ఘాటు తగ్గిన ఉల్లి రేటు

ABN , First Publish Date - 2022-05-16T08:39:38+05:30 IST

ఘాటు తగ్గిన ఉల్లి రేటు

ఘాటు తగ్గిన ఉల్లి రేటు

దేశవ్యాప్తంగా ధర పతనం

ఏపీలో మరీ తక్కువ.. రిటైల్‌గా రూ.100కు 6కిలోలు

రైతుకు గిట్టుబాటుకాని ధర


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మూడు నెలల క్రితం సెంచరీ కొట్టిన ఉల్లి.. ఇప్పుడు  కిలో రూ.20కి పడిపోయింది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఇతర రాష్ట్రాల్లో కంటే తెలుగు రాష్ట్రాల్లో ఇంకాస్త తక్కువగానే ఉండగా.. ఏపీలో మరీ తక్కువ ధర పలుకుతోంది. కర్నూలు మార్కెట్‌లో ప్రస్తుతం క్వింటా గరిష్ఠ ధర రూ.700కు మిం చడం లేదు. కాస్త నాసిరకం మరీ రూ.300లే పడింది. సగటు ధర రూ.500 పలుకుతోంది. రాష్ట్రంలోని బహిరంగ మార్కెట్లలో నాణ్యమైన పాయలు రూ.30 అమ్ముతుండగా, సన్న, చిన్న పాయలు రూ.100కు ఆరు కిలోలు ఇస్తున్నారు. ఇక జనవరి-ఫిబ్రవరిలో కోతకొచ్చిన రెండో పంట కూడా ముగింపు దశకు వచ్చింది. అయినా రైతుకు మద్దతు ధర దక్కడం లేదు. ఏపీలో ఉల్లి నాణ్యత, నిల్వకు అవకాశం లేకపోవడంతో ఎగుమతులు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో జరగడం లేదు. దీంతో స్థానిక మార్కెట్లలోనే అమ్ముకోవాల్సి వస్తోంది. అలాగని కర్నూలు మార్కెట్‌కు రోజుకు 300 క్వింటాళ్ల ఉల్లి కూడా రాని పరిస్థితి. అయినా ధర ఉండటం లేదని రైతులు వాపోతున్నారు. క్వింటా కనీసం రూ.3వేలు పలికితేనే గిట్టుబాటవుతుందని అంటున్నారు. అయినా రైతు గురించి ఆలోచించే నాథుడే లేడని ఉల్లి రైతులు వాపోతున్నారు. మార్కెట్‌, స్టోరేజీ సదుపాయాలు విరివిగా ఉన్న మహారాష్ట్రలో ప్రస్తుతం నాణ్యమైన ఉల్లి క్వింటా రూ.1200 దాకా పలుకుతోంది. పుణె, నాసిక్‌, సోలాపూర్‌ వంటి మార్కెట్ల నుంచి ఇతర ప్రాంతాలకు ఉల్లిగడ్డలు  ఎగుమతి జరుగుతోంది. నాణ్యమైన పాయలను ఏపీ, తెలంగాణ ప్రాంత వ్యాపారులు కూడా మహారాష్ట్ర నుంచే దిగుమతి చేసుకుంటున్నారు. మహారాష్ట్రలో నిరుడు పంట దెబ్బతినగా, ఈ ఏడాది పంట విరివిగా పండింది. ఇక.. అటు జమ్ముకశ్మీర్‌, ఇటు కేరళలో ఉల్లి ధరలు బాగా ఉన్నాయి. జమ్ముకశ్మీర్‌లో క్వింటా రూ.1800-2000ఉండగా, కేరళలో రూ.1500-1700, ఒడిసాలో రూ.1500- 1700, కర్ణాటకలో రూ.1200-1600, పశ్చిమబెంగాల్‌లో రూ.1200-1400 వరకు ఉండగా, మిగతా రాష్ట్రాల్లో రూ.1000నుంచి రూ.1200 మధ్య ఽఉన్నాయి. ఉల్లి అధికంగా సాగయ్యే రాష్ట్రాల్లో ధర తక్కువగానే ఉండగా, దిగుమతులపై ఆధారపడే రాష్ట్రాల్లో రవాణా చార్జీలతో ధర కాస్త ఎక్కువగా ఉందని వ్యాపారులు చెప్తున్నారు. 

Updated Date - 2022-05-16T08:39:38+05:30 IST