గుట్టు రట్టవుతుందనే!

Published: Mon, 28 Mar 2022 02:19:19 ISTfb-iconwhatsapp-icontwitter-icon
గుట్టు రట్టవుతుందనే!

48 వేల కోట్ల లెక్కలపై సర్కారు మౌనం అందుకే

కేంద్ర నిధుల మళ్లింపునకు పక్కా ఆధారాలు 

పది వేల బిల్లులు పరిశీలిస్తే లోగుట్టు బట్టబయలు

కేంద్ర పథకాలకు దొంగ యూసీలు చూపి నిధులు

బిల్లులన్నీ పెండింగ్‌లోనే.. ఏపీఎస్‌డీసీ పేరుతో 

23 వేల కోట్ల అప్పు.. కుల కార్పొరేషన్లకు మళ్లింపు

రైతు భరోసా కోసం సస్పెన్స్‌ ఖాతా దుర్వినియోగం

పీడీ అకౌంట్లలోనూ మాయాజాలం.. 

ఇవన్నీ బయటపెడితే అప్పు పుట్టడం కష్టమే

అందుకే 2020-21లో చేసిన గోల్‌మాల్‌పై గప్‌చుప్‌!!


రూ.48 వేల కోట్లు గోల్‌మాల్‌ చేశారని ప్రతిపక్షం విరుచుకుపడుతున్నా జగన్‌ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు..? ఎన్ని విమర్శలు వస్తున్నా ఎందుకు మౌనంగా ఉంటోంది..? తన వద్ద సమాధానం లేదా? ప్రతిపక్షాల విమర్శలు నిజం కాబట్టే జవాబివ్వలేకపోతోందా..? లోతుగా వెళ్లి పరిశీలిస్తే.. తన అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే నోరెత్తడం లేదని స్పష్టమవుతోంది. కేంద్ర నిధుల దారి మళ్లింపు.. దొంగ యూసీలతో కేంద్ర పథకాలకు నిధులు తెచ్చుకుని అసలు చెల్లింపులే చేయకపోవడం.. అడ్డగోలుగా సస్పెన్స్‌ ఖాతాను దుర్వినియోగం చేసి చెల్లింపులు జరపడం.. ఏపీఎ్‌సడీసీ ద్వారా తెచ్చిన అక్రమ రుణాలను అక్రమంగా కార్పొరేషన్లకు తరలించి.. ఇతర అవసరాలకు వాడుకోవడం వంటి అరాచకాలన్నీ తెలిసిపోతాయని.. అప్పుడు బ్యాంకుల నుంచి అప్పులు దొరకడం కష్టమవుతుందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఒకటి కాదు.. రెండు కాదు.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో జగన్‌ ప్రభుత్వం రూ.48 వేల కోట్లు గోల్‌మాల్‌ చేసిందని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఆ మొత్తానికి సంబంధించిన పది వేల బిల్లులపై లోతుగా దృష్టి సారిస్తే అసలు గుట్టు బయటపడుతుందని సర్కారు వివరాలు చెప్పడానికి వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. నాటి ఆర్థిక అరాచకాలకు ఈ బిల్లులు సాక్ష్యాధారాలు కాబట్టే మౌనం వహిస్తున్నట్లు సమాచారం. జగన్‌ సర్కారు వచ్చినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను భారీగా దారి మళ్లిస్తోంది. దీనిపై కేంద్రానికి  అనేక ఫిర్యాదులు కూడా అందాయి. 2020-21లో కేంద్ర పథకాలు అమలు చేశామని చెప్పి దొంగ యూసీలు సమర్పించి కేంద్రం నుంచి వైసీపీ ప్రభుత్వం నిధులు తెచ్చింది. కానీ ఆ పథకాలకు సంబంధించిన బిల్లులన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. వాటిని 2019-20 నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరానికి బదలాయించింది. ఓ పక్క యూసీలు సమర్పించి నిధులు తెచ్చినప్పటికీ ఆ బిల్లులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి? అంటే ఆ డబ్బును ఆ పథకాలకు కాకుండా ఇతర అవసరాలకు మళ్లించిందని చెప్పడానికి ఈ బిల్లులే సాక్ష్యం. 


ఏపీఎ్‌సడీసీ అక్రమాలకూ..

