గుడివాడకు పట్టిన చీడ

ABN , First Publish Date - 2022-01-19T07:33:40+05:30 IST

గుడివాడకు పట్టిన చీడ

గుడివాడకు పట్టిన చీడ

నాడు.. ఎందరో మహామహులకు పుట్టినిల్లు

నేడు.. జూదాలు, బూతులకు చిరునామా

నాడు.. చైతన్య సాహితీ వికాసాల ఘనకీర్తి

నేడు... పేకాట డెన్‌లు, కేసినోలతో అపకీర్తి


మూడుసార్లు ఇక్కడికి వచ్చిన మహాత్ముడు

ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, ఘంటసాల ఇక్కడి వారే

కొండపల్లి సీతారామయ్యదీ గుడివాడే

దక్షిణాదిన తొలి హోమియో కాలేజీ ఇక్కడే

వ్యవసాయ పరికరాల తయారీకి పెట్టింది పేరు


(విజయవాడ - ఆంధ్రజ్యోతి)

ఒకప్పుడు... అది గుడుల వాడ! అనేకమంది మహామహుల జాడ! ఇప్పుడు ఆ ఊరి పేరు చెబితే... బూతుల నేతలు, జూద క్రీడలు గుర్తుకొస్తాయి. అదే కృష్ణా జిల్లాలోని గుడివాడ! రాజకీయ, సాహిత్య, సినీ రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులు గుడివాడ నియోజకవర్గం నుంచే వచ్చారు. ప్రపంచ స్థాయిలో గుడివాడకు పేరు తెచ్చారు. ఇప్పుడేమో... గుడివాడ అంటే జనం ‘ఓహో... ఆ బూతుల నేత ఊరేనా? పేకాట డెన్‌లు నడిచింది అక్కడే కదా! సంక్రాంతి  పేరుతో గోవా తరహా కేసినోలు నడిచిందీ అక్కడేగా’ అని అంటున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గుడివాడ ఇలా ‘రాకూడని కారణాల’తో వార్తల్లోకి వస్తుండటంతో స్థానికులూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఎందరో మహానుభావులు

గుడివాడ పట్టణం ఒకప్పుడు ‘విదర్భపురి’గా విలసిల్లింది. అనేక దేవాలయాలతో గుడులవాడగా ప్రసిద్ధికెక్కి.. ఆ తర్వాత గుడివాడగా మారింది. ఒకప్పుడు కృష్ణా జిల్లా రాజకీయమంతా గుడివాడ చుట్టూనే తిరిగేదంటారు. వర్తక, వాణిజ్యాలతోపాటు విద్య, వైద్య, రాజకీయ రంగాల ప్రముఖులకు పెట్టింది పేరు గుడివాడ. స్వాత్రంత్య ఉద్యమ సమయంలోనూ గుడివాడ సమర శంఖం పూరించింది. మహాత్మా గాంధీ స్ఫూర్తితో గుడివాడకు చెందిన గూడూరి రామచంద్రుడు ఇక్కడ హరిజనాశ్రమం నిర్మించారు. ఈయన గురించి 1921లో ‘యంగ్‌ ఇండియా’ పత్రికలో గాంధీజీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. గుడివాడవాసుల చైతన్యానికి ముచ్చటపడిన మహాత్ముడు.. 1921, 1929, 1933 సంవత్సరాల్లో మొత్తం మూడుసార్లు గుడివాడ వచ్చారు.


అన్నగారి పుట్టిల్లు...

