ఒక గది.. సగం సగం!!

ABN , First Publish Date - 2022-05-22T08:44:32+05:30 IST

ఒక గది.. సగం సగం!!

ఒక గది.. సగం సగం!!

సెక్షన్‌కు 60 మంది విద్యార్థులు

3 నుంచి 8 వరకు ఒకే మీడియం

తెలుగు మీడియం మాటే వద్దు

కావాలంటే టీచర్ల గదుల్లోనూ పాఠాలు

పాఠ శాలల విలీనంపై మార్గదర్శకాలు


అమరావతి, మే 21(ఆంధ్రజ్యోతి): ‘‘తరగతుల నిర్వహణకు పాఠశాలలో ఉన్న గదులు సరిపోలేదా? ఒకే గదిని రెండుగా విభజించి.. రెండు తరగతులు నిర్వహించండి. ఇంకా సరిపోలేదా? హెడ్‌మాస్టర్‌, ఉపాధ్యాయులు, పీఈటీల కోసం కేటాయించిన గదులను వాడుకోండి’’-ఇదీ పాఠశాలల విలీనంతో ఇబ్బందులు పడుతున్న చోట అనుసరించాల్సిన విధానంపై ప్రభుత్వం చెప్పిన మాట. గతంలో 3 నుంచి 5 తరగతులు చదివే విద్యార్థులు తరగతికి 40 మందే ఉండేవారు. ఇప్పుడు 45కు పెంచారు. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు అయితే ఏకంగా తరగతికి 52 మంది విద్యార్థులను కేటాయించారు. 9, 10 తరగతులకైతే ఒక సెక్షన్‌ను 60 మందికి పెంచారు. ఈ సంఖ్య కన్నా ఎక్కువ మంది విద్యార్థులుంటే రెండో సెక్షన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది. అంతేకాదు.. ఇక నుంచి మూడో 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకూ ఒకే మాధ్యమంలో పాఠాలను బోధించనున్నారు. అది కూడా ఇంగ్లీషే కావడం గమనార్హం. పాఠశాలల విలీనానికి సంబంధించి విద్యాశాఖ తాజాగా శనివారం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రాథమిక పాఠశాలలను ఒక కిలోమీటరు దూరంలో ఉన్న అప్పర్‌ ప్రైమరీ, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తున్న విషయం తెలిసిందే. తొలుత ఒక కిలోమీటరు దూరంలో ఉన్న ప్రాథమిక బడులు, ఆ తర్వాత 3 కిలోమీటర్ల పరిధిలోని పాఠశాలలను విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏ ప్రాథమిక పాఠశాలలోని 3, 4, 5 తరగతులను ఏ ఉన్నత పాఠశాలలో విలీనం చేయాలన్నదానిపై మ్యాపింగ్‌ కూడా దాదాపుగా పూర్తిచేసింది. దీని ప్రకారం 9, 10 తరగతుల్లో ఏకంగా తరగతికి 60 మంది వరకు ఉండొచ్చని పేర్కొన్నారు. అంతకుమించితేనే రెండో సెక్షనును ఏర్పాటుచేస్తారు. ఆ తర్వాత ఏర్పాటుచేసే సెక్షన్స్‌లో మాత్రం 39 మందిని కేటాయించాలని పేర్కొన్నారు. రెండో సెక్షన్‌ను 39మందికి ఒకటి చొప్పున ఏర్పాటుచేస్తూ.. మొదటి సెక్షన్‌ను మాత్రం 60మందితో ఎందుకు ఏర్పాటు చేస్తున్నారనేది ప్రశ్న. దీనివెనుక మతలబు చూస్తే ఎంతమంది విద్యార్థులున్నా వీలైన మేరకు ఒకే సెక్షన్‌లో సరిపెట్టేయానే ఆలోచన కనిపిస్తోందని ఉపాధ్యాయులే అంటున్నారు. రెండో సెక్షన్‌ ఏర్పాటుచేస్తే మళ్లీ తరగతి గదులు కావాలి, ఉపాఽధ్యాయులు కావాలి.. కానీ ఈ రెండూ లేకున్నా విలీనం చేసేందుకు ముందుకెళ్తున్న ప్రభుత్వం ఈ విధమైన నిబఽంధనలు పెట్టిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలావుంటే, ఒక్కో తరగతిలో విద్యార్థుల సంఖ్యను పెంచడం వల్ల బోధన ప్రభావవంతంగా ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తరగతికి 35-40 మంది వరకు విద్యార్థులుంటే అందరినీ ఉపాధ్యాయులు గమనించి.. చదువులో ముందుకెళ్లేలా మార్గనిర్దేశనం చేసేందుకు ఉపకరిస్తుంది. విద్యార్థుల సంఖ్య పెరిగేకొద్దీ వారిపై టీచర్ల వ్యక్తిగత శ్రద్ధ తగ్గుతుంది.


ఉపాధ్యాయుల కొరత

మరోవైపు రెండు మాధ్యమాలు.. ఆంగ్లం, తెలుగు కొనసాగిస్తే ఉపాధ్యాయుల సంఖ్య కూడా పెరుగుతుంది. కానీ, అంతమంది ఉపాధ్యాయుల్లేరు. ఉపాధ్యాయ నియామకాలను ప్రభుత్వం చేపట్టడం లేదు. ప్రపంచబ్యాంకు నుంచి సాల్ట్‌ పథకం కోసం రుణం తీసుకునేందుకు అసలు ఉపాధ్యాయ ఉద్యోగాలే భర్తీ చేయబోమన్న షరతుకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఉన్న ఉపాధ్యాయులతోనే తరగతులు నడిపించాలంటే ఒకే మీడియం ఉండేలా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.  పాఠశాలల విలీనం తర్వాత ఒక ఉన్నత పాఠశాలలో 10 తరగతి గదులు కావాల్సి ఉండి.. 9  మాత్రమే ఉంటే.. ఒక తరగతి గదిని రెండుగా విభజించి రెండు తరగతులు చెప్పాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.  


‘అమ్మఒడి’కి అర్హుల సర్వే!

ఈ ఏడాది అమ్మఒడి పథకం అర్హులు, అనర్హులను గుర్తించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల సర్వే చేయాలని నిర్ణయించింది. దీనికిగాను ఒక మొబైల్‌ అప్లికేషన్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు. 

Updated Date - 2022-05-22T08:44:32+05:30 IST