Ap Minister Bumper Offer: ఇష్టమొచ్చినంత తవ్వేసుకోవచ్చు!

ABN , First Publish Date - 2022-09-07T03:38:55+05:30 IST

ఏపీలో జేపీ వెంచర్స్‌కు ఇసుక తవ్వకాలు, అమ్మకాలను ప్రభుత్వం అప్పగించింది. గతంలో రాజకీయ నేతల కనుసన్నల్లో నడిచే ఇసుక రీచ్‌లను ..

Ap Minister Bumper Offer: ఇష్టమొచ్చినంత తవ్వేసుకోవచ్చు!

అమరావతి (Amaravati): ఏపీలో జేపీ వెంచర్స్‌కు ఇసుక తవ్వకాలు, అమ్మకాలను ప్రభుత్వం అప్పగించింది. గతంలో రాజకీయ నేతల కనుసన్నల్లో నడిచే ఇసుక రీచ్‌లను గంపగుత్తగా జగన్‌రెడ్డి జేపీ సంస్థకు అప్పగించడంతో ప్రజాప్రతినిధులకు ఆదాయం తగ్గిపోయింది. దీంతో.. క్షేత్రస్దాయిలో పార్టీని నడిపించడానికి నిధులు ఎలా అంటూ ఎమ్మెల్యేలు మదనపడుతున్నారట. జేపీ సంస్థను కాదని కొంతమంది ప్రజాప్రతినిధులు సొంతంగా ఇసుక అక్రమ రవాణాకు తెరలేపారట. జేపీ సంస్థ, అధికారుల ఆంక్షలతో సంబంధం లేకుండా ఇసుక తవ్వేస్తున్నారట.



బాపట్ల జిల్లా కొల్లూరు, భట్టిప్రోలు మండలాల పరిధిలోని కృష్ణానదిలో కొంతకాలంగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. దీని వెనుక ఓ మంత్రి హస్తం ఉండడంతో అధికారులు కూడా ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారట. కొల్లూరు మండలంలోని అరవింద వారధి సమీపంలో కృష్ణానది మధ్యన చిలుమూరులంక, చింతర్లంక గ్రామాలు ఉన్నాయి. ఈ రెండు గ్రామాల పరిధిలోని బాపట్ల, కృష్ణా జిల్లాల సరిహద్దుల్లో నెలరోజులుగా పట్టపగలే ఇసుకను అడ్డగోలుగా తవ్వుతున్నారు. 


మరోవైపు గుంటూరుకు చెందిన ఓ మంత్రి.. వైసీపీ నేతలకు ఓ బంపర్‌ ఆఫర్‌ కూడా ఇచ్చారట. గడప గడపకూ కార్యక్రమం ఇతర నియోజకవర్గాల్లో ఎలా జరుగుతున్నా.. మంత్రి అడ్డాలో మాత్రం విభిన్నంగా నిర్వహిస్తున్నారట. కార్యక్రమ నిర్వహణకు రోజుకు లక్ష నుంచి 2 లక్షల వరకు ఖర్చు చేస్తుండడంతో ఈ మొత్తాన్ని భరించినవారు పది రోజుల పాటు కృష్ణా నదిలో ఇసుకను ఇష్టమొచ్చినంత తవ్వేసుకోవచ్చని ఆఫర్‌ ఇచ్చారట. ఇంకేముంది ఇదే అదనుగా అనుచరులు, స్థానికులు చెలరేగిపోతున్నారట. గడప గడపకూ ఖర్చులకు లక్ష, 2 లక్షలు చదివించడం అంతకు పదిరెట్ల విలువైన ఇసుకను దోచేయడం పరిపాటిగా మార్చేశారట. ముఖ్యంగా కొల్లూరు, వేమూరు మండలాల్లోని అధికార పార్టీ నేతలు మంత్రి ఆఫర్‌ను ఫుల్‌గా వాడేసుకుంటున్నారట.  ఎంత ఇసుక తవ్వినా అడ్డు చెప్పొద్దని, ట్రాక్టర్లకు బిల్లులు అడగొద్దని సదరు మంత్రి.. పోలీసులు, ఇతర శాఖల అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు వైసీపీలో చర్చ నడుస్తోంది.


మొత్తంగా.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇసుక తవ్వకాల వ్యవహారం వైసీపీలో ప్రకంపనలు రేపుతోంది. ఎన్నో వ్యయ ప్రయాసలు పడి మరీ.. ఇసుక రీచ్‌లను.. సొంత జేబు సంస్థకు కట్టబెట్టిన తాడేపల్లి పెద్దలు.. ఇతరులు దోచుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటారా?.. లేక చర్యలు తీసుకుంటారా అన్నది ఆసక్తి మారుతోంది. 




Updated Date - 2022-09-07T03:38:55+05:30 IST