పెరిగిన పత్తి సాగు

ABN , First Publish Date - 2022-09-30T10:01:05+05:30 IST

పెరిగిన పత్తి సాగు

పెరిగిన పత్తి సాగు

ఈ ఏడాది 16.32 లక్షల ఎకరాల్లో పంట

ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యధికం

గత రెండేళ్లుగా పెరిగిన వినియోగం 


అమరావతి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఈ ఏడాది పత్తి సాగు విస్తీర్ణం పెరిగింది. సాధారణంగా ఏటా 15.37 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తారు. ఈ ఏడాది 16.32 లక్షల ఎకరాల్లో సాగులోకి వచ్చింది. కాగా నిరుడు 12.5 లక్షల ఎకరాల్లోనే పత్తిని సాగు చేశారు. కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా దూది, వస్త్ర వినియోగం గణనీయంగా పెరిగింది. చాలా రాష్ట్రాల్లో వర్షాలకు పత్తి దెబ్బతినడంతో నిరుడు పత్తికి విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. దీంతో అంతర్జాతీయంగా పత్తి ధర పెరిగింది. క్వింటా ధర రూ.15 వేల దాకా పలికింది. గతంలో ఎప్పుడూ ఇంత ధర లభించలేదు. అయితే, ఎక్కువ మంది రైతులు పత్తిని అమ్మేసిన తర్వాత ధర పెరిగింది. అయినా ఈ ఏడాది కూడా మంచి ధర వస్తుందన్న ఆశాభావంతో రైతులు ఎక్కువ విస్తీర్ణంలో పత్తి సాగు చేశారు. ప్రస్తుతం ఆదోని మార్కెట్‌లో క్వింటా పత్తి ధర 5500 నుంచి 9800 వరకు ఉంది. రాష్ట్రంలో కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, ప్రకాశం, ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పత్తి విస్తీర్ణం పెరిగింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యధికంగా 7.31 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. గుంటూరు జిల్లాలో 3.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. అయితే కర్నూలు, నంద్యాల, గుంటూరు జిల్లాల్లో పత్తి పంటపై గులాబీ పురుగు, పొగాకు లద్దె పురుగు, రసం పీల్చే పురుగు ఉధృతంగా ఉంది. ఇప్పుడిప్పుడే పత్తి పూత, కాయ మొదలవుతోంది. మరో నెల రోజుల్లో పత్తి తీతలు ప్రారంభం కానున్నాయి. 

Updated Date - 2022-09-30T10:01:05+05:30 IST