‘గడప’లో గడబిడ

Published: Sun, 22 May 2022 02:43:21 ISTfb-iconwhatsapp-icontwitter-icon
గడపలో గడబిడ

శవాలను వాటికకు చేర్చడానికీ దోవ లేదు 

అమ్మ చనిపోతే ఈ మురుగుకాల్వలోంచి మోసా

అడిగితే రోడ్డురాలేదుగానీ తల నెరిసిపోయింది

ట్రాన్స్‌ఫార్మర్‌ కోసం తిరిగితే చెప్పులు తెగాయి

బోర్ల కింద ఏడెకరాలు దెబ్బతిని..6లక్షలు నష్టం

‘గడప గడప’లో ఆదోని ఎమ్మెల్యేకు చుక్కలు


ఆదోని రూరల్‌, మే 21 : ‘రెడ్డీ..  మీరు చూస్తున్న ఈ దారిలో ఎవరైనా నడవగలరా? ఈ వీధిలో నివా సం ఉంటున్న పది కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే ఆ శవాన్ని ఎలా మోసుకెళ్లాలి? ఈ మధ్య కాలంలో మా అమ్మ చనిపోతే ఇక్కడి నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఎన్ని అవస్థలు పడ్డామో ఊరం తా చూసింది. మరో దారిలో శ్మశాన వాటికకు తరలిద్దామంటే ఆ దారిలో ఉన్న వారంతా అడ్డు చెబుతున్నారు. గత్యంతరం లేక మీరు చూస్తున్న ఈ మురుగు కాల్వ గుం డానే మా అమ్మ మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించాం. అయినా అధికారులు, నాయకులు పట్టించుకోలేదు’’ అని బైచిగేరికి చెందిన సరస్వతి అనే మహిళ...ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డిని నిలదీసింది. ‘ఈ రోడ్డు వేయాలని అడిగీ...అడిగీ... మేమే ముసలివాళ్లమయ్యామ’ని జయమ్మ, శ్రీదేవిలు వాపోయారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’కార్యక్రమం శనివారం కర్నూలు జిల్లా ఆదోని మండలం బైచిగేరి గ్రామంలో ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి నిర్వహించారు. అడుగడుగునా ప్రజలు తమ సమస్యలపై ఎమ్మెల్యేను నిలదీశారు. 


ప్లాట్‌ లేదు ... పట్టా లేదు 

‘‘మేం పక్కా వైసీపీ అభిమానులం. కానీ, అన్ని అర్హతలున్నా మాకు ప్లాట్‌  ఇవ్వలేదు. మాకున్న సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకుంటామంటే కూడా పట్టా ఇవ్వలేదు. నాలుగు నెలలుగా అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసుగు చెందాం. పట్టా ఇవ్వకున్నా అప్పు చేసి ఇల్లు నిర్మించుకుంటున్నాం. మన ప్రభుత్వం వచ్చినా ప్రయోజనం మాత్రం లేదు’’ అని మొలగవల్లి లక్ష్మి అనే మహిళ ఎమ్మెల్యేతో పాటు రెవెన్యూ, హౌసింగ్‌ అధికారులను నిలదీసింది. 


నాలుగు జతల చెప్పులు తెగిపోయాయి 

‘‘ఎనిమిది నెలల క్రితం మా పొలంలో ఉన్న ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. ట్రాన్స్‌ఫార్మర్‌ కింద నావి నాలు గు బోర్లు ఉన్నాయి. ఈ నాలుగు బోర్ల ద్వారా ఏడెకరాల భూమి సాగు చేసుకుంటున్నా. కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటుచేయాలని మీ చుట్టూ, విద్యుత్‌ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి నాలుగు జతల చెప్పులు తెగిపోయాయి. ట్రాన్స్‌ఫార్మర్‌ మాత్రం రాలేదు. పంటలు పోయి... గత ఏడాది రూ.ఆరు లక్షల వరకు నష్టం వాటిల్లింది. ఈ ఏడాది వర్షంపై ఆధారపడి దాదాపు రూ. రెండు లక్షలు ఖర్చు చేసి పత్తి వేశాను. ఇప్పటికైనా ట్రాన్స్‌ఫార్మర్‌ను బిగించండి. లేకపోతే మాతో కాదని చెప్పండి. నేనే కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను బిగించుకుంటాను’ అని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి. విద్యుత్‌ శాఖ అధికారులను రైతు మాణిక్యరెడ్డి నిలదీశారు.


మా కాలనీకి తాగునీళ్లు లేవు 

బైచిగేరి బీసీ కాలనీలో ఎమ్మెల్యేను మహిళలు చుట్టుముట్టారు. కొన్నేళ్లుగా తమ కాలనీకి తాగునీరు కాదు కదా...ఉప్పు నీరు కూడా అందడం లేదని ఫిర్యాదుచేశారు. కనీసం తమకు తాగునీరందేలా చూడండి రెడ్డీ అంటూ నాగమ్మ, అనిత, మహేశ్వరి, నాగరాజులు ఎమ్మెల్యేను నిలదీశారు. 


రోడ్లు.. కాల్వలు లేవు

‘‘మీరు నడుస్తున్నది కాల్వలో కాదు. ఇది ప్రధాన రహదారి. ఇలాంటి రోడ్లపై ఎలా నడవాలో చెప్పాల’’ని ఎమ్మెల్యేను స్థానికులు నిలదీశారు. ఎక్కడ చూసినా రోడ్లపై డ్రైనేజీ ప్రవహిస్తున్నదని స్థానికులు నాగమ్మ, క్షావమ్మ, చంద్రమ్మ, అనితమ్మ, సుదర్శన్‌, అశోక్‌లు అధికారులను నిలదీశారు. ఇప్పటికైనా రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని ఆనందమ్మ అనే మహిళ వారితో మొరపెట్టుకుంది. వీటన్నింటికి సమాధానంగా ‘మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామ’ని చెబుతూ అక్కడి నుంచి ఎమ్మెల్యే కదిలారు. 


ఆయా పోస్టుకు పైసలు ఇవ్వాలట!

అంబాజీపేట, మే 21: ‘‘పార్టీ కోసం కష్టించి పనిచేశాం... అంగన్‌వాడీ ఆయా పోస్టును ఇప్పించమని బతిమాలాం..సొమ్ములిస్తేనే పోస్టు ఇస్తామని స్థానిక నేతలు హుకుం జారీచేశారు’’ అని కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం చిరతపూడికి చెందిన వైసీపీ మహిళా కార్యకర్త దాసరి భార్గవి.. పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబును నిలదీసింది. శనివారం ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం కోసం చిరతపూడికి వచ్చిన ఎమ్మెల్యేను సమస్యలపై ప్రశ్నించింది. ‘‘నాకు ఇద్దరు కుమార్తెలు. సొమ్ములు ఇస్తేనే అంగన్‌వాడీ ఆయా పోస్టును మంజూరు చేస్తున్నామని మన పార్టీ నేతలే చెబుతున్నారు. ఎమ్మెల్యేకు తెలియకుండా పోస్టులు అమ్ముకోవడం సాధ్యమేనా?’’ అని ముఖం మీదే అడిగేసింది. పోస్టు నియామకంపై అధికారులు నిర్ణయం తీసుకుంటారని చెప్పి.. ఎమ్మెల్యే అక్కడ నుంచి వెళ్లిపోయారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.