డిసెంబరుకు 5 లక్షల ఇళ్లు పూర్తి

ABN , First Publish Date - 2022-09-30T09:09:14+05:30 IST

డిసెంబరుకు 5 లక్షల ఇళ్లు పూర్తి

డిసెంబరుకు 5 లక్షల ఇళ్లు పూర్తి

రోజుకు 6 గంటలు గడపగడపకు తిరగాలి

ప్రతినెలా 6 సచివాలయాలను సందర్శించాలి

ప్రతి సచివాలయం పరిధిలో 2 రోజులు పర్యటన

లేకుంటే పనులు మంజూరు కావు: సీఎం జగన్‌ 


అమరావతి, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): గడప గడపకూ కార్యక్రమం నిర్దేశించుకున్న మేరకు ప్రతి వార్డు, గ్రామ సచివాలయం పరిధిలో 2 రోజుల పాటు రోజుకు 6 గంటలు చొప్పున నిర్వహించకపోతే పనులు మంజూరు కావని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. స్పందనపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ గడపగడపకూ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే అభ్యర్థనల మేరకు ప్రాధాన్య పనుల కోసం ప్రతి గ్రామ, వార్డు సచివాలయానికి రూ.20 లక్షలు కేటాయించాం. ఈ పనులకు అత్యంత  ప్రాధాన్యం ఇవ్వాలి. ఎమ్మెల్యే, సచివాలయ సిబ్బంది అందరూ నెలలో కనీసం 6 సచివాలయాలను సందర్శించాలి. ఎమ్మెల్యే కనీసం 2 రోజులు సంబంధిత గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో ఉండాలి. ప్రతి ఇంటినీ కవర్‌ చేయాలి. రోజులో కనీసం 6 గంటలు గ్రామ, వార్డు సచివాలయంలో గడప గడపకూ నిర్వహించాలి. ఒక గ్రామ, వార్డు సచివాలయంలో రెండు రోజుల గడపగడపకూ కార్యక్రమం ముగిశాక అత్యంత ప్రాధాన్యంగా గుర్తించిన పనులు మంజూరు చేయాలి. మంజూరైన తర్వాత నెలరోజుల్లోగా ఆ పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలి.ప్రాధాన్యంగా గుర్తించినా, మంజూరు చేయకుండా మిగిలిపోయిన పనులను అక్టోబరు 5లోగా మంజూరు చేయాలి. ఆ పనులన్నీ అక్టోబరు చివరి నుంచి ప్రారంభం కావాలి’ అన్నారు. ఈ-క్రాప్‌ అత్యంత ముఖ్యమైన కార్యక్రమం అని, పొరపాట్లు లేకుండా నూటికి నూరుపాళ్లు ఈ క్రాపింగ్‌ పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్లు ఎప్పుటికప్పుడు ఈ క్రాపింగ్‌పై సమీక్ష చేయాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద సగటు వేతనం రూ. 210.02 అందుతోందని, కనీసంగా రూ.240 అందేలా చూడాలని ఆదేశించారు. నెల్లూరు, పశ్చిమ గోదావరి, బాపట్ల, ఏలూరు, కర్నూలు జిల్లాల్లో గృహ నిర్మాణం బాగుందని, సత్యసాయి, ప్రకాశం, అనకాపల్లి, కృష్ణా, అనంతపురం జిల్లాలు దీనిపై దృష్టిపెట్టాలని పేర్కొన్నారు. డిసెంబరు నాటికి 5 లక్షల ఇళ్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జగనన్న కాలనీల్లో 3.5 లక్షలు, 1.5 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి  చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. మిగిలిపోయిన లబ్ధిదారులకు ఫేజ్‌-3 కింద డిసెంబరులో ఇళ్ల మంజూరుకు కలెక్టర్లు కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. ప్రతి బుధవారం కలెక్టర్లు స్పందనపై సమీక్ష చేయాలన్నారు. అక్టోబరు 26న రైతు భరోసా రెండో విడత, అదే రోజు ఇన్‌పుట్‌ సబ్సిడీ, వసతి దీవెన నవంబరు 10న విడుదల చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. 

Updated Date - 2022-09-30T09:09:14+05:30 IST