ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సేవల విస్తరణ

ABN , First Publish Date - 2022-05-22T08:22:57+05:30 IST

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సేవల విస్తరణ

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌  సేవల విస్తరణ

తెలుగు రాష్ట్రాల్లో 3 ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటు: చంద్రబాబు


గూడూరు రూరల్‌, మే 21: తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను ఆదుకునేందుకు ఎన్టీఆర్‌ ట్రస్టు సేవలను విస్తరింపజేసినట్లు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లా గూడూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రూ.50 లక్షలతో  ట్రస్ట్‌  ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ ప్లాంట్‌ను జిల్లా అదనపు కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ శనివారం ప్రారంభించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడారు. ట్రస్టు ఆధ్వర్యంలో గూడూరుతోపాటు ఏపీలోని కుప్పం, టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ప్లాంట్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జూమ్‌యాప్‌ ద్వారా వీడియోలింక్‌ను షేర్‌ చేసి లక్షలాది మంది కొవిడ్‌ బాధితులకు ట్రస్టు ద్వారా టెలీమెడిసిన్‌ సేవలు అందించినట్లు తెలిపారు. దేశ, విదేశీ వైద్య నిపుణులతో ఏర్పాటు చేసిన వైద్యబృందాలు వీడియోకాల్‌ ద్వారా వైద్యం అందించినట్లు పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్టు, తెలుగుదేశం పార్టీ సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. విద్య, ఆరోగ్యం, స్వయం ఉపాధిరంగాల్లో ట్రస్టు సేవలందిస్తున్నట్లు వివరించారు. గూడూరు ఏజెన్సీ ప్రాంతంలో ఎన్టీఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయడం అభినందనీయమని  అదనపు కలెక్టర్‌ అభిలాష అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కరోనాబారీన పడినవారికి ఉచితంగా ఆక్సిజన్‌ ఆందించేందుకు ఈ ప్లాంట్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.  ట్రస్టు ప్రతినిధి రాజీవ్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కిని నర్సింహులు, పార్టీ నేతలు బండి పుల్లయ్య, రాజునాయక్‌, సునీత, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ భూక్య వెంకట్రాములు, స్థానిక ఆస్పత్రి ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ భరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

Updated Date - 2022-05-22T08:22:57+05:30 IST