ఖజానా నుంచి నిధుల మళ్లింపు.. రాజ్యాంగ ఉల్లంఘనే

ABN , First Publish Date - 2022-05-16T08:05:30+05:30 IST

ఖజానా నుంచి నిధుల మళ్లింపు.. రాజ్యాంగ ఉల్లంఘనే

ఖజానా నుంచి నిధుల మళ్లింపు.. రాజ్యాంగ ఉల్లంఘనే

లిస్ట్‌-2లోని ఏడో షెడ్యూల్‌కు వ్యతిరేకం

అధికార పక్ష రాజకీయ

ప్రయోజనాల కోసం అప్పులు

అందుకు రాజ్యాంగ విరుద్ధంగా

బ్యాంకులకు ఖజానా తాకట్టు

పైగా ఆదాయం నేరుగా

కార్పొరేషన్ల ఖాతాలో జమ

రాష్ట్ర ఆర్థిక అధికారుల తీరుపై

దేశవ్యాప్తంగా చర్చ

ఈ నేరాలకు జైలు తప్పదు!

ఆర్థిక నిపుణుల మనోగతం


అమరావతి, మే 15 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగానికి లోబడి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి  తీసుకెళ్లాల్సిన ఐఏఎస్‌ అధికారులు.. ఆ రాజ్యాంగాన్ని నేరుగా ఉల్లంఘిస్తూ రాజ్యాంగబద్థ సంస్థలను నిర్లక్ష్యం చేస్తున్నారు. పాలకపక్ష రాజకీయ ప్రయోజనాలకు అవసరమైన అప్పులు సమకూర్చడానికి రాష్ట్రాన్ని రాజ్యాంగవిరుద్థంగా బ్యాంకులకు తాకట్టు పెడుతున్నారు. అంతేగాకుండా ఖజానాలో చేరిన ఆదాయాన్ని తమ సొంత సొమ్ములా తీసి.. కార్పొరేషన్ల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పుడు దేశమంతా రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారుల తీరుపైనే చర్చించుకుంటోంది. ఇదే అంశంపై ఇటీవల ఆర్థిక శాఖ  ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌కు కేంద్ర ఆర్థికశాఖ అధికారులు క్లాస్‌ తీసుకున్నారు కూడా. రాజ్యాంగానికి లోబడి పనిచేయకుండా యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న రాష్ట్ర అధికారులకు జైలుశిక్ష తప్పకపోవచ్చని కొందరు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 2021-22లో ఫిబ్రవరి వరకు రాష్ట్ర ఆదాయం రూ.1,32,000 కోట్ల వరకు వచ్చిందని కాగ్‌ తన ఫిబ్రవరి నివేదికలో తెలిపింది. మార్చిలో రూ.20,000 కోట్లపైనే రాబడి వచ్చింది. దీంతో ఆ ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.లక్షన్నర కోట్లు దాటుతుందని అందరూ భావించారు. కానీ రాష్ట్ర ఆర్థిక అధికారులు ఇందులో నుంచి ఇప్పుడు స్పెషల్‌ మార్జిన్‌ అనే పేరుతో రూ.8,000 కోట్లను అర్ధాంతరంగా బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు మళ్లించేశారు. ఇది రాజ్యాంగంలోని లిస్ట్‌-2లోని ఏడో షెడ్యూల్‌ను నేరుగా ఉల్లంఘించడమే. ఈ విషయం కేంద్రానికి తెలియకుండా జగన్‌ ప్రభుత్వం జాగ్రత్తపడుతోంది. కేంద్రం నుంచి ఇక కొత్త అప్పులకు అనుమతి రాదనుకున్న తర్వాత నెమ్మదిగా ఏజీ కార్యాలయానికి సమాచారం ఇచ్చి 2021-22 అకౌంట్స్‌ ఖరారు చేయించుకోవాలని భావిస్తోంది. బేవరేజెస్‌ కార్పొరేషన్‌ విషయంలో ప్రభుత్వం చెప్పే వాదన కరెక్ట్‌ అనుకుంటే.. అప్పుడు ఖజానాకు వచ్చే ప్రతీ పైసాకు స్పెషల్‌ మార్జిన్‌ లాగా ఏదో ఒక పేరు పెట్టి ఏదో ఒక కార్పొరేషన్‌కి మళ్లించి కేంద్రంతో సంబంధం లేకుండా భారీగా అప్పులు తెచ్చుకోవచ్చు కదా..! ఖజానా ఆదాయం కార్పొరేషన్‌కు మళ్లించడం రాజ్యాంగ విరుద్థమని తెలుసు కాబట్టే జగన్‌ ప్రభుత్వం ఏజీ కార్యాలయానికి సమాచారం పంపకుండా తాత్సారం చేస్తోంది. స్పెషల్‌ మార్జిన్‌ అనే పదం రాజ్యాంగంలో గానీ, ఇతర కేంద్ర, రాష్ట్ర చట్టాల్లో గానీ లేదు. కేవలం అప్పుల కోసం బ్యాంకులకు ఆదాయ మార్గం చూపడానికి మన రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు తెలివిగా సృష్టించిన పదమిది. స్పెషల్‌ మార్జిన్‌ పేరుతో ఆ రూ.8,000 కోట్లను కార్పొరేషన్‌కి మళ్లిస్తే.. ఖజానాను తాకట్టు పెట్టి.. రిజర్వు బ్యాంకు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి కేంద్రం అనుమతితో తెస్తున్న అప్పులను ఎలా చెల్లించగలరనేదే ప్రధాన ప్రశ్న. ఖజానాపై ఆధారపడి తెచ్చిన అప్పులు, ఇతర ఖర్చులను ఎలా నిర్వహిస్తుందనే ప్రశ్నలకు సమాధానం లేదు. అప్పులపై తప్ప అభివృద్ధి, ఉపాధిపై ఆలోచన లేకుండా జగన్‌ సర్కారు వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2022-05-16T08:05:30+05:30 IST