మరో ఏడాది వరకు గుంతల రోడ్లే!

ABN , First Publish Date - 2022-05-16T08:38:15+05:30 IST

మరో ఏడాది వరకు గుంతల రోడ్లే!

మరో ఏడాది వరకు గుంతల రోడ్లే!

జూన్‌ నాటికే బాగుజేతకు సీఎం ఆదేశం..  ఏడాది క్రితమే జగన్‌ మౌఖిక ఉత్తర్వు

ఇప్పుడు మళ్లీ మరో ఏడాది కొనసాగింపు.. మరమ్మతులకు 6000 కోట్ల అవసరం 

సర్కారు వద్ద ఉన్నది 2 వే ల కోట్లే .. నిధులు లేకుంటే పనులు జరిగేదెలా? 


‘‘రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారుల మరమ్మతు పనులు వచ్చే జూన్‌ నాటికి పూర్తిచేయాలి. వర్షాకాలం రాకముందే రహదారుల అభివృద్ధి పనులు పూర్తవ్వాలి’’ - గత ఏడాది సెప్టెంబరులో సీఎం జగన్‌ ఇచ్చిన ఆదేశం ఇది!


‘‘ఏడాదిలోగా రోడ్ల విషయంలో గణనీయమైన ప్రగతి కనిపించాలి’’ 

- ఈ నెల 11న సీఎం జగన్‌ చేసిన సూచన ఇది! 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిపై ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేస్తోంది. ప్రతిపక్షాలు ఎప్పుడు విమర్శించినా.. వెంటనే రంగంలోకి దిగుతున్న ముఖ్యమంత్రి జగన్‌.. అదిగో అప్పటి కల్లా రోడ్లు బాగుచేయండి.. గుంతలు కనిపించడానికి వీల్లేదు.. అని ఆదేశం ఇస్తున్నారు. ఆ వెంటనే ఆయనతోపాటు అధికారులు సైతం మరిచిపోతున్నారు. గత ఏడాది ఇదే ఆదేశాలు ఇచ్చిన జగన్‌.. మళ్లీ మడమ తిప్పేశారు. వచ్చే ఏడాది వరకు దీనిని పొడిగించారు. అంటే, మరో ఏడాది వరకు రాష్ట్రంలో గతుకులు, గుంతలు, గోతుల రోడ్లే ఉంటాయని చెప్పకనే చెప్పారు. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లపాటు రహదారి మరమ్మతులు సరిగ్గా చేపట్టని సర్కారు, రోడ్లు ఎందుకు బాగోలేదని ఎవరైనా ప్రశ్నిస్తే.. గత ప్రభుత్వ వైఫల్యమంటూ నెట్టుకొచ్చింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి 2వేల కోట్ల అప్పు తీసుకొచ్చి కూడా నిర్దిష్టకాలంలో రహదారి మరమ్మతులు చేపట్టలేక, గడువును మరో ఏడాదికి పొడిగించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంమవుతోంది. గడిచిన మూడేళ్లకాలంలో సర్కారు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కొత్తగా నిర్మించిన గ్రామీణ, జిల్లా, రాష్ట్ర ప్రధాన రహదారులు ఎన్ని? వాటి విస్తీర్ణం ఎంత అన్న ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం చెప్పలేకపోతోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించి.. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల వివరాలు చెబుతూ.. వాటిని తన ఖాతాలో వేసుకుంటోంది.   సర్కారు చెబుతున్న అధికారిక లెక్కల ప్రకారం ఏటా 8 వేల కిలోమీటర్ల రహదారులను అభివృద్ధి చేయాలి. గోతులు పడి పాడైన వాటికి మరమ్మతు పనులు చేపట్టాలి. ఆ లెక్కన మూడేళ్ల వ్యవధిలో 24 వేల కిలోమీటర్ల రహదారులకు మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. దీనికోసం సర్కారుకు నికరంగా రూ.6,000 కోట్లు అవసరం. రహదారుల మరమ్మతుల పేరుతోనే పెట్రోల్‌, డీజిల్‌పై సెస్సు వసూలు చేస్తున్నారు. కానీ, ఆ నిధులను సర్కా రు సొంత అవసరాలకు వాడుకుంటోంది. రోడ్లకోసం  రూపాయి కూడా వినియోగించలేదు.  


తెచ్చిన అప్పు ఏమైంది?

