ఏపీ ఐపీఎస్‌.. ఏబీవీపై సస్పెన్షన్‌ రద్దు

ABN , First Publish Date - 2022-04-23T08:23:09+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

ఏపీ ఐపీఎస్‌.. ఏబీవీపై సస్పెన్షన్‌ రద్దు

సుప్రీంలో సీనియర్‌ ఐపీఎస్‌ వెంకటేశ్వరరావుకు ఊరట


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. శుక్రవారం న్యాయమూర్తులు జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్‌, జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఒకాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తుది ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయపరంగా ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్‌ ఉత్తర్వులు ముగిశాయని పేర్కొంది. గతంలో సుప్రీం కోర్టు స్టే విధించిన కారణంగా సస్పెన్షన్‌ ఉత్తర్వులు కొనసాగాయని, ఈ స్టే కూడా ఫిబ్రవరి 7 వరకే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌ను తోసిపుచ్చిన నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీ నుంచి ఏబీ వెంకటేశ్వరరావు సర్వీసులో ఉన్నట్లు భావించాల్సి ఉంటుందని పేర్కొంది. అదే తేదీ నుంచి జీతభత్యాల చెల్లింపును వర్తింపజేయాలని ఆదేశించింది. ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది సీయూ సింగ్‌ వాదనలు వినిపిస్తూ.. క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ ప్రారంభిస్తే రెండేళ్లకు మించి సస్పెన్షన్‌ను పొడిగించవచ్చని గతంలో బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. అయితే, జోక్యం చేసుకున్న ధర్మాసనం.. ‘అది కూడా రెండేళ్ల లోపే చేయాలి. గడువు ముగిసిన తర్వాత పొడిగించడం సాధ్యం కాదు’ అని వ్యాఖ్యానించింది. సస్పెన్షన్‌ను పొడిగించడంపై రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనల విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశాన్ని అలాగే ఉంచాలని సీయూ సింగ్‌ విజ్ఞప్తి చేశారు. అందుకు ధర్మాసనం అంగీకరించింది. ఏబీ వెంకటేశ్వరరావు తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణ రావు, న్యాయవాది వై.శివసంతోష్‌ కుమార్‌ హాజరయ్యారు.  


ఏ బావ కళ్లలో ఆనందం కోసం ఇదంతా చేశారు?: ఏబీవీ 

తాను లోకల్‌ అని, బాధ్యులైన వారిని ఎవరినీ వదలిపెట్టబోనని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. అందరిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరతానని చెప్పారు. సుప్రీం ఉత్తర్వుల ప్రకారం నేను విధుల్లో చేరుతానన్నారు. సుప్రీం తీర్పు అనంతరం కోర్టు ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసు ఓడిపోవడానికి కారణం ఎవరు? ఏ బావ కళ్లలో ఆనందం కోసం ఇదంతా చేశారు? ఏ సైకో కళ్లలో ఆనందం కోసం ఇదంతా చేశారు? ఏ శాడిస్టు కళ్లలో ఆనందం కోసం ఇదంతా చేశారు? ప్రజల సొమ్మును రూ.కోట్లు ఖర్చు చేశారు’’ అని అన్నారు. ‘‘నాకు కూడా కోర్టు ఖర్చులయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం పెట్టినదానికి సమానంగా నాకు కోర్టు ఖర్చులు చెల్లించాలని కోరబోతున్నాను. ఒక డీజీపీ ఇచ్చిన ఫోర్జరీ మెమో, సీఐడీ ఏడీజీ రాయించిన తప్పుడు నివేదిక ఆధారంగా, అప్పట్లో ఉన్న ‘ప్రవీణులు’, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు గుడ్డిగా సంతకాలు పెట్టి 24 గంటల్లోనే సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆరు నెలలకోసారి సస్పెన్షన్‌ పొడిగించారు. తప్పుడు నివేదికలు రాశారు. ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించిన అధికారుల ప్రవర్తనను సాక్ష్యాలు సహా ప్రభుత్వానికి నివేదించాను.  నిఘా పరికరాల కొనుగోళ్లే జరగనప్పుడు అవినీతి ఎలా జరుగుతుందని ఒక్కరూ ప్రశ్నించరా?’’ అని ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-04-23T08:23:09+05:30 IST