నేటి నుంచే ‘కొత్త’ పాలన..!

Published: Mon, 04 Apr 2022 02:45:34 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నేటి నుంచే కొత్త పాలన..!

రాష్ట్రంలో ఉనికిలోకి 26 జిల్లాలు.. 73 రెవెన్యూ డివిజన్లు

ముహూర్తం ఉదయం 9:05-9:45 మధ్య

కలెక్టర్లు, ఎస్పీలతో నేడు ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌

అనంతరం కొత్త జిల్లాల్లో పాలనకు లాంఛనంగా శ్రీకారం

ఇప్పటికే కలెక్టర్లు, ఎస్పీలు, డీఆర్వోలు, ఆర్డీవోల నియామకం 

ఆదివారమే విధుల్లో చేరిక.. రెండు జిల్లాల్లో అద్దె భవనాలు


అమరావతి, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఏర్పడిన 26 జిల్లాల్లో సోమవారం పరిపాలన ప్రారంభం కానుంది. మొత్తం 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ శనివారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత తుది నోటిఫికేషన్లు విడుదల చేసింది. కొత్తగా ఏర్పాటు చేసిన 23 రెవెన్యూ డివిజన్లతో కలిపి మొత్తం 73 రెవెన్యూ డివిజన్లు సోమవారం నుంచే పనిచేయడం ప్రారంభించనున్నాయి. ఆగమశాస్త్ర పండితులు ఇచ్చిన సూచనల మేరకు కొత్తగా ప్రతిపాదించిన 13 జిల్లాలు, 23 రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉదయం 9:05 గంటల నుంచి 9:45 గంటల మధ్య కలెక్టరేట్‌, జిల్లా పోలీసు కార్యాలయం (డీపీఓ), రెవెన్యూ డివిజనల్‌ అధికారి (ఆర్డీవో) కార్యాలయాలు ప్రారంభం కానున్నాయి. ఆ ముహూర్తం ప్రకారమే కొత్త జిల్లాలు, డివిజన్లలో పరిపాలనకు శ్రీకారం చుట్టేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆయా కార్యాలయాలను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఆ వెంటనే కలెక్టర్‌, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, పోలీసు సూపరింటెండెంట్‌, జిల్లా రెవెన్యూ అధికారి, ఆర్డీవోలు బాధ్యతలు స్వీకరించనున్నారు. వారితో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడతారు. కొత్త జిల్లాలు, పరిపాలన, ప్రభుత్వ లక్ష్యాలపై దిశానిర్దేశం చేస్తారు. ఆయా జిల్లాల మంత్రులు, ప్రజాప్రతినిధులు వారి సొంత ప్రాంతాల్లో పాల్గొనాలని ఇప్పటికే మౌఖిక ఆదేశాలు వెలువడ్డాయి. కాగా.. ఇప్పటికే ఉన్న జిల్లాల్లో కలెక్టరేట్‌, జిల్లా పోలీసు కార్యాలయాలున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసే 13 జిల్లాల్లో రెండు చోట్ల అద్దె భవనాల్లో ఈ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. మిగిలిన వాటిల్లో ప్రభుత్వ సొంత భవనాల్లోనే కొలువుతీరబోతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు నేపఽథ్యంలో శనివారం అర్ధరాత్రే సర్కారు కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, ఎస్పీలను నియమించింది. ఆదివారం ఆయా జిల్లాలకు డీఆర్వోలు, ఆర్డీవోలను నియమించింది. ఇక మిగిలిందల్లా కొత్త జిల్లాలకు 13,823 మంది ఉద్యోగులను కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వడ మే. ఇప్పటికే జిల్లాల వారీగా కలెక్టర్లకు ఉద్యోగుల జాబితాలు వెళ్లాయి. వారు లాంఛనంగా ఉత్తర్వులు జారీచేయడమే తరువాయి. ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు తమ జిల్లా కేంద్రాలకు చేరుకున్నారు.


6-12-8: 26 జిల్లాల్లో ఉత్తరాంధ్రలో ఇప్పుడు ఆరు.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలు ఉన్నాయి. కోస్తాలో 12 జిల్లాలు.. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలు.. రాయలసీమలో 8 జిల్లాలు.. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎ్‌సఆర్‌, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలు ఉన్నాయి. సముద్రతీర ప్రాంతాలున్న జిల్లాలను కోస్తా జిల్లాలుగా వ్యవ హరించే సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఇప్పటివరకు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న 9 జిల్లాలను కోస్తా జిల్లాలుగా పిలిచేవారు. ఇవన్నీ సముద్రాన్ని ఆనుకుని ఉండేవి. 


ఇప్పుడా 9 జిల్లాలను 18 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించారు. అయితే వీటన్నిటినీ ఇక కోస్తా జిల్లాలని పిలిచేందుకు వీల్లేదు. ఎందుకంటే.. వీటిలో ఏడు జిల్లాలకు.. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పుగోదావరి, ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఇప్పుడు సముద్రం లేదు. మరోవైపు కొత్తగా రాయలసీమకు సముద్రం రావడం గమనార్హం. పాత నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట ప్రాంతాన్ని తిరుపతి జిల్లాలో కలపడంతో ఆ జిల్లాకూ సముద్రం ఉన్నట్లయింది.