రహదారి మరమ్మతుల కోసం పలు ప్రయత్నాల తర్వాత బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి  ప్రభుత్వం రూ.2 వేల కోట్లు అప్పు తెచ్చుకుంది. ఆ నిధులతో 8,268 కిలోమీటర్ల రహదారుల మరమ్మతులు చేపడతామని గత ఏడాది సెప్టెంబరులో ప్రకటించింది. 308 పనులు స్టేట్‌హైవేలపై, 853 పనులు జిల్లా ప్రధాన రహదారులపై విభజించి మొత్తం 1160 పనులు చేపడతామని పేర్కొంది. వీటి పనులు సాగుతున్నాయి. సీఎం లోగడ చెప్పిన దాని ప్రకారం ఈ రహదారి మరమ్మతు పనులను ఈ ఏడాది జూన్‌ నాటికి పూర్తిచేయాలి. వర్షాకాలం ప్రారంభానికి ముందే రహదారి రిపేర్లు పూర్తిచేయాలని ఆర్‌అండ్‌బీకి దిశానిర్దేశం చేశారు. వాస్తవంగా ఏటా 8వేల కిలోమీటర్ల చొప్పున రోడ్ల నిర్వహణ చేపట్టాలి. జగన్‌ సర్కారు వచ్చి మూడేళ్లయింది. ఈ లెక్కన 24వేల కిలోమీటర్ల మెయింటెనెన్స్‌ చేపట్టాలి. కానీ సర్కారు చేపట్టిన పనులు 8వేల కిలోమీటర్ల పరిధిలోనివే. మరి మిగిలిన 16వేల కిలోమీటర్ల రహదారుల మాటేమిటి? అనేదానిపై సమాధానం లేదు. ఎందుకంటే, సర్కారు తొలిదశలో చేపట్టిన 8వేల కిలో మీటర్ల రోడ్లలో సగమే నిర్వహిస్తోంది. వాటికే నిధులు పూర్తిగా చాలడం లేదు. మరి పూర్తిగా చేపట్టాలంటే మరో రూ.2 వేల కోట్లపైనే కావాలి. ఇదికాక, 16 వేల కిలో మీటర్ల రహదారుల నిర్వహణకు మరో రూ.4 వేల కోట్లు అవసరం. వాటిని ఎలా సమకూరుస్తారన్నది మరో పెద్ద ప్రశ్న.  సీఎం చెబుతున్న రెండో ఏడాది గడువులోగా మరో 8వేల కిలో మీటర్ల రోడ్లు వార్షిక మెయింటెనెన్స్‌కు వస్తాయి. అప్పటికే రాష్ట్రంలో ఎన్నికల సమయం సమీపిస్తుంది. అప్పటికీ పాతటార్గెట్లు పూర్తిచేయకున్నా, కొత్త టార్గెట్‌లోని రహదారులను అభివృద్ధి చేయకుంటే రహదారుల పరిస్థి తి మరింత దిగజారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పక్కరాష్ట్రం మంత్రులు ఏపీలోని రోడ్ల పరిస్థితిపై బహిరంగ వేదికలపైనే వేలెత్తిచూపిస్తున్నారు. వాటిపై సీఎం పెదవి విప్పకుండా, మరో ఏడాదిలో రోడ్లు బాగుండాలని చెప్పడం విస్మయం కలిగిస్తోందని నిపుణులు చెబుతున్నారు. 


నిధులు లేకే.. పొడిగింపు!

నిధులుంటే తప్ప రోడ్లు పనులు కావని, అందుకే సీఎం వ్యూహాత్మకంగా రహదారి మరమ్మతు పనుల డెడ్‌లైన్‌ను పొడిగించుకుంటూ పోతున్నారని ఇంజనీరింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన మరో ఏడాది పాటు ప్రయాణికులకు గుంతలు, గోతుల రోడ్లపై నరకయతాన తప్పదు. ఇదిలావుంటే, దేశంలో ఏ రాష్ట్రం చేయనంత ప్రజాసంక్షేమం, అభివృద్ధి ఏపీలో వైసీపీ సర్కారే చేస్తోందంటూ పెద్ద ఎత్తున కరపత్రాలు ముద్రించారు. అయితే, దానిలో రోడ్ల ప్రస్తావన లేకపోవడం గమనార్హం.

Updated Date - 2022-05-16T08:38:15+05:30 IST