారం అనుమతిచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి అనుమతి లేకుండా మద్యం తెస్తే 1968 ఏపీ ఎక్సైజ్ చట్టం ద్వారా శిక్షార్హులని, జీవో నెంబర్ 310ను ఎక్సైజ్ శాఖ విడుదల చేసింది. 


అయితే ఇతర రాష్ట్రాల నుండి మద్యాన్ని తీసుకు వచ్చే వ్యక్తులకు వెసులుబాటు కల్పిస్తూ ఏపీ హైకోర్టు కీలక తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. జీవో నెంబర్ 411 ప్రకారం మద్యాన్ని తీసుకుని వచ్చే వెసులుబాటు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై ఉన్నతన్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం ఎవరైనా ఇతర రాష్ట్రాల నుంచి మూడు మద్యం బాటిళ్లు తెచ్చుకునే అవకాశాన్ని హైకోర్టు కలిగించింది. హైకోర్టు తీర్పుతో మద్యం ప్రియులకు ఏపీలో ఉన్న పరిస్థితుల నుంచి ఉపశమనం కలిగినట్లు అయింది. ఏపీలో మద్యం ధరలను ప్రభుత్వం ఆమాంతం పెంచింది. దీంతో తెలంగాణ నుంచి అనుమతి లేకుండా మద్యాన్ని తెచ్చుకుంటూ పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు. అయితే తాజాగా ప్రభుత్వం తెచ్చిన జీవోతో మందుబాబులకు మరిన్ని చిక్కులు వస్తాయని మందుబాబులు చెబుతున్నారు. 

Updated Date - 2020-10-26T23:00:54+05:30 IST