ప్రకాశం.. 14,322 చ.కి.మీ. విస్తీర్ణం 

కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రకాశం జిల్లా అత్యంత పెద్ద జిల్లాగా అవతరించింది. ఇది 14,322 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రాష్ట్రంలో పెద్ద జిల్లాగా అవతరించగా.. విశాఖపట్నం అత్యంత చిన్నజిల్లాగా మారింది. పాత విశాఖపట్నం జిల్లా మూడు ముక్కలైంది. పాత విశాఖ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలను అనకాపల్లి జిల్లాగా, ఏజెన్సీ ప్రాంతాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పాటు చేశారు. కేవలం నగర ప్రాంతంతో విశాఖపట్నం జిల్లా మిగిలింది. దీని విస్తీర్ణం 928 చదరపు కిలోమీటర్లుగా ఉంది. భౌగోళికంగా చిన్నదైన ఈ జిల్లాలో అసలు గ్రామీణ ప్రాంతమే లేకపోవడం మరో విశేషం. ఈ జిల్లా జనాభా మొత్తం 18.13 లక్షలు. మరోవైపు.. అత్యధిక జనాభా ఉన్న జిల్లా కర్నూలు. ఈ జిల్లాలో 23.66 లక్షల మంది ఉన్నారు. అదేవిధంగా అత్యంత తక్కువ జనాభా (9.54 లక్షలు) ఉన్నది అల్లూరి సీతారామరాజు జిల్లా.

జిల్లాలు.. విశేషాలు

7 కోస్తా జిల్లాలకు సముద్రమే లేదు!కొత్తగా సీమకు కడలి కెరటాలుపెద్ద జిల్లా ప్రకాశం.. చిన్నది విశాఖ అత్యధిక జనాభా కర్నూలులో ‘అల్లూరి’లో అత్యల్ప జనాభా వ్యక్తుల పేర్లతో మొత్తం 7 జిల్లాలు చారిత్రక కడప పేరు మాయం ఇక అది వైఎస్‌ఆర్‌ జిల్లా


అదనపు జేసీలకు మంగళం

కొత్త జిల్లాల నేపథ్యంలో ప్రభుత్వం జిల్లా అదనపు జేసీల వ్యవస్థకు స్వస్తి పలికింది. ఇక ప్రతి జిల్లాకూ కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ (జేసీ) ఎస్పీ, జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) ఉంటారు. ఇప్పటివరకు జిల్లాకో కలెక్టర్‌, ముగ్గురు జేసీలు, డీఆర్వో, ఇద్దరు ముగ్గురు కేడర్‌ అధికారులు. ఒకరు నాన్‌కేడర్‌ (స్పెషల్‌గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌) అధికారులున్నారు. 

మూడు ఏడయ్యాయి..

రాష్ట్రంలో పాత 13 జిల్లాల్లో మూడు జిల్లాలకు వ్యక్తుల పేర్లున్నాయి. ఒకటి ప్రకాశం జిల్లా. రెండోది శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, మూడోది వైఎస్సార్‌ కడప జిల్లా. స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు సేవలను గుర్తిస్తూ 1972లో ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు. ఆమరణ నిరాహార దీక్షతో ఆంధ్ర  రాష్ట్రాన్ని సాధించిన పొట్టి శ్రీరాములు పేరును 2008లో నెల్లూరు జిల్లాకు పెట్టారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరును 2010లో కడప జిల్లాకు పెట్టారు. ఇప్పుడు 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించడంతో ఆ 3 జిల్లాలకు తోడు మరో నాలుగు జిల్లాలకు (మొత్తం ఏడు) వ్యక్తుల పేర్లు పెట్టారు. విశాఖ నుంచి విడదీసి గిరిజనుల కోసం ఏర్పాటుచేసిన జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారు. పాడేరు కేంద్రంగా ఈ జిల్లాను ఏర్పాటుచేశారు. కృష్ణా జిల్లాను విభజించి.. విజయవాడ కేంద్రంగా టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ పేరుమీద ఎన్టీఆర్‌ జిల్లా పేరు పెట్టారు. ప్రఖ్యాత వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమయ్య పేరుతో రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా, పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయిబాబా పేరుతో శ్రీ సత్యసాయి జిల్లాను ఏర్పాటుచేశారు. వైఎ్‌సఆర్‌ కడప జిల్లా నుంచి కడప తీసేసి వైఎ్‌సఆర్‌ జిల్లాగా మార్చడం గమనార్హం. శతాబ్దాల కింద తిరుమలకు వెళ్లే మార్గంలో దేవునిగడప తొలి పట్టణంగా, ప్రవేశ ద్వారంగా ఉండేది. దాని పేరు నుంచే కడప అని వచ్చింది. దీనికి ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉంది. రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం రోశయ్య ప్రభుత్వం కడప జిల్లాకు వైఎ్‌సఆర్‌ కడప జిల్లా అని నామకరణం చేయగా.. ఇప్పుడు జగన్‌ సర్కారు కడప అనే పదాన్ని తొలగించి వైఎ్‌సఆర్‌ జిల్లాగా మిగిల్చింది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.