వెండితెర వేల్పు, తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ జన్మించింది గుడివాడ నియోజకవర్గంలోని నిమ్మకూరులోనే. (ఇప్పుడు ఈ ఊరు పామర్రు పరిధిలోకి వెళ్లింది) సొంత ఊరిపై మమకారంతో 1983లో ఆయన తన రాజకీయ అరంగేట్రానికి గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గాన్నే ఎంచుకున్నారు. గుడివాడ వాసులూ అంతే మమకారంతో ఆయన్ను గెలిపించారు. 1985లోనూ ఎన్టీఆర్‌ గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన హయాంలో గుడివాడ రూపురేఖలు మార్చుకుంది.  రహదారులు పడ్డాయి. క్రీడాప్రియుల కోసం స్టేడియం ఏర్పాటైంది. ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు సమకూరాయి. ఇక... తెలుగు సినిమాపై చెరగని ముద్ర వేసిన ప్రముఖ నటుడు, పద్మశ్రీ అక్కినేని నాగేశ్వరరావుదీ గుడివాడ ప్రాంతమే. ఆయన నందివాడ మండలం వెంకట రాఘవాపురంలో జన్మించారు. గుడివాడలోని ఒక కాలేజీకి ఆయన నిధులు సమకూర్చారు. ‘ఏఎన్నార్‌’ పేరుతో ఈ డిగ్రీ కళాశాల నడుస్తోంది. మధుర గాయకుడు, గానగంధర్వ ఘంటసాల వెంకటేశ్వరరావు  గుడివాడ నియోజకవర్గంలోని చౌటపల్లి గ్రామంలో జన్మించారు. మరో సినీ ప్రముఖుడు కైకాల సత్యనారాయణ కూడా ఇక్కడి నుంచే వెండితెరకెక్కారు. వీరే కాదు... తొలితరం మావోయిస్టు ఉద్యమ నేత కొండపల్లి సీతారామయ్య, కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి కూడా గుడివాడ నియోజకవర్గానికి చెందినవారే. సినీ ఫొటోగ్రఫీ దిగ్గజం  వీఎస్సార్‌ స్వామి, సినీపాటలకు సాహిత్య శోభను అద్దిన జాలాది, దేశానికి వెలుగులు పంచిన విద్యుత్‌ రంగ నిపుణుడు నార్ల తాతారావు, ప్రముఖ పాత్రికేయుడు - కవి నార్ల వెంకటేశ్వరరావు కూడా గుడివాడ నియోజకవర్గంలో జన్మించిన వారే. ఉయ్యూరు కేసీపీ షుగర్స్‌ సంస్థ వ్యవస్థాపకుల్లో గుడివాడకు చెందిన అడుసుమిల్లి గోపాలకృష్ణయ్య ముఖ్యులు. బౌద్ధ వాజ్ఞ్మయ బ్రహ్మగా పేరొందిన దుగ్గిరాల బలరామకృష్ణయ్య,  ప్రముఖ దర్శకులు గూడవల్లి రామబ్రహ్మం, కొల్లి ప్రత్యగాత్మ (కె.ప్రత్యగాత్మ), దుక్కిపాటి మధుసూదన్‌రావు, ప్రముఖ చిత్రకారుడు ఎస్‌వీ రామారావు, ప్రముఖ సాహితీవేత్త త్రిపురనేని హనుమాన్‌ చౌదరి గుడివాడ వాస్తవ్యులే. ప్రస్తుతానికి వస్తే... రిలయన్స్‌ గ్యాస్‌లో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న పండా మధుసూదన్‌ ప్రసాద్‌(పీఎంపీ), దేశంలోనే ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ‘మెఘా’ కృష్ణారెడ్డి ఇక్కడి వారే.


నాడు ఘనకీర్తి... నేడు దుర్నీతి

గుడివాడ కీర్తి నేటి తరంలో చాలామందికి తెలియదు. ఇప్పుడున్న వారికి గుడివాడ పేరు చెబితే గుర్తుకొచ్చేది... వచ్చేది జూద గృహాలు, బూతులే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడా లేని విధంగా కేసినో సంస్కృతిని తొలిసారి దిగుమతి చేసుకున్న పట్టణంగా గుడివాడ చరిత్రలో నిలిచిపోతుంది. ఎందరో మధ్యతరగతి జీవుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తూ, సంపన్నులను బికారులుగా మార్చే జూద గృహాలకు గుడివాడ నిలయంగా మారింది. పచ్చని పొలాలు, చెరువు గట్లతోపాటు పెళ్లీ పేరంటాలు జరిగే ఫంక్షన్‌ హాళ్లనూ జూద వేదికలుగా మార్చేశారు. రాజకీయ ప్రముఖుల అండతో విచ్చలవిడిగా పేకాట, గుండాటలు నిర్వహిస్తున్నారు. ఈ సంక్రాంతికి గోవా తరహా కేసినోలను దించేశారు.


ఘనమైన చరిత్ర...

భారతదేశంలో రెండోది, దక్షిణాదిన మొదటిదైన హోమియో కాలేజీ గుడివాడలోనే ఏర్పాటు చేశారు. 1945లో గురురాజా హోమియో కళాశాల గుడివాడలో ఏర్పడింది. అప్పటి రాష్ట్రపతి వీవీ గిరి వ్యక్తిగత వైద్యుడుగా పేరొందిన డాక్టర్‌ గురురాజు ముదునూరి ఈ కళాశాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే హోమియో రీసెర్చ్‌ సెంటర్‌ ఇక్కడుంది. వ్యవసాయ పరికరాల తయారీకి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే గుడివాడ పెట్టింది పేరు.

Updated Date - 2022-01-19T07:33:40+05:30 IST