AP New Districts : చిత్తూరు వద్దు.. మదనపల్లే ముద్దు.. కుప్పంలోనూ అదే జోరు..!

ABN , First Publish Date - 2022-02-08T12:30:49+05:30 IST

చిత్తూరు వద్దు.. మదనపల్లే ముద్దు.. కుప్పంలోనూ అదే జోరు..!

AP New Districts : చిత్తూరు వద్దు.. మదనపల్లే ముద్దు.. కుప్పంలోనూ అదే జోరు..!

  • పుంగనూరులోనూ రాజుకుంది
  • కొత్త జిల్లాల ప్రకటనపై కొనసాగుతున్న నిరసనలు

తిరుపతి : కొత్త జిల్లాల ఏర్పాటుపై జిల్లాలో పలుచోట్ల నిరసనలు కొనసాగుతునే వున్నాయి. కొత్తగా పుంగనూరులోనూ మదనపల్లె జిల్లా ఉద్యమం రాజుకుంది. సోమవారం వైసీపీ తప్ప మిగిలిన రాజకీయ పక్షాలు, విద్యార్థులు అఖిలపక్షంగా ఏర్పడి భారీ కార్యక్రమం చేపట్టాయి. పుంగనూరులో అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన ఆందోళనకారులు అనంతరం ర్యాలీగా తహసిల్దారు కార్యాలయం చేరుకున్నారు. డిప్యూటీ తహసిల్దారు రమే‌ష్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యనేతలు మాట్లాడుతూ.. పుంగనూరు నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లాలో కలపొద్దని డిమాండ్‌ చేశారు. దానికి బదులు మదనపల్లె జిల్లా ఏర్పాటు చేసి అందులో కలపాలని డిమాండ్‌ చేశారు. ‘చిత్తూరు వద్దు.. మదనపల్లే ముద్దు’ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ నేతలు మాధవరెడ్డి, సీవీరెడ్డి, బీజేపీ నేత అయూబ్‌ ఖాన్‌, జనసేన శివ, సీపీఐ నేత వెంకట్రమణారెడ్డి, కాంగ్రెస్‌ నేత సజ్జాద్‌, ఎస్‌డీపీఐ నేత చాంద్‌ బాషా తదితరులు పాల్గొన్నారు.


మదనపల్లెలో ధర్నా.. నిమ్మనపల్లెలో ర్యాలీ..

మదనపల్లె జిల్లా సాధన జేఏసీ, అఖిలపక్షాలు సంయుక్తంగా సోమవారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టాయి. మదనపల్లె, తంబళ్ళపల్లె, పీలేరు, పుంగనూరు నియోజకవర్గాలను ఇతర జిల్లాల్లో కలపకుండా మదనపల్లె జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆ మేరకు ఆర్డీవో మురళికి వినతి పత్రం అందజేశారు. జేఏసీ కన్వీనర్‌ నరేంద్ర బాబు, మాజీ ఎమ్మెల్యేలు దొమ్మలపాటి రమేష్‌, షాజహాన్‌ బాషా, బీఎస్పీ నేత గౌతమ్‌, మాలమహానాడు నేత యమలా సుదర్శనం, సీపీఐ నేత  కృష్ణప్ప తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఈ బృందం నిమ్మనపల్లె చేరుకుని అక్కడ స్థానికులతో కలసి ర్యాలీ నిర్వహించింది.


పరిమితులతో పొలికేక సభకు అనుమతి

మదనపల్లెలో జిల్లా సాధన సమితి మంగళవారం పొలికేక పేరిట బహిరంగసభ నిర్వహించేందుకు పదిరోజులుగా ఏర్పాట్లు చేసుకుంటూన్న సంగతి తెలిసిందే. పది రోజుల కిందటే సభకు, ప్రచార రథానికి మైక్‌ ఏర్పాటుకు పోలీసుల అనుమతి కోరుతూ సమితి కన్వీనర్‌ పీటీఎం శివప్రసాద్‌ పోలీసులకు దరఖాస్తు చేశారు. ఆదివారం రాత్రి 10.30 గంటలకు సభకు అనుమతి నిరాకరిస్తున్నట్టు పోలీసులు నోటీసు జారీ చేశారు. సోమవారం ఉదయం ప్రచార రధాన్ని సీజ్‌ చేసి వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. సాధన సమితి నేతలు డీఎస్పీ రవిమనోహరాచారిని కలిసి గట్టిగా పట్టుబట్టడంతో చివరికి సాయంత్రానికి ప్రచార రథాన్ని విడుదల చేశారు. కేవలం 200 మందికి మించకుండా జనంతో సభ నిర్వహించుకునేందుకు అనుమతి ఇస్తామన్నారు.తాము నిర్దేశించిన రూట్‌ మ్యాప్‌ ప్రకారమే ర్యాలీ జరపాలని షరతు విధించారు. ఆ మేరకు మంగళవారం ఉదయం 11 గంటలకు బీటీ కళాశాల నుంచీ ర్యాలీ ప్రారంభించి మల్లిఖార్జున సర్కిల్‌, బెంగుళూరు బస్టాండు, టౌన్‌ బ్యాంకు సర్కిల్‌, చిత్తూరు బస్టాండు, సీటీఎం రోడ్డు మీదుగా ఆర్టీసీ బస్టాండు వద్ద అంబేడ్కర్‌ సర్కిల్‌ చేరుకుని అక్కడే సభ జరపనున్నారు.  


వెదురుకుప్పం, కుప్పంలలో అదే జోరు..

వెదురుకుప్పం మండలాన్ని చిత్తూరు జిల్లాలో కాకుండా తిరుపతి బాలాజీ జిల్లాలో చేర్చాలన్న డిమాండ్‌తో ఆందోళనలు కొనసాగుతునే వున్నాయి. సోమవారం ఆందోళనకారులు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిని కలసి వినతి పత్రం అందజేశారు. చిత్తూరు కంటే చాలా చేరువలో వున్న తిరుపతి జిల్లాలో తమను కలపడం వల్ల మండల ప్రజలకు అన్ని విధాలా అనుకూలంగానూ, సౌకర్యవంతంగానూ వుంటుందని వివరించారు. మండల ప్రజల డిమాండ్‌కు మద్దతిచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. కాగా కుప్పం కేంద్రంగా రెవిన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని కొద్ది రోజులుగా కుప్పంలో అఖిలపక్షం ఆందోళన సాగిస్తున్న సంగతి తెలిసిందే.ఆ క్రమంలో సోమవారం ఆందోళనకారులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.

Updated Date - 2022-02-08T12:30:49+05:30 IST