బదిలీ చేసినా కదలడు

ABN , First Publish Date - 2022-05-22T09:03:57+05:30 IST

బదిలీ చేసినా కదలడు

బదిలీ చేసినా కదలడు

దేవదాయశాఖ కర్నూలు డీసీ వింత వ్యవహారం

ఇప్పటికి రెండుసార్లు బదిలీ ఉత్తర్వులు


అమరావతి, మే 21 (ఆంధ్రజ్యోతి): ‘ప్రభుత్వం బదిలీ చేస్తే నాకేంటి? నేను ఎక్కడికీ వెళ్లను... ఈ సీటు వదిలే ప్రసక్తే లేదు’ అని ఓ అధికారి మొండి పట్టు పట్టడం ఎక్కడైనా చూశారా? ఇంకెక్కడైనా అయితే సాధ్యం కాదేమోకానీ దేవదాయశాఖలో మాత్రం ఇలాంటి వింతలు, విడ్డూరాలకు కొదవే ఉండదు. ప్రస్తుతం కర్నూలు డిప్యూటీ కమిషనర్‌గా(ఎ్‌ఫఏసీ) ఉన్న రాణా ప్రతాప్‌ ఇదే వ్యవహారశైలి ప్రదర్శిస్తున్నారు. విజయవాడలోని దేవదాయ కమిషనరేట్‌లో గజిటెడ్‌ సూపరింటెండెంట్‌గా ఉన్న రాణాప్రతాప్‌... దాదాపు ఏడాదిన్నర కాలంగా కర్నూలు డిప్యూటీ కమిషనర్‌ బాధ్యతలను అదనంగా చూస్తున్నారు. విజయవాడ నుంచి కర్నూలు 400 కిలోమీటర్ల దూరం. అయినా ఆయన రెండూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే గతేడాది సెప్టెంబరులో డిప్యూటీ కలెక్టర్ల బదిలీల్లో భాగంగా కర్నూలు డీసీగా డిప్యూటీ కలెక్టర్‌ తిప్పే నాయక్‌ను డిప్యుటేషన్‌పై నియమిస్తూ...సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఉత్తర్వులు వచ్చినా అక్కడినుంచి రిలీవ్‌ కాకుండా కొద్దికాలానికి ఉత్తర్వులు మార్పించుకున్నారు. మళ్లీ తాజాగా గత ఏప్రిల్‌లో మళ్ళీ రాణాకు అదనపు బాధ్యతలు తప్పించి తిరిగి తిప్పే నాయక్‌ను డీసీగా నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీచేసింది. ఈ ఉత్తర్వులు విడుదలై నెల రోజులైనా ఇప్పటికీ ఆయన డీసీ పోస్టు నుంచి రిలీవ్‌ కాలేదు. మరోసారి జీవోను మార్పించుకునే ప్రయత్నాల్లో ఉన్న ఆయన కర్నూలు డీసీ ఆఫీసు నుంచి కదలడం లేదు. కాగా ఇదే విషయంపై ఆయనను వివరణ కోరగా...తనకు అధికారికంగా బదిలీ ఉత్తర్వులు అందలేదని, అందువల్ల రిలీవ్‌ కాలేదని తెలిపారు. దీంతో స్వయంగా చీఫ్‌ సెక్రటరీ ఇచ్చిన జీవోను దేవదాయ కమిషనర్‌ ఎందుకు అధికారికంగా పంపలేదనేది అనుమానంగా మారింది. మరోవైపు నెల రోజుల నుంచి అటు రెవెన్యూలోనూ, ఇటు జీవో ప్రకారం దేవదాయశాఖలోనూ ఎక్కడా పోస్టింగ్‌ లేక తిప్పేనాయక్‌ అయోమయంలో ఉన్నారు. దీనిపై దేవదాయ మంత్రి, ఉన్నతాధికారులను కలిసినా స్పందన కరువైంది. ప్రభుత్వం జీవో ఇచ్చినా తన చేతికి అధికారికంగా ఆర్డర్‌ కాపీ వచ్చేవరకూ కదిలేదే లేదని రాణాప్రతాప్‌ అంటున్నారు. మరోవైపు తనను అదే సీటులో కొనసాగించాలని మంత్రులు, ఎమ్మెల్యేలతో దేవదాయ మంత్రికి ఫోన్లు చేయిస్తున్నారని, పదే పదే ఫోన్లు చేయించడంపై దేవదాయ మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారని తెలిసింది. కానీ ఈ వ్యవహారంలో దేవదాయ అధికారుల తీరు కూడా అనుమానాస్పదంగా ఉంది. 

Updated Date - 2022-05-22T09:03:57+05:30 IST