మున్సిపల్‌ టీచర్ల.. జీతాల వెతలు!

ABN , First Publish Date - 2022-09-30T09:59:55+05:30 IST

మున్సిపల్‌ టీచర్ల.. జీతాల వెతలు!

మున్సిపల్‌ టీచర్ల.. జీతాల వెతలు!

పట్టించుకోని పాఠశాల విద్యాశాఖ

వేతనాల బిల్లులకు ఒక్కరోజు ముందు మెమోలు

అప్పటికప్పుడు వడివడిగా బిల్లులు

ఈ హడావుడిలో కానివారికి చుక్కలే!

జీతాల కోసం ఎదురుతెన్నులు

గోడు చెప్పుకొంటే మీరు మాకు ప్రాధాన్యం కాదన్న అధికారి!


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఈ నెల జీతాలు ఎప్పుడొస్తాయోనని రాష్ట్రవ్యాప్తంగా 14 వేల మంది పురపాలక ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకూ మున్సిపాలిటీల పరిధిలో ఉన్న మున్సిపల్‌ పాఠశాలలను పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి తీసుకురావడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైంది. పాఠశాలలను కలిపేయడంపై హడావుడిగా నిర్ణయం తీసుకున్న జగన్‌ ప్రభుత్వం.. అనంతర పరిణామాలను గాలికొదిలేసింది. దీంతో మూడు నెలలు గడిచినా ఇంతవరకూ సమయానికి జీతం పడుతుందన్న గ్యారెంటీ లేకుండా పోయింది. పురపాలక పాఠశాలలు తొలి నుంచీ మున్సిపల్‌ శాఖ పరిధిలోనే ఉన్నాయి. వారికి జీతాలు, నిర్వహణ బాధ్యత అంతా పురపాలక సంఘాలే చేసేవి. పట్టణ ప్రాంతాల్లో ఉండడం వల్ల ఈ పాఠశాలల్లోని టీచర్‌ పోస్టులకు భారీగా డిమాండ్‌ కూడా ఉంటుంది. అయితే జగన్‌ ప్రభుత్వం జూన్‌లో మున్సిపల్‌ పాఠశాలలను పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి తీసుకొచ్చింది. పేరుకు పాఠశాలలను తీసుకొచ్చినా వాటి నిర్వహణ, టీచర్ల జీతాలు, సర్వీసు రికార్డుల విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో హైస్కూళ్ల ప్రధానోపాధ్యాయులకు డీడీవో అధికారాలుంటాయి. దీంతో టీచర్ల జీతాల బిల్లులు వారే పెడుతుంటారు. కానీ మున్సిపల్‌ టీచర్ల జీతాల నిర్వహణ బాధ్యత చూసేది మున్సిపాలిటీల అదనపు కమిషనర్లు. సర్వీసు రికార్డుల బదలాయింపు చేపట్టకపోవడంతో ప్రతి నెలా వారికి జీతాలు ఎవరు వేయాలన్నదానిపై గందరగోళం తలెత్తుతోంది. ప్రతినెలా 25వ తేదీలోగా జీతాల బిల్లులు పంపితేనే.. ఒకటో తేదీన జీతం పడుతుంది. కానీ పాఠశాల విద్యాశాఖ, మున్సిపల్‌ శాఖల మధ్య సమన్వయ లోపంతో నెలాఖరు వరకూ దీనిపై నిర్ణయం తీసుకోవడం లేదు. జీతాల బిల్లులు వేయడానికి ఒక రోజు ముందు ‘ఈ నెలకు మీరే జీతాలు వేయండి’ అంటూ తీరికగా పాఠశాల విద్యా శాఖ.. మున్సిపల్‌ శాఖకు మెమోలు పంపుతోంది. దీంతో అప్పటికప్పుడు ఒక్కరోజులో అందరికీ జీతాల బిల్లులు వేయలేకపోతున్నారు. 25వ తేదీలోగా బిల్లులు పెట్టిన వారికి ఒకటో తేదీన, తర్వాత చేసిన వారికి 10వ తేదీన వేతనాలు పడుతున్నాయి. డీడీవో అధికారాలు మాకే ఇచ్చేస్తే ఈ గోల ఉండదని టీచర్లు గగ్గోలు పెడుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఎప్పుడు జీతాలు పడతాయో అర్థం కాక మున్సిపల్‌ టీచర్లు అయోమయానికి గురౌతున్నారు.


బోధనపై ప్రభావం..

రాష్ట్రవ్యాప్తంగా 2,114 పురపాలక పాఠశాలలున్నాయి. వాటిలో 335 ఉన్నత పాఠశాలల్లో 4.5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 2,400 మంది స్కూల్‌ అసిస్టెంట్ల కొరత ఉంది. దీంతో ఏటా విద్యా వలంటీర్లను నియమించుకునేవారు.  కానీ పాఠశాల విద్యాశాఖలోకి మార్చడంతో ఈ సంవత్సరం వలంటీర్లను నియమించలేదు. దీంతో భారీగా టీచర్ల కొరత ఏర్పడింది. ఉదాహరణకు.. మంగళగిరిలోని మున్సిపల్‌ పాఠశాలలో 1,155 మంది విద్యార్థులుంటే కేవలం 11 మంది టీచర్లున్నారు. అంటే ప్రతి 110 మంది విద్యార్థులకు ఒక్కరే టీచర్‌.


మీరు మాకు ప్రాధాన్యం కాదు

జీతాలు, సర్వీసు రికార్డుల సమస్యలపై మున్సిపల్‌ టీచర్లు, సంఘాలు.. పాఠశాల విద్యాశాఖ అధికారులను కలిశారు. ‘మాకు జిల్లా పరిషత్‌ టీచర్లు ముఖ్యం. వారి బదిలీలు, పదోన్నతులయ్యాక మీ సమస్యలు చూస్తాం. మీకు డీడీవో అధికారాలు ఇవ్వలేం. మీరు మాకు ప్రాధాన్యం కాదు’ అని ఓ అధికారి వ్యాఖ్యానించారని మున్సిపల్‌ టీచర్లు తెలిపారు. ఉన్నతాధికారులను కలిస్తే సెలవు పెట్టి ఎందుకొచ్చారని ఎదురు ప్రశ్నిస్తున్నారని, ఇలాంటి పరిస్థితి గతంలో లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


బోధనేతర సిబ్బంది వెనక్కి..

మున్సిపల్‌ పాఠశాలలను పాఠశాల విద్య పరిధిలోకి తేవడంతో ఇప్పటివరకూ ఆ పాఠశాలల్లో పనిచేసిన బోధనేతర సిబ్బందిని పురపాలక సంఘాలు వెనక్కి తీసుకుంటున్నాయి. దీంతో కనీసం తరగతి గదులను ఊడ్చేవారు కూడా కరువయ్యారు. అటెండర్లను సైతం తొలగించడంతో గంట కొట్టేవారూ లేకుండా పోయారని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-09-30T09:59:55+05:30 IST