కలెక్టర్లు మనసు పెట్టడం లేదు

ABN , First Publish Date - 2021-03-01T09:15:08+05:30 IST

రెవెన్యూ శాఖకు ప్రభుత్వం కేటాయించిన నిధులను మంజూరు చేయడంపై కొన్ని జిల్లాల కలెక్టర్లు మనసు పెట్టడం లేదని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు

కలెక్టర్లు మనసు పెట్టడం లేదు

రెవెన్యూ శాఖకు నిధులివ్వరేం?

తహశీల్దార్ల ఇబ్బందులు పట్టవా:  బొప్పరాజు 


కర్నూలు(కలెక్టరేట్‌), ఫిబ్రవరి 28: రెవెన్యూ శాఖకు ప్రభుత్వం కేటాయించిన నిధులను మంజూరు చేయడంపై కొన్ని జిల్లాల కలెక్టర్లు మనసు పెట్టడం లేదని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో ఆదివారం ఏపీ జేఏసీ అమరావతి కార్యకర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెవెన్యూ ఉద్యోగులు మానసిక ఒత్తిళ్లను భరిస్తారని, కానీ ఆర్థిక ఒత్తిళ్లను భరించలేకపోతున్నారని అన్నారు. ఏ పనైనా రెవెన్యూ శాఖతో నిమిషాల్లో చేయిస్తారని, కానీ ఆ శాఖ అధికారులు చేసిన ఖర్చులకు బిల్లులు చెల్లించేందుకు మాత్రం కొందరు కలెక్టర్లకు మనసు రావడం లేదని ఆరోపించారు. తహశీల్దార్లు ఏదైనా తప్పు చేస్తే ఆరు నెలల్లోగా విచారణ జరిపి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని.. కానీ విచారణ అధికారులు సంవత్సరాల పాటు పెండింగ్‌లో పెడుతున్నారని, రెవెన్యూ ఉద్యోగులు రిటైరైన తర్వాత పెన్షన్‌కు దూరమై ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.


వీడియో కాన్ఫరెన్సులకు, టెలికాన్ఫరెన్సులకు గైర్హాజరైతే తహశీల్దార్లపై వెంటనే సస్పెన్షన్‌ వేటు వెంటనే పడుతోందని.. వారిపై ఉన్న క్రమశిక్షణ చర్యల పైళ్లను ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెడుతున్న విచారణ అధికారులపై కలెక్టర్లు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తహశీల్దార్లకు వాహనాల అద్దెగా నెలకు రూ.35 వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంటే... కొన్ని జిల్లాలో రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు.. ఇలా ఎలా పడితే కలెక్టర్లు విడుదల చేస్తున్నారని అన్నారు. మిగిలిన డబ్బులు ఎక్కడికి బదిలీ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న 25 లక్షల ఇంటి స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని తహశీల్దార్లు విజయవంతం చేశారని, ఈ కార్యక్రమాల నిర్వహణకు వారు సొంతంగా  లక్షల్లో ఖర్చు చేశారని తెలిపారు. ఈ నిధులు ప్రభుత్వం నుంచి వచ్చినా రాకపోయినా కలెక్టర్లు ఇంట్రెస్ట్‌ ఫండ్‌ నుంచి తీసి ఇచ్చే అవకాశముందని, అయినా చాలా చోట్ల పెండింగ్‌లో పెట్టారని చెప్పారు.  పౌర సరఫరాల శాఖలో నూతనంగా ప్రవేశపెట్టిన ఎండీయూల ద్వారా రేషన్‌ పంపిణీకి వేలాది రూపాయలు ఖర్చవుతున్నాయని, కానీ కలెక్టర్లు బాధ్యతగా తీసుకుని బడ్జెట్‌ విడుదల చేయడం లేదని ఆరోపించారు.

Updated Date - 2021-03-01T09:15:08+05:30 IST