ఇక రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ (ఏపీఎ్‌సడీసీ) పేరిట జగన్‌ ప్రభుత్వం చేసిన దొంగ అప్పుల గురించి.. వాటి వివాదాల గురించి తెలిసిందే. ఆ కార్పొరేషన్‌ పేరిట తెచ్చిన రూ.23,200 కోట్ల అప్పును మరో 59 కుల కార్పొరేషన్లకు మళ్లించింది. ఆ కార్పొరేషన్ల ద్వారా చిన్నా చితకా పథకాలకు చెల్లింపులు చేసింది. ఖర్చు మాత్రం ఏపీఎ్‌సడీసీ ఖాతాలోనే చూపింది. కార్పొరేషన్లలో వ్యయం చేసి, దానిని ఏపీఎ్‌సడీసీ ఖాతాలో చూపడం ఒక ఉల్లంఘన అయితే.. ఏపీఎ్‌సడీసీ కోసం తెచ్చిన అప్పును ఆ 59 కార్పొరేషన్లకు ఎలాంటి లెక్కా పత్రం లేకుండా బదిలీ చేయడం కంపెనీల చట్టానికి విరుద్ధం. పైగా కంపెనీల చట్టం ద్వారా ఏర్పాటు చేసిన ఈ కార్పొరేషన్ల లావాదేవీలన్నీ బ్యాంకు ఖాతాల ద్వారా మాత్రమే జరగాలి. పీడీ ఖాతాల ద్వారా నిర్వహించడం చట్టవిరుద్ధం ఇవన్నీ బయటపడితే అప్పులు పుట్టడం మరింత కష్టమవుతుందన్న ఉద్దేశంతో ఈ అంశంపై స్పందించేందుకు తటాపటాయిస్తోందని సమాచారం.


‘సస్పెన్స్‌’ గుట్టు బయటపడుతుంది

రాష్ట్రప్రభుత్వం ‘సస్పెన్స్‌ ఖాతా’ ద్వారా చెల్లింపులను కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప ఎప్పుడు పడితే అప్పుడు వాడడానికి వీల్లేదు. జగన్‌ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ ఈ ఖాతాను ఎడాపెడా దుర్వినియోగం చేస్తోంది. సస్పెన్స్‌ ఖాతా ద్వారా చేసిన చెల్లింపుల తాలూకు బిల్లులు కూడా పై పది వేల బిల్లుల్లో ఉండడం గమనార్హం. 2020-21లో రైతుభరోసా పథకానికి ప్రభుత్వం ఆర్‌బీఐకి బిల్లు పంపడం ద్వారా కాకుండా ఈ సస్పెన్స్‌ ఖాతాను ఉపయోగించి చెల్లింపులు చేసింది. ఆర్‌బీఐ ఈ-కుబేర్‌ సాఫ్ట్‌వేర్‌లో ఏవో మార్పుల కారణంగా రైతుభరోసా చెల్లింపులకు బ్రేక్‌ పడిందని, అందుకే అప్పటికప్పుడు సస్పెన్స్‌ ఖాతా ద్వారా  రూ.2,727 కోట్లు చెల్లించినట్లు సమాచారం. సస్పెన్స్‌ ఖాతా ద్వారా బిల్లులు చెల్లించాలనుకుంటే ముందుగా ఆ మొత్తం డబ్బును సదరు ఖాతాకు బదిలీ చేశాకే చేయాలి. కానీ ముందుగా సస్పెన్స్‌ ఖాతా ద్వారా చెల్లించేసి ఆ తర్వాత సర్దుబాటు బిల్లులు వేస్తోంది. ఇది నిబంధనలకు విరుద్ధం.


కంప్యూటర్‌ స్ర్కీన్‌పైనే అంకెలు మారేది!

అలాగే పీడీ ఖాతాలను ఉపయోగించుకుని చేస్తున్న ఆర్థిక మాయలకు సంబంధించిన బిల్లులు కూడా ఇందులో ఉన్నాయి. ముందుగా బడ్జెట్‌ హెడ్‌ నుంచి ఫలానా ప్రాజెక్టుకో, బిల్లుకోసమో, ఇతర అవసరాలకో సంబంధిత శాఖ పీడీ ఖాతాకు ప్రభుత్వం నిధులు బదిలీ చేస్తుంది. ఇక్కడ నిధుల బదిలీ అంటే కేవలం కంప్యూటర్‌ స్ర్కీన్‌పై అంకెలు మారుతాయంతే. నిజంగా సంబంధిత శాఖ పీడీ ఖాతాలో నగదు జమ కాదు. కంప్యూటర్‌లో అంకెలు మారిన వెంటనే ఆ సంబంధిత శాఖ కింద ఖర్చయినట్లు ప్రభుత్వానికి బిల్లు వచ్చి పరిశీలన కోసం ట్రెజరీకి వెళ్తుంది. నిజంగా ఖజానా నుంచి పైసా కూడా సంబంధిత శాఖ ఖాతాకు వెళ్లదు. ఖర్చు అసలే కాదు. ఆ డబ్బు ఖజానాలోనే ఉంటుంది. ప్రభుత్వం ఇంకో అవసరానికి వాడుతుంది.ఈ తరహా ఉల్లంఘన మూడేళ్లుగా తరచూ జరుగుతోంది. 

గుట్టు రట్టవుతుందనే!


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.