రాజధానిలో ‘జన రణభేరి’ విజయవంతం.. ఉద్యమ వేదికపై ఒక్కటైన విపక్షాలు

ABN , First Publish Date - 2020-12-18T08:12:00+05:30 IST

ఎక్కడికక్కడ పోలీసు ఆంక్షలు! బయటి జిల్లాల నుంచి నేతలు, ప్రజలెవరూ రాకుండా కట్టుదిట్టం! అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి..

రాజధానిలో ‘జన రణభేరి’ విజయవంతం.. ఉద్యమ వేదికపై ఒక్కటైన విపక్షాలు

రాజధాని రణం!

ఒకే కులం.. రైతు కులం.. ఒకే మాట.. అమరావతి

సీపీఎం మినహా అన్ని పక్షాలు హాజరు

బైకులు, ట్రాక్టర్లలో తరలివచ్చిన జనం

సభలో చివరిదాకా అదే ఉత్సాహం

కరోనా నిబంధనలు పాటిస్తూ క్రమశిక్షణ

అమరావతి ఉద్యమానికి ఏడాది పూర్తి

మరింతగా రగిలిన ఉద్యమ స్ఫూర్తి

అదే రోజు పోటీగా సర్కారు ‘బీసీ సభ’


(అమరావతి/గుంటూరు-ఆంధ్రజ్యోతి): ఎక్కడికక్కడ పోలీసు ఆంక్షలు! బయటి జిల్లాల నుంచి నేతలు, ప్రజలెవరూ రాకుండా కట్టుదిట్టం! అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి... సభను విఫలం చేసేందుకు యత్నం! అయినా సరే... అమరావతి రైతులు తమ ఉద్యమ స్ఫూర్తిని చాటుకున్నారు. అమరావతి ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం రాజధాని ప్రాంతంలోని రాయపూడిలో నిర్వహించిన ‘జన రణభేరి’ సభ విజయవంతమైంది. అమరావతిని ఒక్క కులానికి ఆపాదిస్తూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొడుతూ... ‘మేమంతా రైతులం, మాది రైతు కులం’ అని జనం చాటిచెప్పారు. అమరావతి రైతులకు సంఘీభావంగా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరుతోపాటు తెలంగాణ జిల్లాల నుంచి కూడా పలువురు తరలి వచ్చారు. ఎన్‌ఆర్‌ఐలు తమ మద్దతు ప్రకటించారు.


ఈ సభకు 20 వేల మందికి పైగా ప్రజలు తరలివచ్చారు.  సభ ప్రారంభమైనప్పటి నుంచి చివరి దాకా ఒక్కరంటే ఒక్కరూ ప్రాంగణం వదల్లేదు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలమంది నడిచి వచ్చారు. వేలాది మంది బైకులు, ట్రాక్టర్లపై వచ్చారు. పోలీసులు తాడికొండ అడ్డరోడ్డు మొదలుకొని రాయపూడి సభా ప్రాంగణం వరకు పలుచోట్ల పికెట్లు ఏర్పాటు చేశారు. రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో పలువురు సభకు హాజరు కాకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. చాలామంది ధైర్యం చేసి పోలీసు పికెట్లకు భయపడకుండా ముందుకొచ్చారు. సభా ప్రాంగణంలో రెండు సభా వేదికలు నిర్మించారు. ఒక వేదికమీద జేఏసీ, రాజకీయ పార్టీల నేతలు, రైతు నేతలు ఉండగా... పక్కనే మరో వేదికమీద దళిత రైతులు నిరాహారదీక్ష చేపట్టారు. అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-12-18T08:12:00+05:30 IST